KD The Devil: గ్రాండ్ గా విడుదలైన ధృవ సర్జా మూవీ టీజర్
ABN, Publish Date - Jul 11 , 2025 | 11:48 AM
ధృవ సర్జా హీరోగా నటించిన 'కేడీ ది డెవిల్' చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, శిల్పాశెట్టి పాల్గొన్నారు.
కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా (Dhruva Sarja) హీరోగా వెంకట్ కె. నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'కేడీ ది డెవిల్' (KD The Devil). ప్రేమ్ (Prem) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఇందులో హీరో, హీరోయిన్లుగా నటించిన ధృవ సర్జా, రీష్మా నానయ్య (Reeshma Nanaiah), కీలక పాత్రలు పోషించిన సంజయ్ దత్ (Sanjay Dutt), శిల్పాశెట్టి (Shilpa Shetty) టీజర్ లాంచ్ కు హాజరయ్యారు.
'కేడీ ది డెవిల్' టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంజయ్ దత్ మాట్లాడుతూ, 'హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాకు పని చేస్తున్నాను. అక్కడే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుగులో చిరంజీవి గారంటే చాలా ఇష్టం. కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకీ సర్, సుప్రిత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఇలాంటి మూవీని ఇంత గొప్పగా నిర్మించగలిగారు. డైరెక్టర్ ప్రేమ్ చాలా మంచి వ్యక్తి. ధృవ్ నా తమ్ముడు లాంటివారు. అతను చాలా ఎత్తుకు ఎదగాలి. రీష్మా చాలా చక్కగా నటించారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
శిల్పా శెట్టి మాట్లాడుతూ, 'హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో సినిమాను చేశాను. అది 'సాహసవీరుడు సాగరకన్య'. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారు నాపై అదే ప్రేమను చూపిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్ ప్రేమ్ గారికి థాంక్స్. కేవీఎన్ వెంకట్ గారికి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. ధృవ, రీష్మాలతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్ దత్ గారితో నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అయింది. అదే ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ, 'కన్నడలో నేను తెరకెక్కించిన 'జోగి' సినిమాను తెలుగులో 'యోగి'గా రీమేక్ చేశారు. అప్పటి నుండి తెలుగులో నాకు ఆఫర్స్ వస్తున్నాయి కానీ భాషరాని కారణంగా అంగీకరించడం లేదు. తెలుగు సినిమాలు బాగా చూస్తుంటాను. చిరంజీవి గారి ఇంటికి తరచుగా వెళ్తుంటాను. మీ ముందుకు ఇప్పుడు 'కేడీ' మూవీతో రాబోతున్నాను' అని అన్నారు. ఈ సినిమాకు పెద్ద విజయాన్ని అందించాల్సిందిగా హీరో ధృవ సర్జా కోరారు. గతంలో 'యూ.ఐ.' మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చానని, ఇప్పుడు మరోసారి 'కేడీ' కోసం రావడం ఆనందంగా ఉందని హీరోయిన్ రీష్మా నానయ్య తెలిపింది. ముంబైలో విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చిందని, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతోందని కేవీఎన్ ప్రొడక్షన్ బిజినెస్ హెడ్ సుప్రీత్ అన్నారు. హైదరాబాద్ తర్వాత కొచ్చి, బెంగళూర్, చెన్నైలో ఈవెంట్స్ చేయబోతున్నట్టు సుప్రీత్ తెలిపారు.
Also Read: Brick OTT: ఓటీటీలో ఇరగదీస్తున్న.. లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్! ఎందులో చూడాలంటే
Also Read: Salman Khan: బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కోసం తొలిసారి...