Shine Tom Chacko: అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:54 AM
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో జీవితంలో చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకూ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న షైన్ ఇప్పుడు డ్రగ్స్ ఎబ్యూజ్ విషయంలో అవేర్ నెస్ తీసుకొచ్చే 'బెంగళూరు హై' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కొన్ని సినిమాల్లోని ట్విస్టులు నమ్మశక్యంగా ఉండవు. కానీ నిజ జీవితంలోని ట్విస్టులతో పోల్చితే సినిమాల్లోని మలుపులు నథింగ్! ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) జీవితంలో జరుగుతున్న సంఘటనలు సైతం అలాంటివే. నటుడిగా మలయాళంలోనే కాదు... తమిళ, తెలుగు భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో షైన్ టామ్ చాకో కెరీర్ పై నీలినీడలు అలుముకున్నాయి. సినిమాల్లో నటించే సమయంలోనూ అతను డ్రగ్స్ ను వాడుతుంటాడని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు. అతని సహ నటీనటులైతే, ఆ విషయాన్ని ధృవీకరించారు. కొందరు అతని ప్రవర్తన అనుచితంగా ఉందంటూ కేసులూ పెట్టారు. ఆ మధ్య పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరిపి బెయిల్ మీద విడుదల చేశారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ షైన్ టామ్ చాకో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఓ రోడ్ ప్రమాదంలో ఆయన తండ్రి చనిపోయారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో షైన్ టామ్ చాకో అంగీకరించిన ఓ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పక్క మాదక ద్రవ్యాల వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న షైన్ టామ్ చాకో... ఇప్పుడు డ్రగ్స్ ఎబ్యూజ్ మీద తీస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో పలు ప్రతిష్ఠాత్మకమైన చిత్రాలను నిర్మించిన కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత డాక్టర్ రాయ్ సి.జె. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పబ్లిక్ లో డ్రగ్స్ పై అవేర్ నెస్ తీసుకొచ్చేందుకు నిర్మిస్తున్న ఈ సినిమాకు 'బెంగళూర్ హై' (Bangalore High) అనే పేరు పెట్టారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ బెంగళూర్ లోనే మొదలైంది. దీనికి షైన్ టామ్ చాకో తోపాటు కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు కూడా హజరయ్యారు. సిజు విల్సన్, క్వీన్ ఫేమ్ అశ్విన్ జోస్, బాబురాజు, శాన్వీ శ్రీవాత్సవ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వికె ప్రకాశ్ దర్శకత్వంలో వహిస్తున్న 'బెంగళూరు హై' మూవీ భారీగా ప్రారంభోత్సవం జరుపుకుంది. డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని గ్రహించిన షైన్ టామ్ చాకో... ఇప్పుడీ సినిమాలో నటించి, ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేయబోతున్నాడని మూవీ టీమ్ చెబుతోంది. ఏదేమైనా డ్రగ్స్ కేసులో నిందితుడే... డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్ధాలను తెలియచేసే సినిమాలో కీలక పాత్ర పోషించడం విశేషం.
Also Read: Coolie Powerhouse Song: కూలీ నుంచి ‘పవర్‌హౌస్’ లిరిక్ వీడియో.. రజనీ ఫ్యాన్స్‌లో ఫుల్ హైప్
Also Read: Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ మూవీలో బ్రహ్మానందం పాత్ర ఏమిటీ...