Movie Ticket Rates GST: త‌గ్గ‌నున్న.. సినిమా టికెట్ ధ‌ర‌లు.. కింది క్లాసులకు భారీ ఊరట

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:58 PM

జీఎస్టీలో భారీ తగ్గింపు జరిగింది. ఈ తగ్గింపును దీపావళి కానుక అన్నారు. కానీ ముందుగానే దసరా సంబరాల్లోనే తగ్గిన జీఎస్టీ అమలు కానుంది. మరి మన సినిమాపై ఈ తగ్గింపు ఎలాంటి ప్రభావం చూపనుంది?

Tax Reduction on Movie Tickets

ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా దీపావళి (Deepavali) కి జీఎస్టీ తగ్గిస్తామని ఇటీవల ప్రకటించారు ప్రధాని మోదీ (Modi). ఇందులో సినిమాలకూ జీఎస్టీ (Gst) తగ్గించారు. దీపావళి కంటే ముందే దసరాకే తగ్గించిన జీఎస్టీ అమలు కానుంది. సెప్టెంబర్ 22 నుండే ఇది ఆచరణలోకి రానుంది. అంటే దసరా (Dasara) నవరాత్రులు ప్రారంభం అవుతున్నప్పుడే జీఎస్టీ తగ్గింపు అమలు కాబోతోంది. ప్రస్తుతం వంద రూపాయలకు పైగా ఉన్న టిక్కెట్ పై 18 శాతం జీఎస్టీ ఉంది. ఇందులో ఏ మార్పూ లేదు. ఇక నూరు రూపాయల లోపు టిక్కెట్ పై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఇందులోనే భారీగా తగ్గించారు. ఇంతకు ముందు ఉన్న 12 శాతం జీఎస్టీని ప్రస్తుతం 5 శాతం చేశారు. అలా 'నెక్ట్స్ జెన్ జీఎస్టీ రీఫార్మ్'లో భాగంగా వంద రూపాయల లోపు సినిమా టిక్కెట్ పై ఏడు శాతం తగ్గింది. ఇది నిజంగా కింది క్లాసుల టిక్కెట్స్ కొనేవారికి భారీ ఊరట అని చెప్పవచ్చు.


ప్రస్తుతం మన తెలుగు సినిమా (Telugu Cinema) కు గుండెకాయలా నిలచాయి హైదరాబాద్ లాంటి నగరాలు. ఇక్కడ అత్యధికంగా మల్టీప్లెక్స్ (Multiplex) స్క్రీన్స్ లోనే కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏ స్టార్ సినిమానో, లేక క్రేజ్ ఉన్న మూవీనో సింగిల్ థియేటర్స్ లోనూ సందడి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ థియేటర్స్ కు వెళ్ళి సినిమాలు చూసేవారికి ఈ తగ్గించిన జీఎస్టీ పెద్దగా ఉపయోగపడదనే చెప్పాలి. ఎందుకంటే మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టిక్కెట్ రేటు వంద రూపాయలకు పైగానే ఉంటుంది. కొన్ని మల్టీ ప్లెక్స్ ల్లోనే వంద లోపు టిక్కెట్స్ కూడా ఉన్నాయి. అలాంటి చోట 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే ఒక్కో మల్టీప్లెక్స్ లో కింది క్లాస్ టిక్కెట్స్ ఎన్ని ఉంటాయి? ఎక్కువగా వంద రూపాయలు, అంతకు పై రేటుతోనే టిక్కెట్స్ లభిస్తూంటాయి. అందువల్ల మల్టీప్లెక్సుల్లో ఎక్కువ రేటు పెట్టి సినిమా చూసేవారికి తగ్గిన జీఎస్టీ వర్తించదు.


ఇక బి, సి సెంటర్స్ విషయానికి వస్తే అక్కడ కూడా కొన్ని థియేటర్స్ లో పై క్లాసులు వంద రూపాయలు, అంతకు పైనే ఉంటున్నాయి. కాబట్టి ఆ టిక్కెట్స్ కొనేవారికి తగ్గిన జీఎస్టీ అంతగా ఉపయోగపడదు. అక్కడ కింది క్లాసుల వారికి మాత్రం తప్పకుండా తగ్గించిన జీఎస్టీ అమలవుతుంది. థియేటర్స్ వారు ఎప్పటిలాగే కింది క్లాస్ టిక్కెట్స్ ను అమ్మితే ప్రేక్షకులు జీఎస్టీని అదే పనిగా గుర్తు చేయాలి. తగ్గిన జీఎస్టీ కారణంగా టిక్కెట్ ధర కూడా తగ్గాలని ఆడియెన్స్ డిమాండ్ చేయవలసి ఉంటుంది. లేకపోతే పాత టిక్కెట్ పైనే ఐదు శాతం జీఎస్టీ కట్టేసి, మిగిలినది ఎగ్జిబిటర్స్ లబ్ధి పొందుతారు. ఈ విషయంలో సగటు ప్రేక్షకులు జాగరూకతతో ఉండాలి. మరి ఈ తగ్గిన జీఎస్టీ కారణంగా బి,సిల్లో సినిమాహాళ్ళకు వచ్చి మూవీస్ చూసే వారి సంఖ్య పెరుగుతుందేమో చూద్దాం.

Also Read: Pushpa Raj x Sheelavathi Audio Call: ఘాటీతో.. పుష్ప‌రాజ్! అల్లు అర్జున్‌కు.. ఫోన్ చేసిన అనుష్క‌

Also Read: Young Tiger: వెట్రిమారన్ వైపు యన్టీఆర్ చూపు

Updated Date - Sep 04 , 2025 | 05:22 PM