Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ మూవీలో బ్రహ్మానందం పాత్ర ఏమిటీ...
ABN , Publish Date - Jul 23 , 2025 | 10:50 AM
'హరిహర వీరమల్లు' సినిమాలో బ్రహ్మానందం డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ తో జనం ముందుకు రాబోతున్నారని మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సుమ తెలిపింది. ఇంతకూ అసలు బ్రహ్మానందం ఆ సినిమాలో ఉన్నారా!?
సినిమా ఫంక్షన్స్ కు యాంకరింగ్ చేయడం అంత ఈజీ కాదు... ఆ సినిమా గురించి, అందులో నటించే నటీనటులు గురించి సాంకేతిక నిపుణుల గురించి, నిర్మాణ సంస్థ గురించి బోలెడన్ని విషయాలు తెలిసి ఉండాలి. చివరి నిమిషంలో అతిథుల విషయంలో జరిగే మార్పులు చేర్పులను గుర్తించి, అందుకు అనువుగా ప్రిపేర్ కావాలి. ఇలాంటి విషయంలో లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నా సుమ (Suma)ను సినిమా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఫుల్ జోష్ తో, చలాకీగా కార్యక్రమాన్ని నడపడమే కాదు... సమయస్ఫూర్తితో సుమ ప్రోగ్రామ్ ను రక్తికట్టిస్తుంది. పైగా సినిమా రంగంతో దశాబ్దాల అనుబంధం ఉన్న కారణంగా ఆమెకు అనేక విషయాలు, అనేక మంది విషయాలు కరతలామలకం.
అయితే... ఒక్కోసారి సుమలోని కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫడెన్స్ గా మారిపోతుంది. సరైన సమాచారాన్ని నిర్వాహకులు ఇవ్వకపోవడంతో కొన్ని తప్పులూ జరిగిపోతుంటాయి. మరీ ముఖ్యంగా పదాలను వరదలా ఉపయోగిస్తూ ఒక్కోసారి సుమ భంగపాటుకూ గురౌతుంది. మరీ అంత తప్పుపట్టాల్సిన విషయం కాదు గానీ సుమ 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం (Brahmanandam) ను ఆకాశానికి ఎత్తేస్తూ... 'ద డైనమిక్, ద యంగ్, ద ఎనర్జిటిక్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిన్నిస్ బుక్ విజేత... బ్రహ్మానందం డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో అలరించడానికి సిద్థమైపోయారు' అంటూ వేదిక మీదకు ఆహ్వానించింది.
చిత్రం ఏమంటే... 'హరిహర వీరమల్లు'లో అసలు బ్రహ్మానందం నటించలేదు. ఆయన పట్ల ఉన్న అభిమానం కొద్ది పవన్ కళ్యాణ్, ఎ. ఎం. రత్నం (A.M. Ratnam) 'హరిహర వీరమల్లు' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బ్రహ్మానందంను ఆహ్వానించారు. ఓ రకంగా ఆయన గెస్ట్ గా ఈ వేడుకలో పాల్గొన్నారు. 'సినిమాలో నటించకపోతే బ్రహ్మానందం ఎందుకు వస్తారు?' అనే భావనతో బహుశా సుమ అలా అనేసి ఉండొచ్చు. బట్... బ్రహ్మానందంకు ఈ సినిమాతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా... పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఉన్న ప్రత్యేక సంబంధం కారణంగా ఈ వేడుకకు ఆయన హాజరయ్యారు. పవన్ గురించి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి సభాముఖంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. ఇక ఉపన్యాసాన్ని ముగిస్తూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ కు పవన్ కళ్యాణ్ పడిపడి నవ్వుకున్నారు. కార్యక్రమమంతా యమా సీరియస్ గా కనిపించిన పవన్ కళ్యాణ్... మనసారా నవ్వుకుంది మాత్రం బ్రహ్మానందం మాట్లాడుతున్నప్పుడే!
ఇంతకూ బ్రహ్మానందం 'హరిహర వీరమల్లు'లో ఎందుకు నటించలేదు? ఆయనకు ఈ సినిమాలో ఛాన్స్ ఎందుకు దక్కలేదు? అని ఆరాతీస్తే... ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ మొదలు పెట్టినప్పుడే బ్రహ్మానందంను ఓ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట. అది వజ్రాల వర్తకుడి పాత్ర అట. పవన్ కళ్యాణ్ తో కొన్ని కీలక సన్నివేశాలు ఈ పాత్రకు ఉంటాయట. కారణం తెలియదు కానీ ఆ పాత్రను సినిమాలో బ్రహ్మానందం కాకుండా మురళీశర్మ చేశారు. అయితే... రెండు భాగాలుగా రాబోతున్న 'హరిహర వీరమల్లు'లో బ్రహ్మానందం నటించే అవకాశం లేకపోలేదు. ఈ సినిమా రెండో భాగంలో ఓ కీలక పాత్రను జ్యోతికృష్ణ బ్రహ్మానందంతో చేయించబోతున్నాడని తెలుస్తోంది. సో... సుమ వాక్కు బ్రహ్మ వాక్కుగా మారి... బ్రహ్మానందం 'హరిహర వీరమల్లు' పార్ట్ -2లో నిజంగానే నటిస్తారేమో చూడాలి.
Also Read: Karuppu: సూర్య డ్యూయల్ షేడ్స్.. కరుప్పు టీజర్‌లో మాస్ ఫీస్ట్!
Also Read: Harihara Veeramallu: డిప్యూటీ సీఎంలతో నిధి అగర్వాల్ కు స్పెషల్ బాండింగ్...