Siddhu Jonnalagadda: 'జాక్' దెబ్బ.. సిద్థుకు తత్వం బోధ పడిందా!
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:45 PM
'జాక్' మూవీ ఫ్లాప్ తర్వాత సిద్థు జొన్నలగడ్డకు తత్త్వం బోధ పడిందని అంటున్నారు. అతని భాషలోనూ, బాడీ లాంగ్వేజ్ లోనూ మార్పు వచ్చిందని చెబుతున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సిద్థు ఇప్పుడు మళ్ళీ ఎక్స్ లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది.
యంగ్ హీరో సిద్థు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోలేదు. స్టెప్ బై స్టెప్ కష్టపడి పైకి వచ్చాడు. రెండేళ్ళ పాటు వివిధ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన తర్వాత అతనికి 'లైఫ్ బిఫోర్ వెడ్డింగ్' మూవీలో హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో తిరిగి సిద్థుకు కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత అడల్ట్ కామెడీ మూవీ 'గుంటూరు టాకీస్' సిద్థుకు పేరు తెచ్చిపెట్టింది. అలానే 'కృష్ణ అండ్ హిజ్ లీలా' ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.
ఇక మూడేళ్ళ క్రితం వచ్చిన 'డీజే టిల్లు'తో సిద్థు కూడా టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోస్ జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన 'టిల్లు స్క్వేర్' అతన్ని మరింత పైకి తీసుకెళ్ళింది. అయితే... కెరీర్ వైకుంఠపాళిలో నిచ్చెనలే కాదు... పాములు కూడా ఉంటాయని 'జాక్' సినిమా నిరూపించింది. ఆ సినిమా దెబ్బకు సిద్థు ఒక్కసారిగా కిందకు జారిపోయాడు. ఇప్పుడు చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నా... ప్రతి సినిమా కెరీర్ కు అగ్ని పరీక్ష పెట్టేదిగా మారిపోయింది. ఆ మధ్య సోషల్ మీడియాకు దూరమైన సిద్థు ఇప్పుడు మళ్ళీ తన 'తెలుసు కదా' మూవీ విడుదల సందర్భంగా ఎక్స్ లో యాక్టివ్ అయ్యాడు. తన కొత్త సినిమా ట్రైలర్ ను అందులో పోస్ట్ చేశాడు.
'జాక్' ఫ్లాప్ తో సిద్ధుకి తత్త్వం బోధపడిందని, ఇక మీదట ఎగిరెగిరి పడడని కొందరు అంటున్నారు. అతని మాట్లాడే భాషా, బాడీ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు కాస్తంత మారాయని చెబుతున్నారు. మరికొందరేమో... ఇదంతా యాక్టింగేనని, సిద్థు యాటిట్యూడ్ లో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు. చిత్రం ఏమంటే... 'జాక్' ఫ్లాప్ తర్వాత సిద్థు తన రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చాడనే మాటలూ వినిపించాయి. నిర్మాత బాగుంటేనే తన లాంటి వారి కెరీర్ ముందుకు సాగుతుందనే విషయం తెలిసిన సిద్థుకు... తన సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించడానికి ఎంతో కష్టపడతాడనే పేరుంది.
బేసికల్ గా అతనిలో మంచి రైటర్ కూడా ఉండటం వల్ల స్క్రిప్ట్ ను మెరుగు పరిచే ప్రయత్నం కూడా సిద్థు చేస్తుంటాడు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఇలాంటి అంశాలను పాజిటివ్ గా చెప్పే వ్యక్తులే... అది ఫ్లాప్ అయితే విమర్శిస్తుంటారు. ఏదేమైనా... 'జాక్' నేర్పిన పాఠాలతో సిద్థు ఇక మీదట ఆచితూచి అడుగులు వేసే ఆస్కారం ఉంది. నిజంగానే అతని బిహేవియర్ లో మార్పు వస్తే... అది 'తెలుసు కదా' విజయానికి కొంతలో కొంత ఉపయోగపడుతుంది. చూద్దాం... ఏం జరుగుతుందో!
Also Read: Modi biopic: నరేంద్ర మోదీగా ఉన్ని ముకుందన్...
Also Read: Kantara Chapter 1: అలా అయితే కష్టమే అంటున్న రిషభ్ బృందం