NBK -NATS: సంబరాలే కాదు.. సామాజిక బాధ్యతగా నాట్స్ వేడుక
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:28 PM
సంబరాలే కాదు సామాజిక బాధ్యత కూడా ఉంది అంటూ నాట్స్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఫ్లోరిడాలోని టాంపాలో 8వ నాట్స్ (NATS - నార్త్ అమెరికా తెలుగు సంబరాలు) వైభవంగా ముగిశాయి. ‘ఇది మన తెలుగు సంబరం.. జరుపుకుందాం కలిసి అందరం’ అనే నినాదంతో ప్రారంభమై, మూడు రోజులపాటు ఘనంగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎందరో హాజరయ్యారు.
అంతే కాదు 20 వేల మందికి పైగా తెలుగు జనాలు భాగమయ్యారు. విక్టరీ వెంకటేశ్, నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ ఒకే వేదికపై మెరిసి ఆహుతుల్ని అలరించారు. ఈతరం నాయకి శ్రీలీలతోపాటు (Sree leela) అలనాటి నటీమణులు జయసుధ, మీనా తదితరులు సందడి చేశారు. దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్.తమన్ సంగీత విభావరితో అలరించారు.
సంబరాలే కాక సామాజిక బాధ్యతగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్ లీడర్ షిప్ టీమ్ అందజేసింది. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని మరింత సక్సెస్ చేసిన అతిథులకు, తెలుగు కమ్యూనిటీకి, కళాకారులకు, వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల తరుపున కన్వీనర్ కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలు అంబరాన్ని అంటేలా చేయడానికి ఎంతో కృషి చేశామన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసి ఆ వేడుకల్ని నిర్వహించాలని ప్రణాళిక వేశామని తెలిపారు.