Shiva Rajkumar: వెండితెరపై.. ప్రజానాయకుడి జీవితం! 'గుమ్మడి నర్సయ్య'.. బయోపిక్‌లో శివరాజ్ కుమార్
ABN, Publish Date - Oct 22 , 2025 | 06:52 PM
ఇల్లెందు శాసన సభ్యునిగా ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజల మనిషి గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) జీవిత చరిత్ర తెరపైకి రాబోతోంది. నిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి పేరుంది. ఆయన 1983 నుండి 1994 వరకూ, ఆ తర్వాత 1999 నుండి 2009 వరకూ ఇల్లందు శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన బయోపిక్ ను ఎన్. సురేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్య పాత్రను సీనియర్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Dr Shiva Rajkumar) పోషిస్తున్నారు.
తాజాగా 'గుమ్మడి నర్సయ్య' బయోపిక్ నుండి శివరాజ్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీన్ని చూస్తుంటే... గుమ్మడి నర్సయ్య పాత్రకు శివ రాజ్ కుమార్ ప్రాణం పోసినట్టుగా కనిపిస్తోంది. ఆ లుక్, వేషధారణ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. సైకిల్, వెనకాల ఉన్న అసెంబ్లీ, ఎర్ర కండువా ఇలా అన్నీ కూడా ఎంతో అథెంటిక్‌గా అనిపిస్తున్నాయి. ఇక మోషన్ పోస్టర్‌లో ఎమ్మెల్యేలు అంతా కూడా కారులో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌లో రావడం.. ఆ మ్యూజిక్, ఆర్.ఆర్., విజువల్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తామని ఎన్. సురేశ్ రెడ్డి చెప్పారు. ఈ సినిమాకు కెమెరామెన్ సతీశ్ ముత్యాల, సంగీతం సురేశ్ బొబ్బిలి, ఎడిటర్ సత్య గిడుటూరి సమకూర్చుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
Also Read: Thursday TV Movies: గురువారం, Oct 23.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Also Read: Kantara : Chapter 1: అక్టోబర్ 31 నుండి ఆంగ్లంలోనూ...