Spirit: సందీప్ రెడ్డి వంగాకు కోపమొచ్చింది...
ABN , Publish Date - May 27 , 2025 | 10:51 AM
సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తీయబోతున్న 'స్పిరిట్' ఇంకా పట్టలెక్కలేదు. కానీ రకరకాల కారణాలతో ఇది మీడియాలో నానుతూ ఉంది.
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కు కోపం వచ్చింది. 'స్పిరిట్' (Spirit) చిత్రంలో ప్రభాస్ (Prabhas) సరసన త్రిప్తి డిమ్రీ (Tripthi Dimri) ని ఎంపిక చేసుకున్నట్టు ప్రకటించి ఒకటి రెండు రోజులు గడవక ముందే ఆ సినిమాకు సంబంధించిన కథ లీక్ అయినట్టు సందీప్ రెడ్డి వంగా గ్రహించాడు. నిజానికి 'స్పిరిట్' సినిమాలో ముందుగా దీపికా పడుకోణె ను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఆ విషయమై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఎప్పుడైతే త్రిప్తి డిమ్రీని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టు ప్రకటన వచ్చిందో... అప్పుడు ఆ పాత్ర గురించి, ఆ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో కొంత సమాచారం చక్కర్లు కొట్టింది. హీరోయిన్ కు సంబంధించిన సన్నివేశాలు శృంగారభరితంగా ఉంటాయని, అందుకే దీపికా పడుకోణె ఈ సినిమా కు నో చెప్పిందని కొందరు వ్యాఖ్యానించారు. ఈ రకమైన వార్తలు వ్యాపించడం వెనుక దీపికా పడుకోణె పీఆర్ టీమ్ ఉందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని 'స్పిరిట్' దర్శక నిర్మాత సందీప్ రెడ్డి వంగా సీరియస్ గా తీసుకున్నాడు. అతను ఎక్స్ వేదికగా తన మనసులో భావాలను వెల్లడించాడు. ఎవరికైనా ఓ కథను చెప్పినప్పుడు అవతలి ఆర్టిస్టును తాను నూరు శాతం విశ్వసిస్తానని, తమ మధ్య ఈ విషయాన్ని మూడో వక్తికి చెప్పకూడదనే ఓ నైతికమైన మాట ఉంటుందని అన్నాడు. అయితే ఓ ఫెమినిస్ట్ అయిన నటి దీనిని ఉల్లంఘించిందని దీపికా పదుకోణె పేరు ప్రస్తావించకుండానే సందీప్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ దర్శకుడు తన సినిమా కథను తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో ఇలాంటి వ్యక్తులకు ఎప్పటికీ తెలియదని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా ఇలా తన తాను చెప్పిన సన్నివేశాలు లీక్ చేయడంతో తనకేమీ నష్టం లేదని, ఈ సారి కేవలం తమ పాత్ర గురించే కాకుండా పూర్తి సినిమా గురించి అడిగినా చెబుతానంటూ ముక్తాయించాడు. సందీప్ రెడ్డి వంగా దీపికా పదుకోణె పేరు ప్రస్తావించకపోయినా... క్రింద చాలామంది ఇది ఆమెను, ఆమె పీఆర్ టీమ్ ను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని బదులిచ్చారు. మరికొందరైతే దీపిక, ఆమె టీమ్ ఎంత అనైతికతతో ప్రవర్తిస్తుంటారో ఉదాహరణలతో పేర్కొనడం మొదలెట్టారు. అయితే దీపికా గొంతెమ్మ కోర్కెలను తీర్చలేకే 'స్పిరిట్' దర్శక నిర్మాతలు ఆమెను వద్దనుకున్నారని తెలుస్తోంది. మొత్తానికీ ప్రభాస్ 'స్పిరిట్' సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందే వివాదాస్పదమైన కారణాలతో మీడియాలో బాగానే నానుతోంది.
Also Read: Manchu Vishnu: కన్నప్పకెన్ని కష్టాలో...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి