సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saroja Devi: తెలుగుపలుకులు చిలుక పలుకుల్లా

ABN, Publish Date - Jul 14 , 2025 | 02:37 PM

బి.సరోజాదేవి మాతృభాష కన్నడ. అందువల్ల తెలుగు, తమిళ భాషల్లో నటించేటప్పుడు బ్లాక్ బోర్డ్ పై చాక్ పీస్ తో కన్నడలో డైలాగ్స్ రాసుకొని వల్లించేవారు.

బి. సరోజాదేవి మాతృభాష కన్నడ. అందువల్ల తెలుగు, తమిళ భాషల్లో నటించేటప్పుడు బ్లాక్ బోర్డ్ పై చాక్ పీస్ తో కన్నడలో డైలాగ్స్ రాసుకొని వల్లించేవారు. ఆమె నోట తెలుగుపలుకులు చిలుక పలుకుల్లా ఉండేవని జనం అనేవారు. అంతేకాదు నవ్వుల రాణిగానూ సరోజాదేవిని తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ సరోజాదేవి సాగారు.

సరోజాదేవిని మెచ్చిన డైరెక్టర్స్ !

తెలుగునాట సరోజాదేవిని ఎక్కువగా అభిమానించిన దర్శకుడు కేవీ రెడ్డి. ఆయన రూపొందించిన 'జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రము, ఉమాచండీ గౌరీశంకరుల కథ' చిత్రాల్లో సరోజాదేవి నటించారు. ఈ చిత్రంలలో మొదటి రెండు బిగ్ హిట్స్ కాగా, తరువాతి రెండు పరాజయం పాలయ్యాయి. ఈ నాలుగు చిత్రాల్లోనూ యన్టీఆర్ కూడా నటించడం విశేషం. అయితే 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో యన్టీఆర్, సరోజాదేవి అన్నాచెల్లెళ్ళుగా అభినయించారు. కేవీ రెడ్డి తరువాత యన్టీఆర్ దర్శకత్వంలోనే సరోజాదేవి మూడు సార్లు నటించారు. యన్టీఆర్ డైరెక్టర్ గా తొలి చిత్రం 'సీతారామకళ్యాణం'లోనూ, చివరి సినిమా 'సమ్రాట్ అశోక'లోనూ సరోజాదేవి అభినయించారు. 'దానవీరశూర కర్ణ'లో కర్ణుని భార్య ప్రభావతి పాత్రలోనూ సరోజాదేవి యన్టీఆర్ డైరెక్షన్ లో నటించారు.


వానపాట... సరోజాదేవి...

