Pawan Kalyan: ఘనంగా హరి హర వీరమల్లు అసుర హననం గీతావిష్కరణ

ABN , Publish Date - May 21 , 2025 | 05:12 PM

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' నుండి మూడో పాట విడుదలైంది. కీరవాణి స్వర పర్చిన ఈ గీతాన్ని రవీంద్ర గోసాల రాశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal ) కథానాయికగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ (Bobby Deol) ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా 'అసుర హననం' విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

'అసుర హననం' గీతావిష్కరణ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, 'హరి హర వీరమల్లు సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలైంది, ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలామంది దర్శకులను చూశాను. కానీ, తక్కువమందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. వేగంగా నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఎ.ఎం. రత్నం గారికి పేరుంది. లిరిక్ రైటర్ గా ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఈ సినిమా రూపంలో ఎ.ఎం. రత్నం గారికి మరో భారీ విజయం సొంతం అవుతుందని విశ్వసిస్తున్నాను. అలాగే నిర్మాత దయాకర్ గారంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో ఉంది. రాంబాబు లాంటి మంచి గీత రచయితను నాకు జ్యోతికృష్ణ పరిచయం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్రను చక్కగా పోషించింది. పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా 'హరి హర వీరమల్లు'ను తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్ కళ్యాణ్ గారు. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో చేశాను' అని అన్నారు.


GANI7585.JPG

చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, 'పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి కల ఉంటుంది. అది ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మొదట ఈ ప్రాజెక్ట్ కి పెద్ద పునాది వేసింది క్రిష్ గారు. దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని రత్నం గారు ప్లాన్ చేశారు. ఇంత పెద్ద బాధ్యతను ఒలింపిక్ టార్చ్ లాగా క్రిష్ గారు నాకు అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని, రత్నం గారిని మెప్పించడం మామూలు విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో మీరే ఊహించుకోవచ్చు. కీరవాణి గారితో పని చేయడం గర్వంగా ఉంది. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నాన్నగారు మొదటి సినిమా నిర్మాతలా ఈ సినిమా కోసం పని చేశారు. కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ కథ' అని అన్నారు.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, 'సినిమా ఫీల్డ్ లో నా ప్రయాణం 54 ఏళ్ళు. తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో సినిమాలు తీశాను. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలు అందించాను. హరి హర వీరమల్లు సినిమా తయారవ్వడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. క్రిష్ గారు చెప్పిన కథ నచ్చి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్ళాను. రత్నం గారి జడ్జిమెంట్ ను నమ్మి ఈ సినిమా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. జ్యోతికృష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను' అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్, గీత రచయిత రాంబాబు గోసాల, రఘుబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Also Read: Seetharama Sastry: రామజోగయ్య శాస్త్రికి సిరివెన్నెల పురస్కారం

Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్

Also Read: Allu Arjun, Atlee Movie: ఫుల్‌స్వీంగ్‌లో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 21 , 2025 | 05:15 PM