Vijay: సత్తా చాటుతున్న జన నాయగన్...
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:16 PM
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగన్' మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ అతి సులువుగా రూ. 400 కోట్ల వరకూ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ నటిస్తున్న చివరిని కావడంతో ఈ క్రేజ్ ఏర్పడింది.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ హీరో విజయ్ (Vijay) ఏ మేరకు తన సత్తా చాటుతాడో లేదో తెలియదు కానీ అతని చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న 'జన నాయగన్' (Jananayagan) బిజినెస్ విషయంలో మాత్రం విజయ్ తన మార్క్ ను చూపించాడు. పొంగల్ కానుకగా జనవరి 9న రాబోతున్న ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రభాస్ 'ది రాజా సాబ్' (The Rajasaab) గట్టి పోటీనే ఇవ్వబోతోంది. అయినా... తమిళనాట మాత్రం విజయ్ తన ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ భారీ బిజినెస్ కు శ్రీకారం చుట్టాడు. సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయిందని, నిర్మాతలకు భారీ లాభాలు లభించబోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
చెన్నయ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం 'జన నాయగన్' బిజినెస్ ఇలా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఏకంగా రూ. 110 కోట్లకు దక్కించుకుందని అంటున్నారు. అలానే ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ ఓవర్సీస్ హక్కుల కోసం రూ. 75 కోట్లు చెల్లించిందని వినికిడి. ఇక తమిళనాట థియేట్రికల్ రైట్స్ ను రోమియో పిక్చర్స్ రూ. 100 కోట్లకు తీసుకుందని తెలిసింది. అల్లు అర్జున్ ను మలయాళీలు మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటున్నట్టే విజయ్ నూ 'కేరళ కింగ్' అని పిలుస్తుంటారు. 'జననాయగన్' కేరళ రైట్స్ 15 కోట్లకు అమ్ముడయ్యాయట. ఇవన్నీ కలిపితే అక్కడి తేలికగా మూడు వందల కోట్లు వచ్చినట్టు.
ఇక తెలుగు రాష్ట్రాలలోనూ విజయ్ కు ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతూ వస్తోంది. దాంతో ఇక్కడ కూడా మంచి మొత్తమే వచ్చే ఆస్కారం ఉంది. ఇది కాకుండా కర్ణాటక, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్, అలాగే శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే, ఖచ్చితంగా ఓ వంద కోట్లకు తక్కువ ఉండవని అంటున్నారు. ఆ రకంగా విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదలకు ముందే రూ. 400 కోట్ల బిజినెస్ చేసినట్టు. అయితే పొంగల్ బరిలో పలు చిత్రాలు వస్తున్న నేపథ్యంలో విజయ్ మూవీ 'జన నాయగన్' ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది చూడాలి.
Also Read: Actor Abhinay: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి
Also Read: Bhartha Mahasayulaku Wignyapthi: భర్తలందరికీ రామ సత్యనారాయణ చేసిన విజ్ఞప్తి ఏంటంటే..