TVK Vijay: అధికారంలోకి వస్తే.. అందరికీ ఇల్లు, బైకు! ఇంటికో.. కారు ఇవ్వాలన్న ఆశ వుంది! విజయ్ హామీల వర్షం
ABN, Publish Date - Nov 24 , 2025 | 08:51 AM
వచ్చే ఎన్నికల్లో టీవీకే గెలిస్తే ఇండ్లు, బైక్‌లతో పాటు ప్రతింటికి కారు ఉచితంగా ఇస్తామని విజయ్ ప్రకటించారు.
వచ్చే యేడాది జరుగనున్న శాస నసభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) (TVK) పార్టీని గెలిపిస్తే అందరికీ ఇండ్లు కట్టించి ఇవ్వడంతో పాటు ఇంటింటికీ ఓ బైకు ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం కాంచీపురం జిల్లా కున్నం గ్రామంలోని జేప్పియార్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
టీవీకే అధికారంలోకి వస్తే.. అంటూ కొన్ని క్షణాల పాటు ప్రసంగాన్ని ఆపి ఆ తర్వాత 'వస్తే ఏమిటి? వచ్చి తీరుతుందని, ఈ విషయంలో తనకెలాంటి అనుమానాలు లేవని, ప్రజలంతా తనవైపే ఉన్నారని చెప్పారు. ప్రతి ఇంటికి ఓ కారు కూడా ఉచితంగా ఇవ్వాలనే ఆశ ఉందని, ఆ ఆశ నెర వేరే రోజులు త్వరలో వస్తాయన్నారు.
ఇక ప్రతి ఇంటా ఒక వ్యక్తి కుటుంబ ఖర్చులకు సరిపడా సంపాదించేలా ఉపాధి అవకాశం కల్పిస్తామని, ప్రభుత్వ ఆస్ప త్రుల్లో నాణ్యమైన వైద్యం అందిస్తామని, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. అన్నాడీఎంకే (ADMK) వ్యవస్థాపకుడు ఎంజీఆర్ తన రాజకీయ గురువైన దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నా దురై ఫొటోను తన పతాకంలో పెట్టుకున్నారని, అలాంటి పార్టీ (అన్నాడీ ఎంకే)ని హస్తగతం చేసుకున్నవారంతా ప్రస్తుతం ఏం చేస్తున్నారో తాను చెప్పదలచుకోలేదంటూ విమర్శించారు.
వ్యక్తిగతంగా ఆ పార్టీ (అన్నాడీఎం కే)తో ఎలాంటి తగాదాలు లేవని, ఆ పార్టీ వారు మాపై పగబట్టినా పట్టిం చుకోమని, అదలావుంచితే ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసగించి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత పాలకులను ప్రశ్నించకుండా ఉండలేనన్నారు. కాంచీపురం జిల్లాకు తనకు మధ్య అవినాభావ సంబంధాలున్నాయని తన మొదటి రాజకీయ పర్యటన ఆ జిల్లాలోని పరందూరు నుంచే ప్రారంభమైందని చెప్పారు.
టీవీకే నేతలను కార్యకర్తలను తెలివితక్కువ దద్దమ్మలంటూ డీఎంకే నేతలు విమర్శలు చేసి అభాసు పాలయ్యారన్నారు. వజ్రోత్సవాలు జరుపుకున్న రాజకీయ పార్టీగా డంబాలు పలుకుతున్న డీఎంకే (DMK) నేతలకు ప్రధాన లక్ష్యాలు, సిద్ధాంతాలు ఏవీ లేవని, ప్రజల ఆస్తులను దోచుకోవడమే వారి లక్ష్యమని విజయ్ ఆరోపించారు. అధికారంలోకి వస్తే నీట్ పరీక్షలను రద్దు చేస్తామని చెప్పిన డీఎంకే నేతలు ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. డీఎంకేను ఇప్పటి వరకూ తీవ్రంగా విమర్శించలేదని, త్వరలోనే తాను చేసే విమర్శలను తట్టుకోలేక పార్టీ పత్తా లేకుండా పోవడం ఖాయమన్నారు.