Theatre Bandh: మూడు సెక్టార్స్ తో మీటింగ్
ABN, Publish Date - May 22 , 2025 | 02:57 PM
తెలుగు ఎగ్జిబిటర్స్, బయ్యర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం ఏర్పడే ఆస్కారం కనిపిస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు కలిసి ఈ శనివారం చర్చించు కోబోతున్నారు.
థియేటర్ల బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లే అని ఓ పక్క ఎగ్జిబిటర్స్ చెబుతుంటే... మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకూ అమలు అవుతున్న రెంటల్ సిస్టమ్ ను కాదని పర్సంటేజ్ కు సినిమాలు ఆడితే తమ కొచ్చే నష్టం గురించి, దానిని ఎలా తగ్గించుకోవాలనే దానిపైన మల్లగుల్లలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం విడి విడిగా జరిగిన ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో వారు ఎటూ తేల్చుకోలేకపోయారు. నిజానికి చాలా మంది నిర్మాతల్లోనే బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ కూడా ఉన్నారు. దాంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ఛాంబర్ నేతృత్వంలో ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ మూడు సెక్టార్స్ నుండి కొందరిని ఎంపిక చేసి... ఓ కమిటీని వేసి ఈ సమస్యకు పరిష్కారం వెతకమని కోరబోతున్నట్టు సమాచారం.
మూడు సెక్టార్లకు సంబంధించి వేసే జాయింట్ కమిటీ మీటింగ్ మే 24, శనివారం జరుగబోతోందట. ఉదయం నుండి సాయంత్రం వరకూ రెంటల్, పర్సంటేజ్ లో సినిమాలను ఆడితే వచ్చే కష్టనష్టాల గురించి సమగ్రంగా చర్చించి, ఓ నిర్ణయానికి తెలుగు సినిమా రంగం వస్తుందని అంటున్నారు.
ఎగ్జిబిటర్స్ కోరినట్టుగా పర్సంటేజ్ సిస్టమ్ కు నిర్మాతలు, పంపిణీ దారులు అంగీకరిస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే మాత్రం బంద్ అనే మాట నెత్తిమీద కత్తిలా ఎప్పటికీ వేలాడుతూనే ఉంటుంది. అయితే... జూన్ 5న కమల్ హాసన్, మణిరత్నం పాన్ ఇండియా మూవీ 'థగ్ లైఫ్', 12న పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' విడుదల కాబోతున్న నేపథ్యంలో వాతావరణం కాస్తంత వేడెక్కినట్టు తెలుస్తోంది. ఈ రెండు పెద్ద సినిమాల ప్రదర్శనకు ఆటంకం కలగకుండా థియేటర్లను రన్ చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే... నిదానంగా మాట్లాడుకుందామని ఎగ్జిబిటర్స్ ను కొందరు నిర్మాతలు, పంపిణీ దారులు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. మరి ఎగ్జిబిటర్స్ వీరి మాటలను వింటారా లేదా అనేది చూడాలి. నిజానికి ఇలాంటి పెద్ద సినిమాల విడుదల సమయంలోనే తమ మొరను నిర్మాతలు, బయ్యర్లు ఆలకిస్తారనేది ఎగ్జిబిటర్స్ చెబుతున్నమాట.
Also Read: Spirit: ప్రభాస్ మూవీ నుండి తప్పుకున్న దీపిక...
Also Read: Pan India: రాజమౌళి, సుకుమార్... ఆ తర్వాత...
Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి