Sobhan Babu: శోభన్‌బాబు.. మనుమలు, ముని మనుమలు ఎంతమందంటే!
ABN, Publish Date - Dec 21 , 2025 | 08:02 AM
‘సోగ్గాడు’ అనగానే సీనియర్ హీరో శోభన్‌బాబే గుర్తుకువస్తారు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ఆయన అలా చెరగని ముద్ర వేసుకున్నారు.
‘సోగ్గాడు’ అనగానే సీనియర్ హీరో శోభన్‌బాబే గుర్తుకువస్తారు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ఆయన అలా చెరగని ముద్ర వేసుకున్నారు. తన కెరీర్ ప్రభావం కుటుంబం మీద పడకుండా మొదటినుంచీ జాగ్రత్తలు తీసుకున్నారు శోభన్‌బాబు (Sobhan Babu). సినిమా వాతావరణానికి దూరంగా తన పిల్లల్ని పెంచారు. ఈ కారణంవల్ల ఆయనకు పిల్లలు ఎంతమంది, మనవళ్లు ఎంతమంది, వారు ఎక్కడ ఉన్నారనే విషయం చాలామందికి తెలీదు.
శోభన్‌బాబుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఆయన కుమారుడి పేరు కరుణశేషు. ఆయనకు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. మగ పిల్లలిద్దరూ కవలలు. శోభన్‌బాబు పెద్ద కుమార్తె మృదులకు ఇద్దరు మగపిల్లలు. అందులో పెద్దవాడు సురక్షిత్. రెండో కూతురు ప్రశాంతికి ఒకే ఒక్క తనయుడు. ఇక చివరి కుమార్తె నివేదితకు ఇద్దరు అబ్బాయిలు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శోభన్‌బాబుకు ‘ఎస్’ అక్షరం అంటే ఇష్టం. అందుకే తన మనవళ్లు, మనవరాళ్లుకు ఆయనే స్వయంగా ‘ఎస్’ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు పెట్టారు. డాక్టర్‌గా చెన్నైలో ప్రాక్టిసు చేస్తున్న సురక్షిత్ (Dr Surakshith) ప్రతి నెలా తప్పనిసరిగా పేషంట్స్ కోసం హైదరాబాద్ వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయనతో ‘నవ్య’ ప్రత్యేకంగా ముచ్చటించింది.
మీ ఫ్యామిలీ సభ్యులంతా తరచూ కలుస్తుంటారా?
మీకు తెలియనిదేముంది. ప్రస్తుతం అంతా కాలంతో పరుగెడుతున్నాం. ఎవరి బిజీ వాళ్లది. ఎవరి టార్గెట్స్ వాళ్లవి. అయినా సరే మేం వీలు చూసుకుని అప్పుడప్పుడూ కలుస్తుంటాం. కలిసిన ప్రతిసారీ తాతగారి గొప్పతనాన్ని, ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంటాం.
చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది?
లెజెండ్స్ కనుమరుగైనా వారి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. మా తాతగారి విషయమూ అంతే. చిన్నతనంలో ఆయన మాకు ఎన్నో చెప్పేవారు. సేవాభావం ఉండాలని, ఎదుటివాడికి చేతనైనంత సాయం చేయాలని తాతగారు చెప్పిన మాటల్ని మేం ఎప్పుడూ మరిచిపోలేం. డాక్టర్‌గా నా బాధ్యతలు నిర్వహిస్తూ తాతగారి మాటల్ని ఆచరణలో పెట్టడానికి కృషి చేస్తున్నాను. నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ఆరు నెలలు పని చేశాను. కానీ వారి వ్యాపార ధోరణి, పేషంట్స్‌తో ప్రవర్తించే విధానం నాకు నచ్చక బయటకు వచ్చేశాను. సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించాను. తాతగారు చెప్పినట్లు కమర్షియల్‌గా కాకుండా సేవాదృక్పథంతో పని చేస్తున్న డాక్టర్లలో నేను కూడా ఒకడినని గర్వంగా చెప్పగలను.
మీరు డాక్టర్ కావాలనుకున్నప్పుడు తాతగారు ఏమన్నారు?
నేను డాక్టర్ కావాలన్నది ఆయన కోరికే. ‘డబ్బు విషయంలో నీకు లోటు ఏమీ లేదు. అందుకే సంపాదన గురించి ఆలోచించకుండా సర్వీస్ చేస్తే బాగుంటుంది’ అని ఆయన సలహా ఇచ్చారు. ‘సురక్షిత్’ అని పేరు పెట్టింది ఆయనే. ‘టు ప్రొటెక్ట్ పీపుల్’ అని. ‘నువ్వు అనుకున్నది చేసెయ్యి. సమాజానికి సేవ చెయ్యి’ అని చెప్పేవారు.
ఆయన చెప్పింది మీరెంతవరకు పాటిస్తున్నారు?
దటీజ్ మై హోల్ జర్నీ. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ అదే చేస్తున్నాను. నేను రెగ్యులర్‌గా హైదరాబాద్ వస్తాను. బెంగళూరు వెళుతుంటాను. వచ్చిన ప్రతిసారీ 40, 50మంది పేషేంట్స్‌ను కలుస్తుంటాను. కమర్షియల్‌గా ఆలోచించకుండా మెడికల్ హెల్ప్ చేస్తుంటాను.
తన కుటుంబాన్ని సినిమాలకు దూరంగా ఉంచారు. దానికి కారణం ఆయన ఎప్పుడైనా చెప్పారా?
సినిమా రంగంలో ఆయన ఎంత కష్టపడ్డారో, ఒక పొజిషన్‌కు చేరుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆయన మాకు ఎప్పుడూ చెప్పలేదు... కానీ పెరిగి పెద్దయ్యాక మాకు తెలిసింది. బహుశా అటువంటి కష్టం మేం పడకూడదనో ఏమో ఆయన దూరంగా ఉంచారు.
సినిమాలంటే మీకెవరికీ ఆసక్తి లేదా? లేక తాతగారు చెప్పారని దూరంగా ఉన్నారా?
మాకెవరికీ సినిమాలంటే ఆసక్తి లేదండి. ఎవరి వృత్తిలో వాళ్లం బిజీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నాం. చాలామంది నిర్మాతలు నన్నే కాదు మా కజిన్స్‌ను కూడా సినిమాల్లోకి రమ్మని, నటించమని చాలా ఒత్తిడి చేశారు. నేను టెన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే నిర్మాతలు, దర్శకులు వచ్చి ప్రీవ్యూలకు రమ్మని, షూటింగ్స్‌కు రమ్మని పిలిచేవారు. తాతగారికి ఇష్టంలేని పని చేయడం, మాకు ఆసక్తి లేకపోవడంవల్ల అటువైపు వెళ్లలేదు.
మీ కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికపరమైన వివాదాలు ఎప్పుడైనా వచ్చాయా?
లేదు. తన కుటుంబ సభ్యులెవరూ ఆర్ధిక ఇబ్బందులు పడకూడదన్నది తాతగారి విజన్. ఆయన ఆ పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.
మీరు ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని విన్నాం?
40 ఏళ్ల వయసు వచ్చేలోపు ఒక ఫొటో షూట్ చేయాలన్నది నా కోరిక. అందుకే సిక్స్ ప్యాక్ చేయాలనుకున్నాం. నేను చేయగలనా లేదా అని చెక్ చేసుకోవడం కోసం అలా ప్రయత్నించా. 18 నెలలు పట్టింది. అందులో ఆరు నెలలు బాగా కష్టపడ్డా. స్కూల్ ఫైనల్ అప్పుడు 110 కిలోలు ఉండేవాడిని. అక్కడి నుంచి క్రమంగా 70 కిలోలు వరకూ తగ్గించుకుంటా వచ్చా. అయితే ప్రస్తుతం మాత్రం 95 కిలోలు ఉన్నా.
మీ ఫ్యామిలీ గురించి చెప్పండి.
నా వైఫ్ రేడియాలజిస్ట్. నాకు ఇద్దరు ఆడపిల్లలు.
మీ అమ్మమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది?
ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఆవిడ మితభాషి. మేమంటే ఆవిడకు ఎంతో ఇష్టం. రకరకాల వంటలు వండుతూ, మాకు తినిపిస్తూ ఆ ప్రేమ చూపిస్తుంటారు.
తాతగారి సినిమాల్లో మీకు నచ్చినవి?
నేను చాలా తక్కువ సినిమాలే చూశాను. ‘ఏమండీ ఆవిడ వచ్చింది’ నాకు బాగా నచ్చింది. ‘సినిమాలు చూడండి’ అని మమల్మి తాతగారు ఒత్తిడి చేసేవారు కాదు. చదువు మీద దృష్టి పెట్టమని, నాలెడ్జి పెంచుకోమని చెప్పేవారు. మా కుటుంబ సభ్యులు అందరం కలసి చూశాము కనుక ఆ సినిమా నాకు బాగా గుర్తుండిపోయింది.