8 Vasanthalu: థియేటర్ లో వేస్ట్.. ఓటీటీలో బెస్ట్
ABN , Publish Date - Jul 16 , 2025 | 09:31 PM
జనరేషన్ మారే కొద్ది సినిమాలు మారాయి, కథలు మారాయి.. ముఖ్యంగా ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది. కొత్త కథలను ఆదరించడం, స్టార్ హీరోల సినిమాలు అయినా నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేయడం చేస్తున్నారు. ఇదొక రకం.
8 Vasanthalu: జనరేషన్ మారే కొద్ది సినిమాలు మారాయి, కథలు మారాయి.. ముఖ్యంగా ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది. కొత్త కథలను ఆదరించడం, స్టార్ హీరోల సినిమాలు అయినా నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేయడం చేస్తున్నారు. ఇదొక రకం. ఇంకో రకం ఉన్నారు. సినిమా థియేటర్ లో నచ్చదు కానీ, ఓటీటీకి వస్తే మాత్రం గుడి కట్టేస్తారు. థియేటర్ లో డబ్బులు పెట్టుకొని మొదటి రోజు సినిమా చూసి బయటకు వచ్చి అబ్బే ఏమి బాలేదు అని పెదవి విరిచే కొందరు ప్రేక్షకులు.. అదే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు దానికి బ్రహ్మరథం పడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. అందుకు కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ, థియేటర్ లో కంటే ఓటీటీలోనే ఎక్కువ సినిమాలు హిట్ అవుతున్నాయి అన్నది మాత్రం నమ్మదగ్గ నిజం. ఇక మొదటిరోజు పబ్లిక్ టాక్ విని బాగుంటే థియేటర్ కు వెళ్దాం.. లేకపోతే ఓటీటీలో చూద్దాం అనుకొనే ప్రేక్షకులు లేకపోలేదు.
ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఈమధ్యనే ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అయితే ఏముంది కథలో అని తీసేపడేశారు. కానీ, ఇప్పుడు అదే సినిమా ఓటీటీలోకి వచ్చేసరికి సూపర్ సినిమా అంటూ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేగా డౌట్.. అదే 8 వసంతాలు. మధురం అనే షార్ట్ ఫిల్మ్ తో తనలోని ప్రతిభను చాటుకున్నాడు డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి. ఆ తరువాత మను అనే సినిమాతో డైరెక్టర్ గా మారి విమర్శకుల ప్రశంసలును అందుకున్నాడు. మద్యలో చాలా గ్యాప్ తీసుకున్న ఫణీంద్ర.. ఈ మధ్యనే 8 వసంతాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
మ్యాడ్ సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మధురం షార్ట్ ఫిల్మ్ హీరో రవితేజ, హను రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఒక పోయెట్రీలా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20 న రిలీజ్ అయ్యి అంత ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా అంతా ఒక కవితలా ఉందని, ఈకాలం వారికి ఎక్కదని పెదవి విరిచారు. దానికి తోడు డైరెక్టర్ ఫణీంద్ర.. ప్రమోషన్స్ లో కొంచెం సినిమాల గురించి, మణిరత్నం గురించి ఓవర్ గా మాట్లాడాడని పెద్ద వివాదమే రేగింది. వీటితో పాటు అదేరోజు కుబేర రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవడంతో 8 వసంతాలు మరుగున పడింది.
ఇక ఈ మధ్యనే 8 వసంతాలు సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇక ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయ్యారో.. లేక బాలేదని పెదవి విరిచారో.. వారందరూ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం 8 వసంతాలు నెట్ ఫ్లిక్స్ లో దూసుకెళ్తుంది. ఇక సినిమాలోని క్లిప్స్ పెడుతూ సెల్ఫ్ రెస్పెక్ట్, సూపర్ స్టోరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీంతో కొందరి నెటిజన్స్ థియేటర్ లో వేస్ట్ అన్నారు.. ఇప్పుడేంటి ఓటీటీకి వచ్చాకా బెస్ట్ అంటున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
Simbu: శింబును అవమానించిన విరాట్ కోహ్లీ.. హీరో అని చెప్పినా కూడా
Kingdom: అన్నా అంటేనే ఉన్నా.. అనిరుధ్ అదరగొట్టాడు