Bhairavam: మాస్ కమర్షియల్ హీరోగా బెల్లంకొండ...
ABN , Publish Date - May 27 , 2025 | 12:40 PM
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ మొదలై పదేళ్ళు పూర్తయిపోయింది. యేడాదికి సగటు ఒక సినిమా చేశాడు సాయి శ్రీనివాస్. అతని పదవ చిత్రంగా 'భైరవం' ఈనెల 30న రాబోతోంది.
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) కెరీర్ పదేళ్ళ క్రితం 'అల్లుడు శీను' (Alludu Seenu) తో మొదలైంది. ఈ పదేళ్ళలో సగటున ఒక సినిమా చొప్పున సాయి శ్రీనివాస్ పది సినిమాలు చేశారు. అందులో తొమ్మిది తెలుగు సినిమాలు కాగా, ఒకటి హిందీ సినిమా. అతని పదో చిత్రం 'భైరవం' (Bhairavam) ఈ నెల 30న జనం ముందుకు రాబోతోంది.
ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ (V.V. Vinayak) తో బెల్లంకొండ సురేశ్ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ 2014లో 'అల్లుడు శీను' మూవీని నిర్మించారు. తొలి చిత్రంతోనే సాయి శ్రీనివాస్ కు మంచి గుర్తింపు లభించింది. సమంత (Samantha) హీరోయిన్ గా నటించగా, మిల్కీ బ్యూటీ తమన్నా (Thamannah) అందులో ఐటమ్ సాంగ్ లో నర్తించింది. ఆ తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చేసిన 'స్పీడున్నోడు' మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన 'జయ జానకీ నాయక' అతనికి యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత నటించిన 'సాక్ష్యం, కవచం, సీత' చిత్రాలు ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. అయితే తమిళ రీమేక్ 'రాక్షకుడు' (Rakshasudu) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు తొలి కమర్షియల్ హిట్ ను అందించింది. ఆ సినిమా సక్సెస్ మీట్ లో బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ, తాను శ్రీనును హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన 'అల్లుడు శీను' మంచి పేరు తెచ్చిపెట్టినా... తనకు నిర్మాతగా మూడు కోట్ల నష్టం వచ్చిందని, అయితే ఆ సినిమాకు తగిన పబ్లిసిటీ చేయడం కోసం తానే ఎక్కువ ఖర్చు చేశానని అంగీకరించారు. ఆ రకంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో విజయం సాధించిన సినిమా 'రాక్షకుడు' ఒక్కటే. ఆ తర్వాత వచ్చిన 'అల్లుడు అదుర్స్', హిందీ చిత్రం 'ఛత్రపతి' (Chatrapathi) కూడా పరాజయం పాలయ్యాయి.
ఈ నేపథ్యంలో అందరి దృష్టి అతని తాజా చిత్రం 'భైరవం' మీద ఉంది. తమిళ చిత్రం 'గరుడన్' (Garudan) కు ఆధారంగా ఇది తెరకెక్కింది. సామాజికాంశంతోనే 'నాంది' (Naandi) సినిమాను రూపొందించిన విజయ్ కనకమేడల ఈ కథను అద్భుతంగా డీల్ చేశాడని అందరూ అంటున్నారు. సాయి శ్రీనివాస్ తో పాటు ఇందులో మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) బలమైన పాత్రలను పోషించడంతో మూవీ మరో రేంజ్ లో ఉంటుందని ఊహిస్తున్నారు. నిర్మాత కె.కె. రాధామోహన్ సైతం ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని, ఈ సినిమా అతన్ని మాస్ కమర్షియల్ హీరోల సరసన నిలబెడుతుందన్నది ఫిల్మ్ నగర్ సమాచారం.
అదే జరిగితే... సాయి శ్రీనివాస్ నటిస్తున్న మిగిలిన సినిమాలకు బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సాయి శ్రీనివాస్ నటిస్తున్న మూడు సినిమాలు 'టైసన్ నాయుడు', 'హైందవ', 'కిష్కింద పురి' ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఒకవేళ 'భైరవం' అందరూ అనుకుంటున్నట్టు మంచి విజయాన్ని నమోదు చేసుకుంటే... ఈ మూడు సినిమాలను మరింత భారీ మేకర్స్ తెరకెక్కించవచ్చు. ఏదేమైనా... 'భైరవం'తో పాటు మంచి కథాచిత్రాలనే సాయి శ్రీనివాస్ లైన్ లో పెట్టాడని సన్నిహితులు చెబుతున్నారు.
Also Read: Dhadak 2: త్రిప్తి డిమ్రీ మూవీ వచ్చేది ఎప్పుడంటే...
Also Read: Spirit: సందీప్ రెడ్డి వంగాకు కోపమొచ్చింది...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి