Box Office War: మదరాసి ని ఢీ కొట్టబోతున్న భద్రకాళి...
ABN , Publish Date - Jul 10 , 2025 | 06:37 PM
శివ కార్తికేయన్ 'మదరాసి' సినిమాతో విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' చిత్రం పోటీ పడబోతోంది. ఈ రెండు సినిమాలో సెప్టెంబర్ మొదటి వారంలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతున్నాయి.
సెప్టెంబర్ మొదటి వారంలో రెండు క్రేజీ తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదల కాబోతోంది. శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా మురగదాస్ (Murugadas) తెరకెక్కిస్తున్న 'మదరాసి' (Madharasi) చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. అయితే తాజాగా విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా రూపుదిద్దుకుంటున్న అతని 25వ చిత్రం 'భద్రకాళి' (Bhadrakali) నీ అదే రోజు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. విశేషం ఏమంటే... అదే రోజు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'మిరాయ్' (Mirai) సినిమా కూడా త్రీడీలో వస్తోంది. అయితే... ఇప్పుడు 'మిరాయి' రెండు తమిళ డబ్బింగ్ సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత యేడాది దీపావళి కానుకగా విడుదలైన శివ కార్తికేయన్ 'అమరన్' సినిమా చక్కని విజయాన్ని తెచ్చిపెట్టింది. దాంతో సహజంగానే 'మదరాసి' సినిమాకూ క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మురుగదాస్ చిత్రాలేవీ గొప్ప ఫలితాలను అందివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన చాలా కసితో ఈ ప్రాజెక్ట్ ను తీర్చదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విద్యుత్ జామ్వాల్, బిజూ మీనన్, షబీర్, విక్రాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' సినిమా విషయానికి వస్తే... ఇది 190 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన కథ. ఇందులో విజయ్ ఆంటోనీ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో తెలియకుండా సస్పెన్స్ లో ఉంచారు. ఇటీవల వచ్చిన టీజర్ చూస్తే ఆయన ఫ్యామిలీ మ్యానా? గ్యాంగ్ స్టరా? ఉన్నత ప్రభుత్వ అధికారా? అనేది తెలియకుండా ఉంది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బేసికల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు మీరా ఆంటోనీ సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఇందులో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తీ రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. మరి సెప్టెంబర్ 5న రాబోతున్న ఈ రెండు తమిళ డబ్బింగ్ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు దేనివైపు మొగ్గుచూపుతారో చూడాలి.
Also Read: KD-The Devil: ధృవ్ సర్జా.. కేడీ టీజర్ ఇంత వయోలెంట్‌గా ఉందేంటి
Also Read: NBK -NATS: సంబరాలే కాదు.. సామాజిక బాధ్యతగా నాట్స్ వేడుక