The Pet Detective: ఓటీటీలోకి.. అనుపమా పరమేశ్వరన్ మూవీ
ABN, Publish Date - Nov 26 , 2025 | 01:30 PM
అనుపమా పరమేశ్వరన్ నటించిన పరభాషా చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఆమె నటించిన 'ది పెట్ డిటెక్టివ్' మూవీ సైతం తెలుగు భాషల్లో జీ 5లో అందుబాటులోకి రాబోతోంది.
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఈ మధ్య కాలంలో తన జోరు పెంచింది. ఈ యేడాది ఆమె మూడు భాషల్లో నటించిన ఏడు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఆరు సినిమాలు విడుదల కాగా ఏడవ చిత్రం 'లాక్ డౌన్' (Lockdown) డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. దీనిని తెలుగులో 'నిర్బంధం' పేరుతో డబ్ చేస్తున్నారు. తమిళ చిత్రం 'డ్రాగన్' (Dragon) ఫిబ్రవరి మూడో వారంలో వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది అనుపమకు ఈ యేడాది శుభారంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'పరదా' (Paradha) ఆగస్ట్ మూడో వారంలో వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమా సూపర్ బజ్ క్రియేట్ చేసుకున్నా... ఆశించిన స్థాయిలో ఆదరణ మాత్రం పొందలేదు. అలానే ఆ తర్వాత ఆమె తెలుగులో 'కిష్కిందపురి' (Kishkindhapuri) మూవీలో నటించింది. ఇదీ కమర్షియల్ ఫర్వాలేదనిపించింది. ఇక పలు వివాదాలకు దారి తీసిన 'ఎస్.జె.కె.: జానకీ వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' బాక్సాఫీస్ బరిలో పెద్దంత ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలోనే అనుపమా పరమేశ్వరన్ నటించిన మలయాళ చిత్రం 'ది పెట్ డిటెక్టివ్' (The Pet Detective) విడుదలైంది. ఆ తర్వాత దీపావళికి విక్రమ్ తనయుడు దృవ్ నటించిన 'బైసన్' (Bison) వచ్చింది. అనుపమ నటించిన తమిళ చిత్రాలతో పాటు, మలయాళ చిత్రం సైతం తెలుగులో డబ్ అయ్యింది. అలానే ఇప్పుడు 'ది పెట్ డిటెక్టివ్' మూవీ సైతం తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలో జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను జీ 5లో నవంబర్ 28న తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ష్రాఫ్ యు దీన్ నిర్మించడంతో పాటు హీరోగా నటించాడు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను వినాయకన్, వినయ్ ఫార్ట్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ పోషించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గ కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్ స్పెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు.
కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్ వీటిని చూస్తే ప్రియదర్శన్ మూవీస్ గుర్తొస్తాయి. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా నటుడు, నిర్మాత ష్రాఫ్ యు దీన్ మాట్లాడుతూ 'ది పెట్ డిటెక్టివ్ సినిమా నాకెంతో ప్రత్యేకం. నటుడిగానే కాదు... నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ప్రేక్షకులు ఎక్కువ ఆలోచన చేయకుండా సరదాగా, మనసారా నవ్వుకునేలా ఓ సినిమా చేయాలని భావనతో దీనిని తీశాం. ఇప్పుడీ సినిమాకు జీ 5లో మలయాళంలో వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకు రావడం సంతోషాన్ని కలిగిస్తోంది' అని అన్నారు.
Also Read: Theater Movies: నవంబర్ చివరి వారం.. ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే
Also Read: Jagannath: సినిమా నచ్చకపోతే.. గల్లా పట్టుకుని అడగండి