Tollywood: శర్వాతోనే శ్రీను వైట్ల సినిమా

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:40 PM

శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల ఓ సినిమా చేయబోతున్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

Sharwanand - Sreenu Vaitla Movie

శ్రీను వైట్ల (Sreenu Vaitla) ఒకప్పుడు తెలుగులో క్రేజీయెస్ట్ డైరెక్టర్. యువ కథానాయకులతోనే కాదు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసి తన సత్తాను చాటుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాయి. అయితే... 2011లో వచ్చిన 'దూకుడు' తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. అంతేకాదు... 2018లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంథోని' సినిమా తర్వాత ఆయన ఏకంగా ఐదేళ్ళు దర్శకత్వానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక గత యేడాది 'విశ్వం' సినిమాతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీను వైట్ల... ఆ తర్వాత ఎట్టకేలకు ఓ ప్రాజెక్ట్ ను సెట్ చేయగలిగాడు.


'ఢీ' సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా మంచు విష్ణుతోనే శ్రీను వైట్ల సినిమా చేస్తాడనే ప్రకటన వచ్చింది. కానీ అది పట్టాలెక్కలేదు. ఈ లోగా గోపీచంద్ హీరోగా 'విశ్వం' సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కించాడు. ఇది థియేటర్లలో పెద్దంత ఆడకపోయినా... ఓటీటీలో బాగానే వీక్షకులను మెప్పించింది. అప్పటి నుండి మరో సినిమాను సెట్ చేసే పనిలో శ్రీను వైట్ల ఉన్నాడు. ఆ మధ్య నితిన్ (Nithiin) హీరోగా శ్రీను వైట్ల ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు శర్వానంద్ (Sharwanand) తో శ్రీను వైట్ల ప్రాజెక్ట్ లాక్ అయ్యిందని తెలుస్తోంది. 'విశ్వం'కు రచన చేసిన నందు (Nandu) ఈ సినిమాకూ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. శ్రీను వైట్ల చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ ను సెట్ చేసే పనిలో శ్రీను వైట్ల ఉన్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని, వచ్చే యేడాది ప్రారంభంలో ఇది సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. మరి శర్వా - శ్రీను వైట్ల తొలి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాతో మరోసారి వీరిద్దరూ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.

Also Read: Tollywood : నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

Also Read: ARI: శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ.. మా సినిమా పోస్టర్స్ చించివేయడం బాధగా అనిపించింది.

Updated Date - Oct 15 , 2025 | 01:40 PM