Kollywood: తమిళంలో దీపావళికి యంగ్ హీరోస్ మధ్య వార్...

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:14 PM

ఈ యేడాది దీపావళికి తమిళనాట యంగ్ హీరోస్ మూవీస్ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో ప్రదీప్ రంగనాథన్, ధృవ్ విక్రమ్, హరీశ్‌ కళ్యాణ్‌ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి.

Kollywood

ఒకప్పుడు దీపావళి అంటే అగ్ర కథానాయకుల చిత్రాలతో థియేటర్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు మాత్రం యంగ్ హీరోస్ సినిమాలే దీపావళి బరిలో నిలుస్తున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఈ యేడాది దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఏకంగా ఐదు సినిమాలు సందడి చేయబోతున్నాయి. అయితే ఇందులో ప్రధానమైన పోటీ మూడు చిత్రాల మధ్యే ఉండబోతోంది.

యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. 'లవ్ టుడే' (Love today) మూవీ తర్వాత అతను నటించిన 'డ్రాగన్' మూవీ కూడా హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అతని తాజా చిత్రం 'డ్యూడ్' (Dude) మీదే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతోంది. మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్రను పోషించాడు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కీర్తిశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. చిత్రం ఏమంటే ఈ సినిమాతో పాటే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మరో సినిమా 'ఎల్.ఐ.సి.'ని కూడా దీపావళికి బరిలో దింపుతామని మొదట అన్నారు. అయితే ఆ తర్వాత ఆ చిత్రం డిసెంబర్ కు వాయిదా పడింది.


ఇక దీపావళికి వస్తున్న మరో సినిమా విక్రమ్ తనయుడు ధృవ్ (Dhruv) నటించి 'బైసన్' (Bison). కబడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran), రజీషా విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటించారు. నివాస్ కె ప్రసన్న దీనికి సంగీతం సమకూర్చాడు. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా నిడివి కాస్తంత ఎక్కువే. దీని రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు.

ఇదే వరుసలో రాబోతున్న మూడో చిత్రం 'డీజిల్' (Diesel). హరీశ్‌ కళ్యాణ్‌ (Harish Kalyan) హీరోగా నటిస్తున్న ఈ సినిమా అతుల్య రవి (Athulya Ravi) హీరోయిన్. షణ్ముగమ్ ముత్తుసామి దీనికి దర్శకుడు. ధీబు నైనన్ థామస్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. దీని రన్ టైమ్ రెండు గంటల 24 నిమిషాలు. ఈ మూడు సినిమాలు కాకుండా అక్టోబర్ 17వ తేదీనే సముతిరకని, గౌతమ్ వాసుదేవ మీనన్ నటించిన 'కర్మణి సెల్వమ్' (Carmeni Selvam), నట్టి నటరాజ్ నటించిన 'కంబి కట్న కథ' (Kambi Katna Kathaa) సినిమాలు వస్తున్నాయి. మరి ఐదు సినిమాలలో వేటికి ప్రేక్షకాదరణ లభిస్తుందో చూడాలి.

Also Read: Tollywood: శర్వాతోనే శ్రీను వైట్ల సినిమా

Also Read: Sreeleela: శ్రీలీలకు.. బాలీవుడ్‌లో ఎదురుదెబ్బ... నిర్మాతలను దోచుకుంటున్నార‌ని కామెంట్లు

Updated Date - Oct 15 , 2025 | 05:16 PM