Bandla Ganesh: బండ్ల గణేశ్.. ఎంత పని చేశావ్! లిటిల్ హార్ట్స్.. మౌళికి కొత్త తలనొప్పి
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:16 PM
మౌళి తనూజ్‌కు లిటిల్ హార్ట్స్ సినిమాతో వస్తున్న మంచి స్పందనకు స్పందిస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది.
కామెడీ వీడియోల ద్వారా యూత్‌లో మంచి పేరు సంపాదించిన యూట్యూబర్ మౌళి తనూజ్ (Mauli Tanuj), ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆయన నటించాన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts) విడుదలైన మొదటి రోజే మంచి స్పందన అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. అయితే,.. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh).. హీరో మౌళిని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ అనుకోకుండా వివాదంగా మారింది. దీని ప్రభావం సినిమాపై పడుతుందేమో అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
మౌళి తనూజ్ మొదటగా యూట్యూబ్‌లో కామెడీ రీల్స్‌తో యువతలో పేరు పొందాడు. లైఫ్ స్టైల్ ఆధారంగా సరదా వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆపై రెండేండ్ల క్రితం వచ్చిన #90స్ వెబ్ సిరీస్‌లో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చిత్రంతో హీరోగా అడుగు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టి, మంచి రెస్పాన్స్ అందుకుంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా కూడా పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
మరోవైపు.. బండ్ల గణేష్ ఇటీవల సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ రాజకీయ , సినీ ప్రముఖులకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపుతూ హంగామా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం ఆయన లిటిల్ హార్ట్స్ హీరో మౌళిని ప్రశంసిస్తూ “కొడితే నీలా కొట్టాలిరా బాబు దెబ్బ… చంపేశావ్… ఇక దున్నేయ్ టాలీవుడ్ నీదే!” అంటూ ట్వీట్ చేశారు. హీరోను మెచ్చుకునే ఉద్దేశంతో చేసిన ఈ ట్వీట్, ఆయన గతంలో ఎదుర్కొన్న రాజకీయ వివాదాలను గుర్తు చేసేలా ఉందని నెట్టింట రచ్చ మొదలయింది.
గత రాజకీయ వివాదం ఏమిటి?
మౌళి సినిమాల్లోకి రాకముందు యూట్యూబ్‌లో కామెడీ కంటెంట్‌తో పేరు సంపాదించాడు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదని సూచించేలా సరదాగా రూపొందించిన వీడియో వైరల్ అయింది. ఇది ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీంతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు మౌళిపై విమర్శలకు దిగగా, ఆయన స్పందించి క్షమాపణలు తెలిపారు.
“నేను వేసిన ఒక జోక్ ఇంటర్నెట్‌లో నాపై చాలా విమర్శలు వచ్చేలా చేసింది. నాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఎవరినీ కించపరచాలని అనుకోలేదు. అనుకోకుండా నా మాటల వళ్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. నేను హెల్తీ కామెడీ కోసం, ప్రజలను నవ్వించడానికి మాత్రమే అలా చేశాను. దయచేసి నా కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగవద్దని కోరుతున్నాను.” అని ఏడాదిన్నర క్రితం క్షమాపణలు చెప్పాడు. అయితే.. ఇప్పుడు మౌళిని సినిమా విజయం దృష్ట్యా తనను అభినందించాలనే ఉద్దేశంతో బండ్ల గణేష్. చేసిన ట్వీట్ అనుకోకుండా పాత అంశాన్ని టచ్ చేసి కొత్త వివాదానికి దారి తీసినట్లైంది.
దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ఇప్పుడే ఎదుగుతున్న హీరోను వివాదంలోకి లాగడం సరైంది కాదని, సినిమాకు మంచి స్పందన వస్తున్న సమయంలో అనవసర చర్చలకు తావిస్తున్నారని, మౌళిని అందరూ అభినందిస్తున్న సమయంలో, ఇలా పాత రాజకీయ అంశాన్ని గుర్తు చేయడం వల్ల సినిమా విజయంపై ప్రభావం ఉండొచ్చని ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని పోస్టులు పెడుతున్నారు.