Priyanka Mohan: శివరాజ్ కుమార్‌తో.. ప్రియాంక మోహన్! ఆరేండ్ల తర్వాత కన్నడలో రీ ఎంట్రీ
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:14 PM
ప్రియాంక అరుల్ మోహన్... డా. శివరాజ్ కుమార్, ధనుంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'లో నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) కెరీర్ కన్నడ చిత్రం 'ఒంద కథ హెల్లా'తో ఆరేళ్ళ క్రితం మొదలైంది. ఆ తర్వాత అమ్మడు తమిళ, తెలుగు సినిమాలతో బిజీ అయిపోయింది. ఈ యేడాదిలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG)లో హీరోయిన్ గా నటించి, ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనికి ముందు తెలుగులో ప్రియాంక 'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం, సరిపోదా శనివారం' సినిమాలో చేసింది. అలానే పలు తమిళ అనువాద చిత్రాలతో తెలుగువారి ముందు కొచ్చింది.
ఇదిలా ఉంటే నవంబర్ 20 ప్రియాంక మోహన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె కొత్త కన్నడ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. డాక్టర్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), ధనుంజయ్ (Dhanunjay) కీలక పాత్రధారులుగా హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ నటించబోతోందని మేకర్స్ తెలిపారు.
ఈ విషయం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. 'శివరాజ్ కుమార్ గారి సినిమాలు చూస్తూ నేను పెరిగాను. ఆయన సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. హేమంత్ ఎం రావు గారి దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు' అని తెలిపింది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని నిర్మాత డాక్టర్ వైశాఖ్ జె గౌడ చెప్పారు. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తుండగా, అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. ఈ భారీ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
Also Read: Mahesh babu: ఉపేంద్ర పాత్ర కోసం దర్శకుడు ఏమన్నారంటే..
Also Read: Raj kundra: చీకట్లోనే ఉండండి.. ట్రోల్ చేస్తూ జీవించండి...