Vash Level 2: ఓటీటీకి.. ఒళ్లు గ‌గుర్పొడిచే హ‌ర్రర్‌ థ్రిల్ల‌ర్! మీ గుండెలు భ‌ద్రం

ABN , Publish Date - Oct 21 , 2025 | 04:18 PM

రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లై దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన హ‌ర్ర‌ర్‌ చిత్రం వష్ లెవల్ 2

Vash Level 2

రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లై దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన హ‌ర్ర‌ర్‌ చిత్రం వష్ లెవల్ 2 (Vash Level 2). అయితే ఇది మ‌నం రెగ్యుల‌ర్‌గా వినే, చ‌దివే బాలీవుడ్‌, హాలీవుడ్‌, సౌత్ సినిమా కాదు. ఓ గుజ‌రాతీ చిత్రం కావ‌డం గ‌మ‌నార్హం. 2023లో ఓ మాములు గుజ‌రాతీ సినిమాగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన వ‌ష్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ మూవీ మొద‌టి భాగాన్ని మించి విజ‌యం సాధించింది. ఇప్పుడీ సినిమా ఇన్నాళ్ల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అయితే ఈ సినిమా మొద‌టి పార్ట్‌కు వ‌చ్చిన క్రేజ్‌తో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, మాధవ‌న్‌, జ్యోతిక కాంబోలో బాలీవుడ్‌లో సైతాన్ మూవీ తెర‌కెక్క‌డం విశేషం.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ స్కూల్‌కు వెళ్లిన విద్యార్ధినులు మ‌ధ్యాహ్నం భోజ‌నాలు చేస్తున్న స‌మ‌యంలో ఉన్న‌ఫ‌లంగా బిల్డింగ్ ట‌వర్స్ పైకి ఎక్కి ఏడెనిమిది మంది స్టూడెంట్స్ ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. ఆపై మ‌రికొంద‌రు విద్యార్థులు, ప‌ని చేసే వారు సైతం వింత‌గా ప్ర‌ద‌ర్శిస్తుంటారు. కొద్ది స‌మ‌యంలోనే పోలీసుల‌కు, మీడియాకు కూడా తెలియ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం అవుతుంది. అదే స‌మ‌యం లో మంచానికే ప‌రిమిత‌మైన‌ త‌న కూతురు ఆర్య‌తో క‌లిసి సిటీకి దూరంగా ఉంటున్న అధ‌ర్వ‌కు ఈ విష‌యం తెలిసి షాక‌వుతాడు. త‌న కూతురు స‌మ‌స్య‌కు కార‌ణ‌మైన వ‌శీక‌ర‌ణ మాదిరే స్కూల్‌లో జ‌రుగుతుంద‌ని భావించి అక్క‌డ‌కు వెళ‌తాడు.

Vash Level 2

అక్క‌డ‌కు వెళ్లాక రాజ్‌నాధ్ అనే వ్య‌క్తి ఆ స్కూల్ విద్యార్థినుల‌ను వ‌శీక‌ర‌ణ చేసి న‌గ‌రంలోకి పంపించిన‌ట్లు తెలుసుకుంటాడు. సిటీలోకి వెళ్లిన విద్యార్థ‌నులు రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తించి క‌నిపించిన వారిని క‌నిపిచిన‌ట్లు చంపేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో హీరో అధ్వ‌ర్వ ఏం చేశాడు.. స్కూల్‌లో, న‌గ‌రంలో జ‌రిగిన బీభ‌త్సాన్ని ఎలా అదుపులోకి తీసుకు వ‌చ్చాడు. రాజ్‌నాధ్ ఎందుకు ఇంత దారుణానికి ఒడి గ‌ట్టాడు, త‌న గురువు దొరికాడా లేదా హీరో కూత‌రిని తిరిగి మాములు మ‌నిషిగా చేశాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌, ఓళ్లు గ‌గుర్నొడిచే స‌న్నివేశాల‌తో సినిమా సాగుతుంది. సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాల‌కే క‌థ మొద‌లై చివ‌రి వ‌ర‌కు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ముఖ్యంగా విద్యార్థినులు స్కూల్ నుంచి సిటీలోకి వెళ్లే క్ర‌మంలో వ‌చ్చే సినిమాలు ఒళ్లు జ‌ల‌ద‌రింప చేస్తాయి.

Vash Level 2

పిల్ల‌ల‌ను త‌న అదుపులో ఉంచుకుని విల‌న్ చేయించే ప‌నులు చూసే వారికి షాకింగ్ ఫీల్ ఇస్తాయి, మ‌న‌ల్ని ప్ర‌త్య‌క్షంగా భ‌య పెడ‌తాయి కూడా. ఇక సినిమా క్లైమాక్స్ సైతం మంచిగానే ముగించారు. ఇప్పుడీ సినిమా బుధ‌వారం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవ‌నుంది. గుజ‌రాతితో పాటు హిందీ భాష‌లోనూ అందుబాటులో ఉండ‌నుంది. సినిమా చూస్తుంటే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.. భాషా స‌మ‌స్య అస‌లు అనిపించ‌దు. ఇక తెలుగులో చాలా సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించి ఆపై బిగ్‌బాస్‌లోనూ పాల్గొని మెప్పించిన గుజ‌రాతీ బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం.

హ‌ర్ర‌ర్‌, స్లాష‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఈ వష్ లెవల్ 2 (Vash Level 2) చిత్రం మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్ ఇస్తుంది. సున్నిత హృద‌యులు దూరంగా ఉండ‌డం మంచిది. ఇక‌.. క్లైమాక్స్‌లో హీరో త‌న పాపను ర‌క్షించుకునే స‌మ‌యంలో విల‌న్ చెప్పే సీక్రెట్‌కు చూసే ఆడియ‌న్స్‌కు ఫ్యూజులు ఎగిరి పోవ‌డం ఖాయం. దీనికి ఇంత జ‌రిగిందా.. ఇన్నాళ్లు వెయిట్ చేశారా అని మ‌న బుర్ర ఒక్క సెక‌న్ ఆగిపోవ‌డం మాత్రం గ్యారంటీ.

Updated Date - Oct 21 , 2025 | 04:47 PM