Thamma Movie Review: రశ్మిక.. థామా బాలీవుడ్‌ మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?

ABN , Publish Date - Oct 21 , 2025 | 03:15 PM

రశ్మిక మందణ్ణ ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ యేడాది ఆమె నటించిన 'ఛావా, సికందర్' చిత్రాలు విడుదల కాగా తాజాగా దీపావళి కానుకగా 'థామా' మూవీ విడుదలైంది.

Thamma Movie

మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ఇప్పుడు హారర్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వరుసపెట్టి అదే తరహా సినిమాలను బ్యాక్ టు బ్యాక్ నిర్మిస్తూ ఆ జానర్ లోనూ తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తోంది. 'స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్యా' తర్వాత అదే కోవలో 'థామా' చిత్రాన్ని నిర్మించింది. ఈ యేడాది ప్రారంభంలో ఈ సంస్థ నుండి వచ్చిన 'ఛావా' చిత్రంలో యేసు బాయి భోంస్లే గా నటించిన రశ్మికా మందణ్ణ 'థామా'లో తడ్కా అనే బేతాళురాలి పాత్రను పోషించింది. మరి దీపావళి కానుకగా వచ్చిన 'థామా' (Thamma) ఎలా ఉందో తెలుసుకుందాం...

అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా Ayushmann Khurrana) టీవీ ఛానెల్ రిపోర్టర్. ఏదో ఒక సంచలనం సృష్టించి వ్యూవర్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకోవాలని తపన పడుతుంటాడు. ఓసారి దట్టమైన అడవిలోకి షూట్ కోసం స్నేహితులతో వెళ్ళి, అక్కడ ఎలుగుబంటి దాడికి గురవుతాడు. అతన్ని బేతాళురాలైన తడ్కా (రశ్మిక మందణ్ణ Rashmika Mandanna) కాపాడుతుంది. మానవాతీత శక్తులు కలిగిన బేతాళులకు యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్థికి Nawazuddin Siddiqui) అధిపతి. అయితే మనుషుల రక్తం తాగకూడదనే నిబంధనను ఉల్లంఘించడంతో వందేళ్ళ పాటు అతన్ని ఖైదీ చేస్తారు. తమలోని ఒకరు మనిషి రక్తం తాగితే... అతనికి విమోచన జరిగి, ఆ వ్యక్తి ఖైదీ కావాల్సి ఉంటుంది. అలోక్ మీద ప్రేమ పెంచుకున్న తడ్కా... అతని కోరిక మేరకు అడవిని వదిలి, సిటీలోకి అడుగు పెడుతుంది. బేతాళురాలైన తడ్కా... నగర జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆమె కారణంగా బేతాళుడిగా మారిన అలోక్... ఆ జాతికి ఎలా అధిపతి అయ్యాడు? ఈ క్రమంలో భేడియాకు అతనికి మధ్య పోరాటం ఎందుకు జరిగింది? అనేది మిగతా కథ.


'థామా' రిలీజ్ కు కొద్ది రోజుల ముందు నుండి 'భేడియా' చిత్రానికి దీనికి సంబంధం ఉంటుందనే ప్రచారం జరిగింది. అది వాస్తవమే! దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ (Aditya Sapotdar) తెలివిగా 'భేడియా'ను రంగంలోకి దించాడు. బేతాళుడిగా మారిన మనిషి రక్తం తాగితే... భేడియా(వరుణ్ ధావన్ Varun Dhavan) శక్తి రెట్టింపు అవుతుంది. దాంతో అతను అలోక్ రక్తాన్ని తాగి... అతన్నే అంతం చేయాలని చూస్తాడు. తడ్కాతో కలిసి భేడియా ముప్పు నుండి అలోక్ తప్పించుకున్నా... సినిమా క్లయిమాక్స్ లో తిరిగి అతన్ని ప్రవేశ పెట్టి, దీనికి సీక్వెల్ ఉంటుందన్నట్టుగా దర్శకుడు ముగించాడు.

tstills.jpg

'థామా' విషయానికి వస్తే... బేతాళుల ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్ళడం కోసం దర్శకుడు ఆదిత్య చేసిన ప్రయత్నం పెద్దంత సఫలం కాలేదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలాంటి ఉత్సుకతను కలిగించలేదు. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ మూవీలో ఎక్కడా హై మూమెంట్స్ కనిపించవు. తడ్కా ను తన ఇంటికి అలోక్ తీసుకొచ్చిన సందర్భంలో అతని తల్లిదండ్రులకు సంబంధించిన సీన్స్ కాస్తంత ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. బేతాళుల చరిత్ర, వారిలో కొందరు మనుషులకు, వారికి మధ్య వారధిగా పని చేస్తూ జనజీవన స్రవంతిలో కలిసిపోవడం వంటి అంశాలేవీ ఆసక్తిని కలిగించేలా లేవు.

నటీనటుల విషయానికి వస్తే ఆయుష్మాన్ ఖురానా నటన ఏమంత గొప్పగా లేదు. రశ్మిక మందణ్ణ ను సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఓ గ్లామర్ పీస్ గానే దర్శకుడు చూపించాడు. ఆమెతో చేయించిన యాక్షన్ సీన్స్ కొంతమేరకు ఫర్వాలేదు. హీరో తల్లిదండ్రుల పాత్రలు పోషించిన పరేశ్‌ రావల్ (Paresh Rawal, గీతా అగర్వాల్ పాత్రలే ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ ఇచ్చాయి. బేతాళుల అధినేతగా నటించిన నవాజుద్దీన్ సిద్థిఖీ నటన కూడా కృతకంగా ఉండి చికాకు తెప్పిస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులలో కాస్తంత కదలిక వరుణ్‌ థావన్ తెర మీద కనిపించే రెండు మూడు సీన్స్ లో కలుగుతుంది. అయితే ఆయుష్మాన్, వరుణ్ మధ్య పోరాట సన్నివేశాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. సత్యరాజ్ (Satyaraj) ఇందులో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఆయుష్మాన్ ఖురానా, రశ్మిక మధ్య ప్రేమానుబంధాన్ని చూపడం కోసం మూడు లిప్ లాక్ సీన్స్ పెట్టారు. అలానే మలైకా అరోరా (Malaika Arora), నోరా ఫతేహీ (Nora Fatehi) లపై రెండు ఐటమ్ సాంగ్స్ తీశారు. ఆయుష్మాన్, రశ్మికపై చిత్రీకరించిన ఎరోటిక్ డాన్స్ మూమెంట్ సాంగ్ ఎండ్ టైటిల్స్ లో వస్తుంది. ఓ రకంగా దాన్ని కూడా ఐటమ్ సాంగ్స్ కేటగిరిలో చేర్చేయొచ్చు.


ఎనిమిది వందల కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'ఛావా' (Chaawa) లో మహారాణి పాత్రను పోషించిన రశ్మిక మందణ్ణ అదే సంస్థ నిర్మించిన 'థామా'లో అందుకు పూర్తి భిన్నమైన పాత్రను చేసింది. 'ఛావా, థామా' మధ్యలో విడుదలైన రశ్మిక హిందీ చిత్రం 'సికందర్' ఫలితం సైతం ఆమెను నిరాశకే గురిచేసింది. ఏదేమైనా... మ్యాడ్ డాక్ సంస్థ నుండి ఇంతవరకూ వచ్చిన హారర్ కామెడీ చిత్రాల స్థాయిలో 'థామా' లేదనే చెప్పాలి.

రేటింగ్ : 2.25/5

ట్యాగ్ లైన్ : థామా కాదు ట్రామా!

Updated Date - Oct 21 , 2025 | 03:54 PM