Pragathi : పవర్ లిఫ్టింగ్ లో ప్రగతికి గోల్డ్ మెడల్
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:30 PM
ఆమె నటనలో అదరగొట్టింది. అమ్మలా, అత్తలా, అక్కలా... ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకుంది. అందరిలా అదే చోటా ఆగిపోలేదు. తనలోని మరో కోణాన్ని బయటపెట్టి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. విమర్శకుల నోళ్లను మూయించి, తన సత్తాను చాటింది.
చిత్రసీమలో నటనలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లోనూ అద్భుతాలు సృష్టించే కళాకారులు చాలా అరుదు. అలాంటి అసాధారణ ప్రతిభాశాలిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి (Pragathi ) నిలుస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాల్లో అమ్మ, అక్క, వదిన పాత్రల్లో మెరిసింది ప్రగతి. ఆమె కామెడీ టైమింగ్, భావోద్వేగ సన్నివేశాల్లో ప్రదర్శించే నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. హీరోయిన్‌గా పెద్దగా విజయం సాధించకపోయినా సపోర్టింగ్ రోల్స్ లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే, ప్రగతి మరో రంగంలో చూపిన ప్రతిభ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒంగోలు నుండి మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ప్రగతి, ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ (Bhagyaraj) మూవీ ‘వీట్ల విశేషాంగ’ (Veetla Visheshamga) తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కొంతకాలం నటనకు దూరమై, సీరియల్స్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, క్యారెక్టర్ రోల్స్‌లో స్థిరపడింది. 50 ఏళ్ల వయసులోనూ స్టైలిష్ లుక్‌తో ఆకర్షిస్తూ, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. డైట్, ఎక్సర్ సైజ్ తో ఫిట్‌గా ఉంటూ, స్లీవ్‌లెస్ జాకెట్స్, టైట్ ఫిట్ డ్రెస్‌లతో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆమె డ్యాన్స్ వీడియోస్ ముఖ్యంగా 2020 లాక్‌డౌన్ సమయంలో వైరల్ గా మారాయి. అయితే, ఇవి కేవలం బిల్డప్ కోసం కాదు. ప్రగతి తన ఫిట్‌నెస్ పట్ల ఉన్న అభిరుచిని మరో స్థాయికి తీసుకెళ్లి.. పవర్ లిఫ్టింగ్‌లో ప్రొఫెషనల్‌గా రాణిస్తోంది. నేషనల్ ఛాంపియన్‌షిప్ కాంపిటీషన్ లో పాల్గొని పలు పతకాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
2024లో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్, ఇటీవల కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది ప్రగతి. స్క్వాట్‌లో 115 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 50 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 122.5 కిలోలు లిఫ్ట్ చేసి తన శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించుకుంది. 50 ఏళ్ల వయసులోనూ సినిమా, క్రీడా రంగాల్లో సమానంగా సత్తా చాటుతూ, ప్రగతి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రగతి సాధించిన ఈ రేర్ రికార్డ్ పై పలువురు సినీ ప్రముఖులు అభినందల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: TG Vishwa Prasad: వీరమల్లుకు సాయం చేశా.. కానీ అందుకోసం కాదు..
Read Also: Bigg Boss: సామాన్యులకు 'అగ్ని పరీక్ష'