Navya Nair: నవ్య నాయర్ కు చేదు అనుభవం..
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:42 PM
కేరళ కుట్టి నవ్యానాయర్ కి చేదు అనుభవం ఎదురైంది. ఓనమ్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమ్మడికి ఉహించని షాక్ తగిలింది. ఆమె పరిస్థితిని తెలుసుకుని అయ్యోబిడ్డ అనేస్తున్నారు నెటిజన్లు.
మాములుగా సినీ ఇండస్ట్రీకి చెందిన తారలు నిత్యం చక్కర్లు కొడుతుంటారు. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ అంటూ విదేశాల్లో వాలిపోతుంటారు. అలా వెళ్లిన కొంత మంది సెలబ్రెటీలకు ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురవటం చూస్తుంటాం. అభిమానులు అసభ్యంగా ప్రవర్తించటం... ఎయిర్ పోర్ట్ సిబ్బంది దురుసుగా వ్యవహరించడం... లేదంటే కస్టమ్ అధికారుల వల్ల అసౌకర్యం కలగడం వంటివి జరగుతూ ఉంటాయి. అలా ఎయిర్ పోర్ట్ లో తమకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు కూడా. తాజాగా ఓ మళయాళ నటికి ఎదురైన చేదు అనుభవం హాట్ టాపిక్ గా మారింది.
మళయాళ నటి నవ్య నాయర్ కు ఉహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా లోని మళయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనమ్ ఉత్సాహాల్లో పాల్గొనేందుకు వెళ్ళారు. అందులో భాగంగా బ్యాగ్ లో 15 సెం.మీ పొడవున్న మల్లెపూల దండను తీసుకెళ్లారు. దీనిని గుర్తించిన మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు లక్ష 14 వేల జరిమానా విధించారు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో పూలు, పండ్లను తీసుకెళ్లడం నిషేదం. వాటి వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండటంతో కస్టమ్స్ అధికారులు అడ్డుకుంటుంటారు. అందుకే నటి తీసుకువచ్చిన మల్లెపూలపై భారీ ఫైన్ వేశారు అక్కడి అధికారులు. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో తెలియచేస్తూ తన మల్లెపూల ఖరీదు లక్షా 14 వేలని జోక్ చేశారు నవ్య నాయర్.
ఆస్ట్రేలియాకు వెళ్తున్న సమయంలో తన తండ్రి మల్లెపూలు కొని తెచ్చాడని, కొచ్చి నుంచి సింగపూర్కు వెళ్లే సమయంలో కొన్ని పెట్టుకున్నానని.... ఆ తర్వాత మరోసారి మిగిలినవి పెట్టుకునేందుకు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నట్లు వివరించారు. అలా తీసుకెళ్లడం తప్పన్న విషయం తెలియదని తెలిపారు నవ్య. తనకు విధించిన ఫైన్ 28 రోజుల్లో చెల్లించాలని డెడ్ లైన్ కూడా పెట్టారనగా నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఫైన్ విధించేందుకు ముందు నవ్య నాయర్ తీసుకున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అందులో ఆమె కేరళ సంప్రదాయ చీరకట్టుతో మల్లెపూలు అలంకరించుకుని, షాపింగ్ చేస్తూ, భోజనం చేస్తూ విమానం ఎక్కే ముందు కనిపించారు. ఓనమ్ మూడ్ పాటతో సెట్ చేసిన ఈ పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. కొందరు అయ్యో పాపం అంటుంటే. మరికొందరు మాత్రం ఎయిర్ పోర్ట్ అధికారుల పని తీరును మెచ్చకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: Bandla Ganesh: బండ్ల గణేశ్.. ఎంత పని చేశావ్! లిటిల్ హార్ట్స్.. మౌళికి కొత్త తలనొప్పి
Read Also: Venice Film Festival: భారతీయ దర్శకురాలికి.. అరుదైన గౌరవం