Vrusshabha: మోహన్ లాల్ సినిమాకూ తప్పలేదు...
ABN, Publish Date - Nov 06 , 2025 | 04:40 PM
మోహన్ లాల్ నటించిన 'వృషభ' సినిమా మరోసారి వాయిదా పడింది. నందకిశోర్ దర్శకత్వంలో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటించిన 'వృషభ' (Vrusshabha) సినిమా నిజానికి గత యేడాది విడుదల కావాల్సి ఉంది. కానీ మూవీ మేకింగ్ లో జరిగిన జాప్యంతో అనేక సార్లు దానిని వాయిదా వేసిన మేకర్స్ చివరకు నంబర్ 6న దీన్ని మలయాళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. కానీ గురువారం కూడా ఈ సినిమా జనం ముందుకు రాలేదు. వీఎఫ్ఎక్స్ పనిలో జరుగుతున్న జాప్యంతో మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే తిరిగి ఎప్పుడు రిలీజ్ చేసేదీ దర్శక నిర్మాతలు చెప్పలేదు కానీ డిసెంబర్ నెలాఖరు లేదంటే 2026 ప్రారంభంలో దీనిని విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
'వృషభ' చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్ (Shobha Kapoor), ఏక్తా ఆర్ కపూర్ (Ektha R Kapoor), సి. కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో దీనిని నందకిశోర్ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమాతో ఓ చరిత్రను క్రియేట్ చేయబోతున్నామని, బలమైన భావోద్వేగాలతో పాటు అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమా ఉంటుందని, బంధాలు, త్యాగాల కలయికగా కథ సాగుతుందని నందకిశోర్ తెలిపారు. ఇదో ప్రత్యేకమైన, సంక్లిష్టమైన కథ అయినా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించేలా నందకిశోర్ (Nandakishore) 'వృషభ'ను తెరకెక్కించారని ఏక్తా కపూర్ చెప్పారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషించిన ఈ తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణీ ద్వివేది (Ragini Dwivedi), నయన్ సారిక (Nayan Sarika) ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సి.ఎస్. (Sam CS) సంగీతాన్ని అందించారు. ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి (Resul Pookutty) దీనికి సౌండ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Rashmika Mandanna: కోరి తలనొప్పి తెచ్చుకోవడం అవసరమా
Also Read: Bollywood: మనోజ్ బాజ్ పాయ్ తో రానా సినిమా...