Vishal: 'మకుటం' కోసం రంగంలోకి దిగిన విశాల్
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:44 PM
ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత విశాల్ ఇప్పుడు దర్శకుడిగానూ మారాడు. తన కొత్త సినిమా 'మకుటం' దర్శకుడు రవి అరసుతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఇప్పుడు విశాల్ దర్శకుడిగా మారిపోయాడు.
హీరో, ప్రొడ్యూసర్ విశాల్ కు దర్శకత్వం అంటే కూడా మక్కువే. గతంలో మిస్కిన్ డైరెక్షన్ లో విశాల్ 'తుప్పరివాలన్' అనే మూవీ చేశాడు. అది 'డిటెక్టివ్' పేరుతో తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో దానికి సీక్వెల్ చేయాలని విశాల్ అనుకున్నాడు. కానీ సీక్వెల్ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. దాంతో విశాల్ 'తుప్పరివాలన్' సీక్వెల్ ను స్వీయ దర్శకత్వంలో చేయటానికి సిద్థపడ్డాడు. కానీ అది అనుకున్న సమయానికి పట్టాలెక్కేలేదు. అయితే ఇప్పుడు విశాల్... తాను హీరోగా నటిస్తున్న మరో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. అదే 'మకుటం'. ఇది ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి బ్యానర్ లో నిర్మితమౌతున్న 99వ చిత్రం. రవి అరసు కథకుడిగా, దర్శకుడిగా ఈ సినిమా షూటింగ్ కొద్ది కాలం క్రితం మొదలైంది. దాదాపు యాభై శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే... విశాల్, రవి అరసు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దర్శకుడు పక్కకు తప్పుకున్నాడు. దాంతో ఈ సినిమాను పూర్తి చేసే బాధ్యతను విశాల్ భుజానికి ఎత్తుకుని మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. సో... విశాల్ దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా 'మకుటం' కాబోతోంది.
ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో 'మకుటం' మూవీ సెకండ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, 'మొదటి నుంచి ఈ సినిమాను నేనే డైరెక్ట్ చేయాలని అనుకున్నాను. కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయాను. ఇక ఇప్పుడు నిర్ణయం తీసేసుకుని ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇది బలవంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, బాధ్యతతో తీసుకున్న నిర్ణయం. నటీనటులను, సాంకేతిక నిపుణులను నమ్మి నిర్మాత కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంటారు. ఒక నిబద్థతతో వారికి బాసట నిలవాల్సిన బాధ్యత హీరోకు ఉంటుంది. అందుకే నేను దర్శకుడిగా మారాను. ప్రేక్షకులకు అద్భతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నాను' అని అన్నారు.
‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా ఉన్నారు. ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
Also Read: Thamma Movie Review: రశ్మిక.. థామా బాలీవుడ్ మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?
Also Read: Vash Level 2: ఓటీటీకి.. ఒళ్లు గగుర్పొడిచే హర్రర్ థ్రిల్లర్! మీ గుండెలు భద్రం