Usurae: వాస్తవ సంఘటనలతో ప్రేమకథా చిత్రం
ABN , Publish Date - Jul 23 , 2025 | 02:27 PM
రాశి హీరోయిన్ తల్లిగా నటించిన 'ఉసురే' సినిమా ఆగస్ట్ 1న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించారు.
యదార్థ సంఘటనలతో, వాస్తవానికి దగ్గరగా తెరకెక్కిన గ్రామీణ ప్రేమకథా చిత్రం 'ఉసురే' (Usurae). టీజై అరుణాచలం, జననీ గుణశీలన్ హీరో, హీరోయిన్లుగా నవీన్ డి గోపాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. మౌళి ఎం రాధాకృష్ణ దీన్ని నిర్మించారు. ఆగస్ట్ 1న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా తెలుగులో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత మౌళి ఎం రాధాకృష్ణ (Mouli M. Radhakrishna) మాట్లాడుతూ, 'ఈ సినిమా దర్శకుడు నాకు కజిన్. పన్నెండేళ్ళ క్రితం ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. దాంతో ఇప్పుడీ సినిమా చేశాం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూని తీసుకుని చేసిన మూవీ ఇది. ఇందులో రాశి హీరోయిన్ తల్లి పాత్రను చేశారు. ఈ సినిమాను లోకేశ్ కనకరాజ్, విజయ్ సేతుపతి, శ్రుతీహాసన్ వంటి వారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు' అని అన్నారు. దర్శకుడు నవీన్ డి గోపాల్ (Naveen D. Gopal) మాట్లాడుతూ, 'ఇటీవల చెన్నయ్ లో మూవీ ట్రైలర్ ను కమల్ హాసన్ గారికి చూపించాను. ఆయనకు ఇది ఎంతో నచ్చింది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందంటూ అభినందించారు. ఈ సినిమాను చిత్తూరులోని ఓ గ్రామంలో తీశాం. ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన భావనను 'ఉసురే' కలిగిస్తుంది' అని చెప్పారు. ఈ సినిమాలో తాను హీరోని, హీరోయిన్ ను కొట్టానని, గతంలో 'ప్రేయసి రావే' సినిమాలో శ్రీకాంత్ మీద కూడా చేయి చేసుకున్నానని, ఆ సినిమా హిట్ అయినట్టే ఇదీ హిట్ అవుతుందని రాశి చెప్పింది. హీరో, హీరోయిన్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని రాశి తెలిపింది. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లతో పాటు సంగీత దర్శకుడు కిరణ్ జోజ్ కూడా పాల్గొన్నారు.
Also Read: Boney Kapoor: జాన్వీ కపూర్ తండ్రి.. నయా లుక్! సోషల్ మీడియా షేక్
Aslo Read: Rashmi Gautham: రష్మీ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది