Dhanush: 'కాంతార', 'ఓజీ' తో ధనుష్ రిస్క్ చేస్తున్నాడా...
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:38 PM
దసరా పోటీ ఉత్కంఠ రేపుతోంది. తెలుగు సినిమాలే పోటీ తట్టుకోలేక రావాలా వద్దా అని ఆలోచిస్తుంటే.. ఓ హీరో మాత్రం రంగంలోకి దిగిపోతున్నాడు. ఎదురుగా ఎవరైనా ఉండనీ తగ్గేదేలే అంటూ సవాల్ విసరుతున్నాడు ఆ హీరో.
తెలుగునాట ఇండస్ట్రీకి అత్యంత క్రేజ్ ఉండే సీజన్లలో దసరా ఒకటి. మరికొన్ని రోజుల్లో ఈ పండగ రాబోతోంది. దీంతో మేకర్స్ బరిలోకి దిగేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే ఈసారి పండగ సీజన్ లో చాలా పెద్ద పోటీనే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాల కంటే ఇతర భాషలకు చెందిన హీరోల పాన్ ఇండియా మూవీలే గట్టిపోటీ ఇవ్వబోతుండటం ఆసక్తిరేపుతోంది.
ఈసారి దసరా బరిలో మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'కాంతారా ఛాప్టర్ 1' (Kantara: Chapter 1) పోటీలో నిలవబోతోంది. మొదటి పార్ట్ కు వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఈ సినిమాతో పోటీ పడటానికి వెనకడుగు వేస్తున్నారు. కానీ అవేం పట్టించుకోకుండా కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush) పోటీకి వస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'కాంతార ప్రీక్వెల్'కు ముఖ్యంగా కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో భారీ బజ్ ఉన్నప్పటికీ, ధనుష్ తన 'ఇడ్లీ కడై' (Idli Kadai) సినిమాను అక్టోబర్ 1నే రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించాడు. ఇప్పుడు 'కాంతారా'తో పోటీ ఉన్నా... వెనకడుగు వేయనంటున్నాడు. తమిళనాడులో ఈ మూవీని ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ ఫిల్మ్స్ పంపిణీ చేస్తోంది. దాంతో భారీగానే ఈ సినిమా తమిళనాట రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో డబ్ చేస్తున్నారు. అది కూడా అక్టోబర్ 1నే రాబోతోంది. ఇక ఇటు జాన్వీకపూర్ నటిస్తున్న ' సంస్కారీ కి తులసి కుమారి' అక్టోబర్ 2న వస్తోంది. దీంతో ధనుష్ డేరింగ్ ను చూసి అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు.
మరోవైపు దీనికి వారం ముందు బిగ్ స్క్రీన్లపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సందడి చేయబోతున్నాడు. 'ఓజీ'ని క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని... ఆ తర్వాత రెండు వారాల పాటు తెలుగు సినిమాలేవీ థియేటర్లోకి వచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఇలాంటి సిట్యూవేషన్ లో 'ఇడ్లీ కొట్టు'తో తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో!?
Read Also: Ghaati: అదిరిన గ్లింప్స్.. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కోలాహలం.
Read Also: Movie Ticket Rates GST: తగ్గనున్న.. సినిమా టికెట్ ధరలు.. కింది క్లాసులకు భారీ ఊరట