Bhartha Mahasayulaku Wignyapthi Teaser: ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు రీమేక్ లా ఉందేంటి
ABN, Publish Date - Dec 19 , 2025 | 05:38 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఒక హిట్ కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నాడు. యాక్షన్ మార్చాడు.. యాస మార్చాడు .. భాష మార్చాడు.. జానర్ మార్చాడు కానీ, ఏది వర్క్ అవుట్ కాలేదు.
Bhartha Mahasayulaku Wignyapthi Teaser: మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఒక హిట్ కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నాడు. యాక్షన్ మార్చాడు.. యాస మార్చాడు .. భాష మార్చాడు.. జానర్ మార్చాడు కానీ, ఏది వర్క్ అవుట్ కాలేదు. ఈసారి తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ లక్ పరీక్షకోబోతున్నాడు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథన్ (Ashika Ranganadhan), డింపుల్ హయాతి(Dimple Hayathi) నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అప్పట్లో వెంకటేష్ ఇద్దరు భార్యలతో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో ఒక ట్రెండ్ సృష్టించాడు. ఇలాంటి కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. వచ్చినవన్నీ తమ స్థాయిలో మంచి విజయాలనే అందుకున్నాయి. దీంతో ఆ హిట్ ఫార్ములాతోనే రవితేజ రాబోతున్నాడు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ విషయానికొస్తే.. రవితేజకు.. డింపుల్ హయాతీతో పెళ్లి అవుతుంది. భర్త అంటే రాముడు.. అందరి మగాళ్లకు ఆదర్శం అనుకొనే మహిళ. భర్త కూడా అలాగే ఉండేవాడు. కానీ, ఒకసారి క్యాంప్ కోసం స్వీడన్ కి వెళ్లిన రవితేజకు.. అక్కడ ఆషికా రంగనాథన్ పరిచయమవుతుంది. కొన్ని కారణాల వలన తనకు పెళ్లి కాలేదని, ఆమెతో కమిట్ అవుతాడు. ఇక ఇంటికి తిరిగొచ్చాకా.. అటు భార్యకు.. ప్రియురాలి గురించి చెప్పలేక.. ఇటు ప్రియురాలిని వదిలించుకోలేకా తెగ కష్టపడుతుంటాడు. మరి ఇల్లాలు.. ప్రియురాలు మధ్య భర్త అయిన రవితేజ ఎలా నలిగిపోయాడు.. ? కిషోర్ తిరుమల ఇలాంటి కథతో ప్రేక్షకులకు ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
టీజర్ చూసిన వెంటనే చాలామందికి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా గుర్తురాకమానదు. కానీ, రవితేజ కామెడీ, ఆషికా అందాలు.. కిషోర్ తిరుమల స్క్రీన్ ప్లే.. అన్నింటికీ మించి భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసేలా కనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. సంక్రాంతికి అసలు సిసలైన కుటుంబా కథా చిత్రమని, ఈసారి ఎలాగైనా రవితేజ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి రవితేజ ఈ సంక్రాంతికి మొగుడు అవుతాడా.. ? లేదా అనేది చూడాలి.