Sai Abhyankkar: అనిరుధ్‌కు షాక్.. లీడింగ్‌లోకి సాయి అభ్యంకర్
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:23 PM
'డ్యూడ్' సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన సాయి అభ్యంకర్... స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ కు గట్టి పోటీ ఇస్తాడనే మాట తమిళనాట వినిపిస్తోంది.
ప్రముఖ గాయనీ గాయకులు హరిణీ (Harini), టిప్పు (Tippu) తనయుడు సాయి అభ్యంకర్ (Sai Abhyankar). తల్లిదండ్రుల బాటలో సాగుతూ సినీ సంగీత రంగంలోకి ఇతను అడుగపెట్టినా... వారి మాదిరి గాత్రాన్ని కాకుండా సంగీతాన్ని సాయి ఎంచుకున్నాడు. సంగీతసాగరంలో ఈదులాడాలనుకునే వారు చిన్న వయసులోనే ఆ రంగంలోకి అడుగు పెట్టి, యుక్త వయసుకు చేరేసరికీ తమ సత్తాను చాటుకుంటారు. ఇవాళ తమిళనాట టాప్ పొజిషన్ లో ఉన్న చాలామంది సంగీత దర్శకుల ప్రయాణం పిన్నవయసులోనే మొదలైంది. సాయి అభ్యంకర్ కూడా అందుకు మినహాయింపు కాదు. అతను సినిమాల్లోకి రాకముందే పలు ప్రైవేట్ అల్బమ్స్ కు సంగీతాన్ని అందించాడు. తాజాగా విడుదలైన 'డ్యూడ్' (Dude) మూవీతో సాయి అభ్యంకర్ సినీ సంగీత దర్శకుడిగా కెరీర్ కు శ్రీకారం చుట్టాడు. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమాకు సంగీతానికి మంచి స్పందన లభించింది. పాటలే కాకుండా నేపథ్య సంగీతం సైతం కొత్తగా ఉందని అందరూ అభినందిస్తున్నారు. దాంతో ఇప్పుడు తమిళనాట అనిరుధ్ కు ఆల్టర్నేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడనే మాట బాగా వినిపిస్తోంది.
సంగీత దర్శకుడు అనిరుధ్ సైతం పిన్న వయసులోనే ఈ రంగంలోకి వచ్చాడు. అతను స్వరపర్చిన'3' సినిమాలోని పాట సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. తమిళంలోనే కాకుండా ఇప్పుడు తెలుగు సినిమా రంగానికీ అనిరుద్థ్ కావాల్సిన వాడిగా మారిపోయాడు. పలువురు స్టార్స్ హీరోల సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. చిన్న చిత్రాల నిర్మాతలకు అందనంత ఎత్తులోకి అనిరుద్థ్ వెళ్ళిపోయాడు. అతని పారితోషికం సైతం ఆకాశాన్ని తాకుతోందని అంటున్నారు. ఈ సమయంలో సాయి అభ్యంకర్ ఆగమనం చాలా మంది నిర్మాతలకు ఊరటను కలిగించబోతోంది. అనిరుథ్ కు భారీ రెమ్యూనరేషన్ ను ఇవ్వలేని వారికి సాయి అభ్యంకర్ కొత్త ఆప్షన్ గా నిలిచాడు. విశేషం ఏమంటే... అల్లు అర్జున్ - అట్లీ మూవీతో పాటు శివ కార్తికేయన్ కొత్త సినిమాకూ సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడని తెలిసింది. తక్కువ సమయంలో ట్యూన్స్ ఇవ్వడంతో పాటు, అతని రెమ్యూనరేషన్ కూడా అవకాశాలు పెరగడానికి ఆస్కారాన్ని కలిగిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Ram Charan: క్లీంకారా కు తోడుగా మరొకరు...
Also Read: Fauzi : చరిత్రలో దాగిన అధ్యాయాల్లో అత్యంత ధైర్యవంతుడు