GD Naidu: మరో బయోపిక్ లో మాధవన్...
ABN, Publish Date - Oct 27 , 2025 | 01:15 PM
ప్రముఖ నటుడు మాధవన్ మరో బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు. ఇండియన్ ఎడిషన్ అని పిలుచుకునే జి.డి. నాయుడు బయోపిక్ లో మాధవన్ నటిస్తున్నాడు.
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (R Madhavan) మరో బయోపిక్ కు పచ్చజెండా ఊపాడు. స్వీయ దర్శకత్వంలో ఆర్. మాధవన్ చేసిన 'రాకెట్రీ' (Rocketry) సినిమా చక్కని గుర్తింపును తెచ్చిపెట్టింది. అవార్డులూ అందించింది. ఇస్రో శాస్త్రవేత నంబి నారాయణన్ (Nambi Narayanan) పాత్రకు ప్రాణం పోసిన మాధవన్ ఇప్పుడు 'ఎడిసన్ ఆఫ్ ఇండియా' (Edison of India) గా చెప్పుకుని గోపాలస్వామి దొరైస్వామి నాయుడు ఉరఫ్ జీడీ నాయుడు (GD Naidu) పాత్రను చేయబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కు అతను దర్శకుడు కాదు. టైటిల్ రోల్ పోషించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఆదివారం 'జి.డి.ఎన్.' మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఓ వర్క్ షాప్ లో జీడీ నాయుడు వెల్డింగ్ చేస్తూ ముఖానికి ఉన్న సెఫ్టీ ఫీట్ ను పక్కకు తొలగించగానే ఆయన ముఖం కనిపిస్తుంది. అయితే పూర్తి బట్టతలతో ఉన్న జీడీ నాయుడు గా మాధవన్ ను చూసి చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. జీడీ నాయుడుగా మేకోవర్ కావడం కోసం మాధవన్ ఎంత కృషి చేశాడో ఈ స్మాల్ గ్లిమ్స్ చూస్తే అర్థమైంది.
'గణేశ్' సినిమాలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గెటప్ ను తలపించేలా మాధవన్ ఉండటం విశేషం. సోషల్ మీడియాలో కొందరైతే... ఇదసలు మాధవన్ అంటే నమ్మశక్యంగా లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పాత్ర కోసం మాధవన్ మేకప్ జరిగిన తీరును వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేస్తే ఆసక్తికరంగా ఉంటుంది.
ఇండియన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్.) బయోపిక్ ను కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వంలో వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన నాయుడు ఎలక్ట్రానిక్ మోటర్స్ తో పాటు పలు వ్యవసాయ ఉపకరణాలను కనిపెట్టారు. ప్రియమణి (Priyamani), జయరామ్ (Jayaram), యోగి బాబు (Yogi Babu) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించబోతున్న ఈ సినిమాకు గోవింద్ వసంత (Govind Vasantha) సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా జనం ముందుకు రాబోతోంది.
Also Read: Last Samurai Standing OTT: 300 మంది.. సమురాయ్‌లు తలబడితే! ఓటీటీకి.. కళ్లు చెదిరే వెబ్ సిరీస్
Also Read: Krishna Leela: ప్రేమించడం, ప్రేమించబడటం.. రెండూ కర్మలే! కృష్ణలీల ట్రైలర్