Thug Life: కమల్ క్షమాపణ చెప్పకపోతే జరిగేది ఇదే.. ?
ABN, Publish Date - Jun 04 , 2025 | 03:08 PM
విశ్వనాయకుడు కమల్ హాసన్ ( Kamal Haasan) వివాదం.. ఇప్పుడు రెండు ఇండస్ట్రీల మధ్య మంట పెట్టింది.
విశ్వనాయకుడు కమల్ హాసన్ ( Kamal Haasan) వివాదం.. ఇప్పుడు రెండు ఇండస్ట్రీల మధ్య మంట పెట్టింది. పాలు, నీళ్లలాగా కలిసి ఉన్న కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలు .. ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. దానికి కారణం కమల్ మాత్రమే అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. కన్నడ.. తమిళ్ నుంచి పుట్టింది అంటూ ఒక స్టేట్మెంట్ ను పాస్ చేశాడు. ఈ మాటకు కన్నడిగులు హార్ట్ అయ్యారు. కమల్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
గోటితో పోయేదాన్ని గొడ్డలివరకు తెచ్చుకున్నట్లు... సారీ అని ఒక్క మాట కమల్ చెప్పి ఉంటే ఈ వివాదం ఇక్కడ వరకు వచ్చేది కాదు. కానీ, కమల్ మాత్రం సారీ చెప్పడం కుదరదు.. నేను అన్నదాంట్లో తప్పు లేదు అని చెప్పడంతో.. థగ్ లైఫ్(Thug Life) సినిమాను జూన్ 05న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయకూడదని కోరుతూ KFCCకి కర్నాటక హైకోర్ట్ లేఖ రాసింది. కోర్టు చెప్పినా కూడా కమల్ సారీ చెప్పలేదు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి రెండు ఫిల్మ్ ఛాంబర్ల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. ఇక చేసేది లేక తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA).. KFCC కి ఒక పెద్ద లేఖ రాసింది.
Also Read: Bunny Vas: సొంత బ్యానర్ పెట్టిన బన్నీ వాస్.. కొత్త సినిమా షురూ
రెండు ఇండస్ట్రీల మధ్య ఇలాంటి వైరం వద్దని, థగ్ లైఫ్ ని జూన్ 5 న కర్ణాటకలో రిలీజ్ చేయడానికి అనుమతిని ఇవ్వాలని కోరింది. ఎప్పటినుంచో రెండు ఇండస్ట్రీలు మంచి సత్సంబంధాలను కలిగి ఉందని, ఈ వివాదం వలన ఆ బంధం పోగొట్టుకుంటే రెండు ఇండస్ట్రీలు నష్టపోతాయని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కమల్ ఏ విధంగా ఆ మాటను అన్నారో అర్ధం చేసుకోవల్సిందిగా కోరింది. అయితే ఈ లేఖకు ఇప్పటివరకు సమాధానం రాలేదు. KFCC ఈ విషయమై ఏం ఆలోచించిందో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ KFCC కనుక కర్ణాటకలో రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటే.. కన్నడిగులు ఉగ్రరూపం దాలుస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
భాషాభిమానం ఎక్కువ ఉన్న కన్నడిగులు కమల్ సారీ చెప్పకపోయినా కూడా తగ్గుతారు అంటే నమ్మడం కష్టమే. కమల్ కనుక సారీ చెప్పకపోతే మాత్రం రెండు ఇండస్ట్రీల మధ్య అగాధం ఏర్పడుతుంది అనేది ఖాయం. అంతేకాకుండా దీని తరువాత కన్నడ నటులు తమిళ్ సినిమాల్లో ఎక్కడ కనిపించరు అని చెప్పొచ్చు. కమల్ ఒక్క సారీ విలువ కేవలం థగ్ లైఫ్ నష్టాల్లో పోవడమే కాకుండా రెండు ఇండస్ట్రీల సత్సంబంధాన్ని వేరు చేస్తుంది. సినిమా నష్టపోయినా పర్లేదు కానీ.. ఛాంబర్స్ మధ్య అగాధం ఏర్పడితే.. అది భవిష్యత్ లో ఎవరికి మంచిది కాదు. మరి ఇప్పటికైనా వీఏటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని కమల్ క్షమాపణలు కోరతాడేమో చూడాలి.