Pradeep Ranganathan: దీపావళి రేస్ లో రెండు సినిమాలు
ABN, Publish Date - Aug 23 , 2025 | 03:15 PM
పక్క ఇండస్ట్రీ కుర్రాడైనా... పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు. ఇతగాడు హీరో ఏంటీ అని కామెంట్స్ చేసిన వారికి హిట్ తోనే సమాధానం చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న ఈ యంగ్ స్టార్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. పైగా రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు.
కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ (Pradeep Ranganathan) జోరు మాములుగా లేదు. ‘లవ్ టుడే’ (Love Today) , డ్రాగన్ '( Dragon) హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు తమిళ్ ఇటు తెలుగులోను భారీ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. కరెంట్ తీగలా సన్నగా కనిపించే ప్రదీప్ హీరోనా అంటూ కామెంట్లు కురిపించినా... తన నటనతోనే సమాధానం చెప్పాడు. తాజాగా తాను నటించిన రెండు సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన హ్యాట్రిక్ హీరోగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.
ప్రదీప్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'డ్యూడ్' (Dude). ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. పైగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తోండగా కీర్తిస్వరన్ (Keerthiswaran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar) పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. అయితే... అదే రోజు ప్రదీప్ నటించిన మరో మూవీ కూడా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
నయనతార ప్రొడక్షన్ హౌజ్‌లో విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) డైరెక్షన్‌లో లిక్ (LIK) (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే మూవీని చేస్తున్నాడు. కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ మూవీ సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజాగా నిర్మాతలు ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత 'డ్యూడ్' నిర్మాతలు తమ చిత్రం ముందు అనుకున్న తేదీకే వస్తుందని, ఎలాంటి వాయిదా వేయడం లేదని తెలిపారు. ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తూ, బూమ్ బూమ్ అంటూ సాగే పాటను ఆగస్ట్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రదీప్ నటించిన 'లిక్, డ్యూడ్' రెండూ కూడా ఒకే రోజున బాక్సాఫీస్ రేస్ లో నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది.
మాములుగా సోలో రిలీజ్ కు వచ్చేందుకు హీరోస్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కానీ ప్రదీప్ మాత్రం తన రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ కు తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. పైగా సేమ్ డేట్ లో వస్తే కలెక్షన్ల విషయంలో నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. మరీ ఈ సమస్య నుంచి ప్రదీప్ ఎలా తప్పించుకుంటాడో... లేక ఏదైనా సినిమాను వాయిదా వేసుకుంటాడో చూడాలి.
Read Also: Haiwaan: అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ 'హైవాన్' షురూ
Read Also: Little Hearts: అనుకున్న రోజుకంటే ముందే...