శ్రీదేవి తరువాతి రోజుల్లో అందరు హీరోలతోనూ వానపాటల్లో నటించి మెప్పించారు. అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరి చిత్రాల్లోనూ వానపాటల్లో మురిపించిన తారగా సరోజాదేవి నిలిచారు. 'ఆత్మబలం' (1964)లోని 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...' సాంగ్ లో ఏయన్నార్ జోడీగా నటించిన సరోజాదేవి ప్రేక్షకులను తన అందంతో కట్టి పడేశారు. ఆ పై యన్టీఆర్ 'భాగ్యచక్రము' (1968)లో 'వాన కాదు వానకాదు... వరదా రాజా...' సాంగ్ లోనూ సరోజాదేవి అందం ప్రేక్షకులకు బంధాలు వేసింది. 'ఆత్మబలం'లోని 'చిటపట చినుకులు...' సాంగ్ చిత్రీకరణ సమయంలో సరోజాదేవి 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. ఆ పాట పూర్తయితే వెంటనే తాను అంగీకరించిన ఓ తమిళ చిత్రం కోసం వేరే చోటకు వెళ్ళాల్సి ఉంది. నిర్మాత వి. బి. రాజేంద్రప్రసాద్ మరోసారి పాట తీద్దామని భావించారు. అయితే ఆ తరువాత డైరెక్టర్ మధుసూదనరావు, హీరో ఏయన్నార్ కు ఖాళీ దొరకదు. వారికి వీలయినప్పుడు సరోజాదేవికి కాల్ షీట్స్ ఖాళీ లేవు. అందువల్ల ఎలాగైనా అనుకున్న సమయానికే పాటను పూర్తి చేస్తానని అన్నారు. అందుకు రాజేంద్రప్రసాద్ సెట్ లోనే ఆమెకు ట్రీట్ మెంట్ ఇవ్వడానికి సరోజాదేవి పర్సనల్ డాక్టర్ ను తీసుకు వచ్చి కూర్చోబెట్టారు. వర్షం కోసం పంప్ చేసే వాటర్ లో సరోజాదేవి తడవకుండా ఓ పెద్ద కర్చీఫ్ ను తలకు స్టైల్ గా కట్టారు. అలా ఆమెను ఎక్కువగా తడవనీయకుండానే 'చిటపట చినుకులు...' పాటను చిత్రీకరించారు. ఆ విషయం ఆ పాటను ఇప్పుడు పరీక్షగా చూస్తేనే తెలుస్తుంది. అయితే అప్పట్లో ప్రేక్షకులు అదేమీ పట్టించుకోకుండా ఆ సూపర్ హిట్ సాంగ్ లో లీనమై పోయారు. మరో విశేషమేంటంటే సరోజాదేవి ఆ పాటలో కర్చీఫ్ తలకు చుట్టుకొని నటించడం ఓ ఫ్యాషన్ గా భావించి, అప్పట్లో అమ్మాయిలు ఎందరో అలా నెత్తికి చేతిరుమాలు చుట్టుకొని సాగారు. ఇక సరోజాదేవి నటించిన మరో వాన పాట 'వాన కాదు వాన కాదు...' సాంగ్ పూర్తయ్యాక ఆమెకు జ్వరం వచ్చిందట. ఈ రెండు పాటలు తెలుగువారిని విశేషంగా అలరించడం గమనార్హం!


చెరగని ముద్ర....

అంతకు ముందు జెమినీ భారతంలోని 'ప్రమీలార్జునీయం'తో ఓ చిత్రం రూపొందింది. అయితే యన్టీఆర్ అర్జునునిగా, సరోజాదేవి ప్రమీలగా నటించిన 'ప్రమీలార్జునీయం' (1965)తోనే ఎమ్.మల్లికార్జునరావు దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా పెద్దగా అలరించలేక పోయింది. కానీ, ప్రమీలగా జనం మదిలో నిలచిపోయారు సరోజాదేవి. అలాగే 'శకుంతల' (1966)లో యన్టీఆర్ దుష్యంతునిగా, సరోజాదేవి శకుంతలగా అభినయించారు. ఈ సినిమా సైతం పెద్దగా మురిపించలేక పోయింది. కానీ, శకుంతలగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించారు సరోజాదేవి. చిత్రమేమిటంటే ఈ రెండు పౌరాణికాలు రిపీట్ రన్ లో భలేగా ఆదరణ పొందాయి.

చిలుక పలుకులతో ఘనవిజయం...

సరోజాదేవి హీరోయిన్ గా నటించిన తెలుగు చిత్రాల్లో 'జగదేకవీరుని కథ' బ్లాక్ బస్టర్. ఇందులో 'జేజీ...' అంటూ ఆమె పలికిన తీరు తెలుగువారిని పరవసింప చేసింది. అలాగే 'హలా... ప్రాణసఖా... అహో.. వేగిరం... ' వంటి పదాలు కూడా సరోజాదేవి నోట ముద్దుగా జాలువారాయి. అందువల్లే ఆమెను చిలుక పలుకుల చిన్నది అనేవారు. ఆపై మరికొన్ని తెలుగు చిత్రాల్లోనూ దర్శకులు అదే పనిగా ఆమెకు చిన్నచిన్న పదాలు రాయించి, వల్లింప చేసి తెలుగు ప్రేక్షకులకు ఆనందం పంచారు. 'జగదేకవీరుని కథ' చిత్రం రిపీట్ రన్స్ లోనూ విజయఢంకా మోగించింది.

Also Read: Saroja Devi: ఏయన్నార్‌తో.. బి.సరోజాదేవి

Updated Date - Jul 14 , 2025 | 05:40 PM