Tollywood: ఈ వారం కూడా చిన్న సినిమాలదే సందడి

ABN , Publish Date - Nov 19 , 2025 | 02:58 PM

ఈ వీకెండ్ లో ఏకంగా 12 తెలుగు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఏడు స్ట్రయిట్ మూవీ కాగా మూడు అనువాద చిత్రాలు. రెండు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.

This Weekend Telugu Movies

చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఇంకా సద్దుమణగలేదు. ఈ వీకెండ్ కూడా డబ్బింగ్ సినిమాలతో కలిపి డజను చిత్రాలు హంగామా చేయబోతున్నాయి. ఇందులో రెండు రీ-రిలీజ్ మూవీస్ కావడం విశేషం.

ఈ వారం స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఏడు విడుదల అవుతుంటే, మూడు అనువాద చిత్రాలు వస్తున్నాయి. రెండు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఆసక్తిని కలిగించే సినిమాలు మాత్రం కొన్నే! గత యేడాది మూడు చిత్రాలతో అలరించిన 'అల్లరి' నరేశ్‌ (Allari Naresh) మూవీ ఈ సంవత్సరం ఒకటి కూడా రాలేదు. ఆ లోటును తీర్చుతూ ఈ నెల 21న '12 ఎ రైల్వే కాలనీ' (12 A Railway Colony) సినిమా విడుదల కాబోతోంది. డాక్టర్ కామాక్షీ భాస్కర్ల (Kamakshi Bhaskarla) హీరోయిన్ గా నటించిన ఈ థ్రిల్లర్ మూవీకి 'పొలిమేర' ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇదే వారం వస్తున్న మరో సినిమా రాజ్ తరుణ్‌ (Raj Tharun) 'పాంచ్ మినార్' (Panch Minar). గత యేడాది 'నా సామిరంగ' (Naa Samy Ranga) లో 'అల్లరి' నరేశ్‌, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాలే ఒకదానితో ఒకటి పోటీ పడుతుండటం విశేషం. ఇదిలా ఉంటే... 'కోర్ట్' (Court) సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ప్రియదర్శి (Priyadarshi) ఇప్పుడు ఆనంది (Anandi) తో కలసి 'ప్రేమంటే' (Premante) మూవీలో నటించాడు. నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని పుస్కర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. మంగళవారం జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు నాగచైతన్య గెస్ట్ గా హాజరై చిత్ర బృందాన్ని అభినందించాడు.


దర్శకులు నిర్మాతలు కావడం కొత్తేమీ కాదు. కాకపోతే తమ శిష్యులను దర్శకులుగా పరిచయం చేసేందుకు కొందరు దర్శకులు ఈ మధ్య కాలంలో ముందుకొస్తున్నారు. అలా దర్శకుడు వేణు ఊడుగుల తన స్నేహితుడు రాహుల్ తో కలసి 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీని నిర్మించాడు. ఈటీవీ విన్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ సినిమాతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అఖిల్, తేజస్వినీ జంటగా నటించిన ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నిలుస్తుందని, ముఖ్యంగా పతాక సన్నివేశం భిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ శుక్రవారం వీటితో పాటే పర్యావరణం నేపథ్యంలో తెరకెక్కిన 'కలివి వనం, ఇట్లు మీ ఎదవ, ప్రేమలో రెండోసారి' చిత్రాలూ విడుదల అవుతున్నాయి.


ఈ వారం మూడు భాషల నుండి అనువాద చిత్రాలు వస్తున్నాయి. అందులో ఒకటి హిందీ డబ్బింగ్ మూవీ 'ద ఫేస్ ఆఫ్ ద ఫేస్ లెస్'. కేథలిక్ మదర్ రాణి మరియా వట్టాలిల్ జీవితగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సంస్థ తెలుగువారి ముందుకు తీసుకొస్తోంది. అలానే ఎక్స్ సోల్జర్ కు చెందిన అవుట్ అండ్ అవుట్ ఇంగ్లిష్‌ యాక్షన్ మూవీ 'సిసు: రోడ్ టు రివేజ్' శుక్రవారం విడుదల అవుతోంది. దీనితో పాటు తమిళంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఐశ్వర్యా రాజేష్‌ కీలక పాత్రలు పోషించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మఫ్టీ పోలీస్' శుక్రవారం వస్తోంది. విశేషం ఏమంటే... మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ మూవీ 'కొదమ సింహం' మరోసారి మెగాభిమానులను అలరించడానికి రాబోతోంది. అలానే శనివారం కార్తీ, తమన్నా జంటగా నటించిన 'ఆవారా' మూవీని తెలుగులో మరోమారు విడుదల చేస్తున్నారు మేకర్స్. మరి ఈ పన్నెండు సినిమాలలో ఏవేవి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాయో చూడాలి.

Also Read: Tollywood : సినీ ప్రముఖులతో ఆర్.ఎస్.ఎస్. ప్రచార ప్రముఖ్ ఆత్మీయ సమావేశం

Also Read: Karthi: వావ్... కార్తీ సినిమాకు తెలుగు టైటిల్...

Updated Date - Nov 19 , 2025 | 03:25 PM