Kantara 1: 'ఛావా'ను దాటేసిన 'కాంతార: చాప్టర్ 1'

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:09 PM

అనుకున్న విధంగానే 'ఛావా' రికార్డులను 'కాంతార: చాప్టర్ 1' అధిగమించింది. రూ. 818 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ఈ యేడాది హైయెస్ట్ గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

Kantara: Chapter 1 Movie

అనుకున్నదే అయ్యింది... ఈ యేడాది ఇంతవరకూ హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న 'ఛావా' (Chhaava) చిత్రాన్ని 'కాంతార: చాప్టర్ 1' (Kantara: Chapter 1) దాటేసింది. ఈ యేడాది ఫిబ్రవరి 14న విడుదలైన హిందీ సినిమా 'ఛావా' ఆ తర్వాత ఇతర భారతీయ భాషల్లోకీ డబ్ అయ్యింది. తొలి ఆట నుండే 'ఛావా' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఛతప్రతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీగా విక్కీ కౌశల్ అద్భుత నటన ప్రదర్శించాడు. అతని భార్య యశుబాయి భోంస్లే గా నేషనల్ క్రష్‌ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) నటించింది. విక్కీ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఫలితంగా 'ఛావా' సినిమా టోటల్ రన్ రూ. 808 కోట్లకు చేరింది. అయితే... ఆ తర్వాత ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చినా, మాస్ హీరోల చిత్రాలు వచ్చినా 'ఛావా' ఈ యేడాది సృష్టించిన రికార్డ్ ను దాటలేకపోయాయి.


అయితే మళ్లీ ఇన్ని నెలలకు 'ఛావా' గ్రాస్ ను 'కాంతార: చాప్టర్ 1' అధిగమించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదలైన ఈ సినిమాకు దసరా, దీపావళి శలవులు బాగా కలిసి వచ్చాయి. పైగా 'కాంతార' చిత్రానికి వచ్చిన క్రేజ్... ఈ సినిమా ఓపెనింగ్స్ కు బాగా ఉపయోగపడ్డాయి. డే వన్ నుండి 'కాంతార' బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతూ వచ్చింది. అందరూ అనుకున్నట్టు, ఆశించినట్టు 'ఛావా'ను 'కాంతార: చాప్టర్ 1' దాదాపు మూడు వారాల్లో దాటేసింది. తాజా ఈ సినిమా '818' కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో 'కాంతార: చాప్టర్ 1' అతి త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ ను కూడా దాటే ఆస్కారం లేకపోలేదు. రిషబ్ శెట్టి (Rishabh Shetty) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) పోషించింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. 'కాంతార', 'కాంతార : చాప్టర్ 1'లకు విశేష ఆదరణ లభించడంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రిషబ్ శెట్టి ఇతర ప్రాజెక్ట్స్ కు సహజంగానే క్రేజ్ వచ్చేసింది.

Also Read: Prabhas: సినిమాను.. పండుగలా మార్చే వ్యక్తి

Also Read: Mario: 'మారియో' విడుదల ఎప్పుడంటే.. 

Updated Date - Oct 24 , 2025 | 12:09 PM