Suriya: తెలుగువారిని నువ్వు కూడా ఇంత మోసం చేస్తావా సూర్య

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:34 PM

తెలుగు ప్రేక్షకులు.. ఎంతో గొప్పవారు. భాషా భేదం లేకుండా ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. కథ నచ్చితే చాలు.. చిన్నా.. పెద్ద.. అనే తేడా లేకుండా గుండెల్లో పెట్టుకుంటారు.

Suriya

Suriya: తెలుగు ప్రేక్షకులు.. ఎంతో గొప్పవారు. భాషా భేదం లేకుండా ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. కథ నచ్చితే చాలు.. చిన్నా.. పెద్ద.. అనే తేడా లేకుండా గుండెల్లో పెట్టుకుంటారు. అంతెందుకు మన హీరోల కన్నా ఇతర భాషల హీరోలకు కూడా అన్నదానాలు, రక్తదానాలు చేసి తమ అభిమానాన్ని చాటి చెప్పుకుంటున్నారు. వారిపై ఇంత ప్రేమ చూపిస్తుంటే.. వారు మాత్రం తెలుగువారిని చులకన చేస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి. వినిపించడం ఏంటి అదే నిజం అని చెప్పొచ్చు.


తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా.. భాషను బట్టి అక్కడ టైటిల్స్ మారుస్తూ ఉంటారు. తమిళ్ లో ఒకలా.. హిందీలో ఒకలా టైటిల్ మార్చి రిలీజ్ చేస్తారు. లేదు అంటే.. అన్ని భాషల్లో ఒకేలా ఉండే టైటిల్ ను ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం వలన అక్కడి ప్రేక్షకులకు సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. తమ సినిమా అనే భావన కలుగుతుంది. అయితే ఈమధ్యకాలంలో తమిళ్ ఇండస్ట్రీ.. ఈ పద్దతిని పాటించడం లేదు.


ఎప్పటినుంచో స్టార్ హీరోల సినిమాలు తమిళ్ లో ఒక పేరుతో రిలీజ్ అయితే.. తెలుగులో ఇంకో టైటిల్ తో రిలీజ్ అయ్యేయి. దానివలన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలను తమవి అని ఓన్ చేసుకొని హిట్ చేసేవారు. అయితే ఉన్నాకొద్దీ తమిళ్ మేకర్స్ మారారు. తెలుగువారిని చులకనగా చేస్తూ తమిళ్ టైటిల్స్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. తునీవు, విడామయుర్చి, పొన్నియన్ సెల్వన్, మారన్, వెట్టయాన్, తుడురమ్, కంగువ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమధ్య వచ్చిన సినిమాల టైటిల్స్ అన్ని ఇలానే ఉన్నాయి.


కంగువ అంటే అన్ని భాషల్లో ఒకటే అర్ధం వచ్చేలా ఉందని దాన్ని ఫైనల్ చేశారు. అప్పుడు ఊరుకున్నారు కదా అని సూర్య మరోసారి అదే తప్పు చేయడానికి సిద్దమవుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు సూర్య పుట్టినరోజును పురస్కరించుకొని కరుప్పు టీజర్ ను రిలీజ్ చేశారు. అదే టీజర్ ను టైటిల్ మార్చకుండానే తెలుగులో కూడా రిలీజ్ చేశారు.


ప్రస్తుతం కరుప్పు టీజర్ పై తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సూర్యను తమిళ్ వారు ఎంత ప్రేమిస్తారో తెలియదు కానీ.. వారికి వంద రెట్లు తెలుగువారు గుండెల్లో పెట్టేసుకున్నారు. వేరే ఏ భాషా హీరోకు ఇంత అభిమానం లేదు అంటే అతిశయోక్తి కాదు. కనీసం హైదరాబాద్ లో పెరిగి.. తెలుగు అద్భుతంగా మాట్లాడే కార్తీ కన్నా.. సూర్యపైనే అభిమానాన్ని చూపిస్తారు. సూర్య సైతం తెలుగు ప్రేక్షకులు అంటే ప్రాణం పెడతాడు. అలాంటి సూర్య సైతం ఈ టైటిల్ విషయంలో తెలుగువారిని మోసం చేశాడు. మేకర్స్ కరుప్పు టైటిల్ ను ఖరారు చేసినప్పుడు తెలుగులో వేరే టైటిల్ పెడదాం అని సూర్య ఎందుకు చెప్పలేకపోయాడు అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.


కరుప్పు టీజర్ చాలా బావుంది. అందులో సూర్య లాయర్ గా, ఒక లీడర్ గా కనిపించాడు. ఇక టీజర్ లో మొత్తం తమిళ్ నేటివిటీనే కనిపిస్తుంది. తెలుగులో కూడా ఇదే చూపిస్తే.. ఇక్కడవారికి అర్ధమవుతుందా.. ? దానిని అంగీకరిస్తారా.. ? అనేది తెలియాలి. అయితే ఇందులో సూర్య పేరు కరుప్పు స్వామి అని అందుకే ఆ పేరు పెట్టారని అంటున్నారు. ఏదిఏమైనా సినిమా రిలీజ్ అయ్యేలోపు టైటిల్ ను ఛేంజ్ చేస్తే ఏమైనా హిట్ అయ్యే ఛాన్స్ లు ఉంటాయి. లేకపోతే ఈ టైటిల్ వివాదమే తారాస్థాయికి చేరుతుంది అని అంటున్నారు. మరి సూర్య తెలుగువారిని మోసం చేయకుండా.. టైటిల్ మార్పిస్తాడేమో చూడాలి.

Decoit Movie: షూటింగ్ లో ప్రమాదం..అడివి శేష్, మృణాల్ కు తీవ్ర గాయాలు

F1 Movie: ఇండియాలో.. హాలీవుడ్ మూవీ అరాచ‌కం! బాక్సాఫీస్ రికార్డులు ఖ‌ల్లాస్‌

Updated Date - Jul 23 , 2025 | 04:34 PM