Tollywood : సినీ ప్రముఖులతో ఆర్.ఎస్.ఎస్. ప్రచార ప్రముఖ్ ఆత్మీయ సమావేశం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:42 PM
ఆర్.ఎస్.ఎస్. వందేళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎఫ్.ఎన్.సి.సి.లో సినీ ప్రముఖులతో భేటీ జరిగింది. ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఇందులో పాల్గొని ఆర్.ఎస్.ఎస్. ఐడియాలజీ అండ్ ప్రాక్టీస్ అనే అంశంపై ప్రసంగించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రారంభమై వంద యేళ్ళు పూర్తి అయిన సందర్భంగా వివిధ సంస్థలను, వివిధ వర్గాలను కలిసి తమ కార్యకలాపాలను గురించి ఆ సంస్థ పెద్దలు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంత సంఘచాలక్ పి. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎఫ్.ఎన్.సి.సి. (FNCC) లో సినీ ప్రముఖులతో భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ (Sunil Ambekar) పాల్గొని, గడిచిన వందేళ్ళలో సంఘ ప్రయాణం గురించి సినీ ప్రముఖులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత, ఎఫ్.ఎన్.సి.సి. అధ్యక్షులు కె.ఎస్. రామారావు (K.S.Ramarao) మాట్లాడుతూ, 'ఇవాళ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాదోళనలలో ప్రజలు ఉన్నారని, దానికి ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు దాడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చ'ని అన్నారు. హైదరాబాద్ కూడా దేశంలోని సెన్సిటివ్ ఏరియాల్లో ఒకటిగా మారిపోయిందని, ఈ దేశ భద్రతకు ప్రాధాన్యమిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలసి పనిచేయాల్సిన అవసరం ఉంద'ని తెలిపారు. మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరుల నేతృత్వంలో ఖచ్చితంగా భారతదేశం ఉన్నత స్థితికి చేరుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన వక్త సునీల్ అంబేకర్ మాట్లాడుతూ, 'సమాజంలో పరివర్తన తీసుకు రావడం కోసం సంఘ్ ఐదు కార్యక్రమాలపై దృష్టి పెట్టిందని, ఉన్నతమైన సమాజాన్ని రూపొందించడానికి అవి ఎంతో అవసరమని చెప్పారు. సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ స్వావలంబన, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం, పౌర నియమాలను అనుసరించడం వంటివి ప్రతి ఒక్కరూ చేయాలని, సినిమాలను రూపొందించే సృజనాత్మక వ్యక్తులు సైతం వీటిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ, 'ఇవాళ సోషల్ మీడియాలో జాతీయ వాదులను పనికట్టుకుని విమర్శించే వారు ఎక్కువైపోయారని, ఈ దేశం గురించి, ధర్మం గురించి మంచి మాటలు చెప్పినా... వాటికి వక్రభాష్యం ఇస్తూ హద్దులు మీరి కొందరు ప్రవర్తిస్తున్నారని, వారిని కట్టడిచేయాల్సిన అవసరం ఉంద'ని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ (Veera Shankar), సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, (Chadalavada Srinivasarao), ఏడిద రాజా, కొమ్మినేని వెంకటేశ్వరరావు, అజయ్ కుమార్, రాజ్ మాదిరాజు, సినీ రచయితలు ఆకెళ్ళ శివప్రసాద్, సత్యదేవ్ జంగాతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు, కళాదర్శకులు, సంగీత దర్శకులు, ఆర్.ఎస్.ఎస్. ప్రాంత ప్రచార ప్రముఖ్ రాజగోపాల్, సంస్కార భారతి ప్రాంత కార్యదర్శి వాడ్రేవు శివాజీ, సునీల్ మహేశ్వర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.