Arudra: చెరిగిపోని ఆరుద్ర ముద్ర...

ABN , Publish Date - Aug 30 , 2025 | 08:25 PM

అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి (Bhagavatula SadaSivaSankara Sastry). కానీ, 'ఆరుద్ర' (Arudra)గా ఆయన ముద్ర తెలుగు సాహితీవనంలో చెరిగిపోనిది.

Arudra

Arudra: అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి (Bhagavatula SadaSivaSankara Sastry). కానీ, 'ఆరుద్ర' (Arudra)గా ఆయన ముద్ర తెలుగు సాహితీవనంలో చెరిగిపోనిది. సినిమారంగంలో అడుగుపెట్టకముందే తన కవిత్వంతో తెలుగువారిని విశేషంగా అలరించారు ఆరుద్ర. ఆగస్టు 31వ తేదీన ఆరుద్ర జయంతి. ఈ సందర్భంగా ఆరుద్ర పలికించిన పాటలను మననం చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంటారు అభిమానులు.


చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'బీదలపాట్లు' (1950)లో తొలిసారి ఆరుద్ర కలం పాటలు పలికించింది. ఇందులో ఆయన కలం నుండి జాలువారిన తొలి గీతం "ఓ చిలుక రాజా.. నీ పెళ్ళెపుడయ్యా..." అంటూ సాగుతుంది. ఆ రోజుల్లో ఈ పాట మంచి ఆదరణ పొందింది. రాజ్ కపూర్ నిర్మించిన 'ఆహ్' చిత్రం ఘనవిజయం సాధించింది. దానిని తెలుగు, తమిళ భాషల్లో అనువదించారు. తెలుగులో 'ప్రేమలేఖలు' (1953) పేరుతో రూపొందింది. ఈ చిత్రానికి ఆరుద్ర పాటలు, మాటలు పలికించారు. ఇందులోని "పందిట్లో పెళ్ళవుతున్నాదీ... కనువిందవుతున్నాదీ..." అంటూ సాగే పాట ఆ రోజుల్లో తెలుగునేలపై సినీ అభిమానులను విశేషంగా అలరించింది.


ఆరుద్ర, ఆయన భార్య కె.రామలక్ష్మి ఇద్దరూ ఛాందస భావాలను వ్యతిరేకిస్తూ సాగారు. అయినప్పటికీ ఆరుద్ర కొన్ని చిత్రాల్లో భక్తిరసం ఒలికే పాటలు పలికించడం విశేషం. "అందాల రాముడు ఇందీవర శ్యాముడు..." (ఉయ్యాల జంపాల), "శ్రీరామ నామాలు శతకోటి... ఒక్కొక్క పేరు బహుతీపి..." (మీనా), "రాముడేమన్నాడోయ్..." ( అందాల రాముడు) - ఇలా 'రామ'నామంతో సాగిన పాటలు పలికించారు. 'భీష్మ' (1962)లో "తెలియగలేరే నీ లీలలు...", "మహాదేవ శంభో మహేశా గిరీశా..." మాధవా మాధవా..." అంటూ సాగే గీతాలనూ రచించి మురిపించారు. "ఒకసారి కలలోకి రావయ్యా..." (గోపాలుడు-భూపాలుడు) శ్రీకృష్ణ శృంగారగీతాన్నీ ఆరుద్రనే పలికించారు. "ఇదేనండి ఇదేనండి భాగ్యనగరమూ..." (ఎమ్.ఎల్.ఏ), "మహాబలిపురం...మహాబలిపురం..."( బాలరాజు కథ), "వేదంలా ఘోషించే గోదావరి..." (ఆంధ్రకేసరి) వంటి చారిత్రక నేపథ్యమున్న గీతాలు సైతం ఆరుద్ర కలం నుండే జాలువారాయి.


అన్యదేశ్యాలను సైతం తనకు అనువుగా ఉపయోగించుకోవడంలో దిట్ట అనిపించుకున్నారు ఆరుద్ర. "హలో హలో అమ్మాయి..." (ఇద్దరు మిత్రులు), "టాటా వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు..."( బుద్ధిమంతుడు) వంటి పాటలు మచ్చుకు కొన్ని. పాటలతోనే కాదు కొన్ని చిత్రాలకు ఆరుద్ర రాసిన కథలు సైతం భలేగా మురిపించాయి. 'గూఢచారి 116, మోసగాళ్ళకు మోసగాడు' వంటి చిత్రాలు ఆయన రచనతోనే పురుడు పోసుకొని విజయం సాధించాయి. తెలుగు చిత్రసీమలో చెరిగిపోని తరిగిపోని కీర్తిని సొంతం చేసుకున్న ఆరుద్ర ఇతర సాహిత్యం సైతం భావితరాలకు చారిత్రక ఆధారాలను అందించింది. సదా తెలుగు సాహిత్యాభిమానుల మదిలో ఆరుద్ర నిలచే ఉంటారని చెప్పవచ్చు.

Rajinikanth: రజినీ నోట.. బాలయ్య డైలాగ్.. అదిరిపోయిందంతే

Naga Vamsi: పడిన చోటే లేచాడయ్యా.. అది నాగవంశీ అంటే

Updated Date - Aug 30 , 2025 | 08:25 PM