Phoenix: విజయ్ సేతుపతి కొడుకు కోసం మెగాఫోన్ పట్టిన అనల్ అరసు
ABN, Publish Date - Nov 04 , 2025 | 12:44 PM
ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరుసు దర్శకత్వం వహించిన సినిమా 'ఫీనిక్స్'. విజయ్ సేతుపతి కొడుకు సూర్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో నవంబర్ 7న విడుదల కాబోతోంది. కొడుకు సినిమాను ప్రమోట్ చేయడానికి విజయ్ సేతుపతి రంగంలోకి దిగారు.
యాక్షన్ కొరియోగ్రఫీ చేసే ఫైట్ మాస్టర్స్ చాలామంది దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఆ జాబితాలో చేరాడు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు (Anal Arasu). విశేషం ఏమంటే.. అనల్ అరసు డైరెక్ట్ చేసిన 'ఫీనిక్స్' మూవీ ద్వారా ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కొడుకు సూర్య (Surya) హీరోగా పరిచయం అయ్యాడు. తమిళంలో ఇప్పటికే ఈ సినిమా విడుదలైంది. తాజాగా ఈ నెల 7న ఈ సినిమాను తెలుగులో 'ఫీనిక్స్' పేరుతోనే డబ్ చేసి ఏకే బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సూర్య తండ్రి విజయ్ సేతుపతితో పాటు ఇందులో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా పాల్గొంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ, 'నేను జవాన్ సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్ గారిని కలిశాను. అప్పుడు ఈ కథ చెప్పారు. మా అబ్బాయి ఇందులో నటించాలని అన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఏమీ తెలియదు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. సినిమా చేశారు. నేను సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. మా అబ్బాయికీ యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నన్ను యాక్షన్ సినిమాలు చేయమని చెప్తుండేవాడు. ఇలాంటి సినిమాలు చేయడం తన కల. ఒకరోజు తను యాక్టర్ కావాలి అని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు. అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్టర్, నిర్మాత రాజ్యలక్ష్మి మేడమ్ గారి వలన సాధ్యపడింది' అని అన్నారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మాట్లాడుతూ, 'విజయ్ సేతుపతి గారు అంటే నాకు చాలా ఇష్టం. వరలక్ష్మీ శరత్ కుమార్ మా జయమ్మ. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. విజయ సేతుపతి గారితో నాకు వర్క్ చేయాలని ఉంది. రీసెంట్ గా నేను 'జాట్' సినిమా చేశాను. అనల్ అరసు మాస్టర్ సూపర్ యాక్షన్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని ఒక కథ లాగా చెప్పారు. 'ఫీనిక్స్' ట్రైలర్ చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. సినిమా బాగుందంటే ఏ భాష అయినా సరే వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. విజయ్ సేతుపతి గారిని అలానే గుండెల్లో పెట్టుకున్నారు. సూర్యకి కూడా అలాగే వెల్కమ్ చెప్తున్నాను' అని అన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshni Sarath Kumar) మాట్లాడుతూ, 'విజయ్ సేతుపతి గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. వాళ్ళ అబ్బాయి సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నాను' అని చెప్పారు. ఈ సినిమాకు తెలుగులో మాటలు, పాటలు రాసిన భాష్యశ్రీ మాట్లడుతూ, 'ఎవరూ ఊహించని ట్విస్టులు ఇందులో ఉంటయాని, ఎమోషన్, యాక్షన్ సమపాళ్ళలో ఉన్న సినిమా ఇద'ని అన్నారు. ఈ సినిమాను తమిళంలో మాదిరి తెలుగులోనూ పెద్ద హిట్ చేయాలని దర్శకుడు అనల్ అరసు, హీరో సూర్య కోరారు. నవంబర్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ఆదరించాల్సిందిగా నిర్మాత రాజలక్ష్మీ తెలుగు ప్రేక్షకులను విజ్ఞప్తి చేశారు.
Also Read: Naga Chaitanya: దక్షగా మీనాక్షి చౌదరి...
Also Read: Prakashraj Comments: నేషనల్ అవార్డులపై ప్రకాశ్‌రాజ్ కీలక వ్యాఖ్యలు...