Kollywood: రాజకీయాలపై ధనుష్ దృష్టి
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:21 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయాల వైపు ఆసక్తి కనబరుస్తున్నాడని సమాచారం. అభిమానులందరినీ క్రోడీకరించి, వారిని పార్టీ కార్యకర్తలు గా మార్చే వ్యూహానికి ధనుష్ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) రూట్ మార్చబోతున్నాడనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. నిజానికి తమిళనాడు రాజకీయాలు, సినిమా రంగం చెట్టపట్టాలేసుకునే కొన్ని దశాబ్దాలుగా తిరుగుతున్నాయి. కరుణానిధి (Karunanidhi), ఎంజీఆర్ (MGR), జయలలిత (Jayalalitha) వీళ్లంతా ముఖ్యమంత్రులు కాకముందు... రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించిన వారే. అలానే ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ తో పాటు శివాజీ గణేశన్, టి. రాజేందర్, శరత్ కుమార్ వంటి వారు కొన్ని పార్టీలలో ప్రధాన పదవులను నిర్వహించారు. మరి కొందరు సొంత పార్టీలు పెట్టారు.
చిత్రం ఏమంటే... రజనీకాంత్ (Rajinikanth) వంటి సూపర్ స్టార్ పాలిటిక్స్ లోకి అడుగుపెడతానని, సొంత పార్టీ పెడతానని చెప్పి... చివరకు యూ టర్న్ తీసుకున్నారు. అందరితో మంచిగా ఉండాలనుకునే రజనీకాంత్ లాంటి వారికి పాలిటిక్స్ పడవని సన్నిహితులు చెబుతుంటారు. అయితే... రజనీకాంత్ సమకాలీనుడైన కమల్ హాసన్ (Kamal Haasan) మాత్రం సొంత పార్టీ పెట్టాలనే కోరికను తీర్చుకున్నారు. రాజకీయ నేతగా గొప్ప విజయాలను అందుకోలేకపోయినా, ఎదురు దెబ్బలు తగిలినా... ఇప్పటికీ పార్టీని నిర్వహిస్తున్నారు. ఆ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో అధికార డీఎంకెకు మద్దత్తు పలికాడు కమల్ హాసన్. దాంతో తాజాగా ఆయనను డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపింది. ఇదే సమయంలో స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జయలలిత మరణానంతరం అన్నా డీఎంకే చీలిపోవడంతో దానిని భర్తీ చేసే క్రమంలో తాను పార్టీ పెట్టి లబ్ది పొందొచ్చని విజయ్ భావించి ఉండొచ్చు. ఈసారి జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని విజయ్ చెబుతున్నారు. అందుకే పొంగల్ కానుకగా రాబోతున్న 'జన నాయగన్' తర్వాత ఇక సినిమాలు చేయనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ చేయని పనిని ఆయన మాజీ అల్లుడు ధనుష్ చేయబోతున్నాడని సమాచారం. ధనుష్ కు సైతం రాజకీయాల మీద ఆసక్తి ఉందని, అందుకే అతను అందుకోసం ఇప్పటి నుండే రంగాన్ని సిద్థం చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. సహజంగా హీరోలు తమ అభిమానులను తరచూ కలుసుకోవడం, వారి అవసరాలను తీర్చడం అనేది చేస్తూనే ఉంటారు. అయితే కొందరు మాత్రం ప్రత్యేకంగా వారికోసం కొంత సమయం కేటాయించి ఫోటోలు దిగుతుంటారు. తమ సినిమాల విడుదల సమయంలో ఇలా హీరోలు చేయడం పరిపాటి. కానీ ధనుష్ మాత్రం ఇందుకు భిన్నంగా ఇకపై 25 వారాల పాటు ప్రతి ఆదివారం అభిమానులను కలుసుకుని, వారితో చర్చించి, ఫోటోలు దిగాలనే నిర్ణయం తీసుకున్నాడట. ప్రతి వారం 500 మంది అభిమానులతో ఆయన ఇంటరాక్ట్ కాబోతున్నాడట. ఈ కార్యక్రమానికి గత ఆదివారమే శ్రీకారం చుట్టాల్సి ఉన్నా... ధనుష్ కాలికి దెబ్బ తగలడంతో దానిని 27వ తేదీకి వాయిదా వేశాడట. కేవలం సినిమాలు, వాటి ప్రమోషన్స్ కోసమైతే... ఇంత సమయం వెచ్చించాల్సిన పనిలేదని, ధనుష్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఆలోచనతోనే ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. గతంలోనూ కొందరు స్టార్ హీరోలు ఫోటోల పేరుతో అభిమానులకు ఎర వేసి ఆ తర్వాత వారిని పార్టీ కార్యకర్తలుగా మార్చేసిన వైనాలు తమిళనాట ఉన్నాయి. సో ధనుష్ రాజకీయ అరంగేట్రమ్ కోసమే ఇదంతా చేస్తున్నాడా? లేదా? అనేది తెలియాలంటే కొంత కాలం ఓపిక పట్టాలి.
Also Read: N. T. Ramarao: అరవై వసంతాల 'దేవత'
Also Read: Prithviraj Sukumaran: ఎస్‌ఎస్‌ఎంబీ29పై కీలక వ్యాఖ్యలు