Tollywood: నిన్న నర్సయ్య.. నేడు వనజీవి రామయ్య...
ABN, Publish Date - Nov 24 , 2025 | 03:57 PM
తెలంగాణ సమాజం కోసం పాటుపడిన ఇద్దరు అసమాన్యుల జీవితం వెండితెరకెక్కుతోంది. అందులో ఒకరు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య కాగా మరొకరు పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్గీయ వనజీవి రామయ్య.
ఏ పాత్ర ఎలా ఎవరిని వరిస్తుందో చెప్పలేం. నిన్న కాక మొన్న ప్రజా నాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) బయోపిక్ కు సంబంధించిన వార్త వచ్చింది. కమ్యూనిస్టు నాయకుడు గుమ్మడి నర్సయ్య పాత్రను కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shiv Rajkumar) చేస్తున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే శివ రాజ్ కుమార్ లో గుమ్మడి నర్సయ్యను చూసిన దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఆయన్ని ఒప్పించారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా... శివ రాజ్ కుమార్ ... గుమ్మడి నర్సయ్య పాత్రను చేయడానికి ముందుకొచ్చారు. 'గుమ్మడి నర్సయ్య' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన తర్వాత ఆ పాత్రకు శివ రాజ్ కుమార్ న్యాయం చేస్తారనే నమ్మకం అందరికీ కలిగింది.
ఇదిలా ఉంటే... తాజాగా నటుడు బ్రహ్మాజీ (Brahmaji) సైతం తెలంగాణ మట్టి మనిషి, వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah) బయోపిక్ లో నటిస్తున్న విశేష వార్త వెలువడింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్య గా పేరు తెచ్చుకున్న వనజీవి దరిపల్లి రామయ్య బయోపిక్ ను వేముగంటి (Vemuganti) దర్శకత్వంలో లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. బల్లేపల్లి మోహన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఖమ్మంలో మొదలైంది. వనజీవి రామయ్య పాత్రలో బ్రహ్మాజీ ఖచ్చితంగా ఇమిడిపోతారనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో స్థానికులతో పాటు, రామయ్య సన్నిహితుల మిత్రులు సైతం నిజ జీవిత పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద సమాజం కోసం జీవితాలను సమర్పించిన తోటి మట్టి మనుషుల జీవిత గాథలు వెండితెరపై ఆవిష్కృతం కావడం అందరినీ ఆనంద పరుస్తోంది.
Also Read: Dharmendra: విలక్షణ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
Also Read: Raviteja: రైలు ప్రమాదంలో మరణించిన రవితేజ సినిమా దర్శకుడు...