Prithviraj Sukumaran: ఎస్‌ఎస్‌ఎంబీ29పై కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:21 PM

మహేశ్‌ (Mahesh), ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమాపై మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహేశ్‌ (Mahesh), ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29) చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. అయితే రాజమౌళి వైపు నుంచి ఈ సినిమాకు సంబంధించి అధికారికగాఆ ఎలాంటి అప్‌డేట్‌ రావడం లేదు. అభిమానులు అయితే అసలు సినిమా ఏం జరుగుతుందో, ఎంత వరకూ జరిగిందో తెలియాలంటూ అప్‌డేట్‌ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన ‘సర్జమీన్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘రాజమౌళి చిత్రాలు భారీగా ఉంటాయి. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా అలాగే ఉంటుంది. ఇదొక అద్భుత దృశ్య కావ్యం. ప్రతిఒక్కరినీ అలరించేలా కథను చెప్పడంలో ఆయన ఎక్స్‌పర్ట్‌. ఈ సినిమాను విజువల్‌ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు’ అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చారు. విహారయాత్రలో భాగంగా మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లారు. ప్రియాంక చోప్రా బహమాస్‌ తీరంలో సేద తీరుతున్నారు. ఆగస్టులో తిరిగి షూటింగ్‌ ప్రారంభిస్తారని తెలిసింది. మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జులైలో టీమ్‌ అంతా కెన్యాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాలనుకున్నారు. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌, ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో మరికొందరు తారలు పాల్గొనాల్సి ఉంది. పలు కారణాల వల్ల తాజా షెడ్యూల్‌ను నిలిపివేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉంటా. దానికి వల్ల నాకు నెగటివిటీ పెరగవచ్చు కానీ మొహమాటానికి పోతే అంతకు మించి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కథల ఎంపికలో ఇంకా పకడ్భందీగా ఉంటా. స్ర్కిప్ట్‌ నాకు సరిపోతుందని అనిపిస్తే నటుడిగా, ఫిల్మ్‌ మేకర్‌గా కాకుండా ఒక సగటు సినీ ప్రేమికుడి కోణంలో చూసిన తర్వాత అంగీకరిస్తా. అలా చాలా కథలు చేయనని చెప్పిన సందర్భాలున్నాయి. దాని వల్ల నన్ను బ్యాడ్‌గా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ‘సర్జమీన్‌’కు నో చెప్పడానికి ఒక్క అంశం కూడా కనిపించలేదు. 2022లో నేను ఈ స్ర్కిప్ట్‌ చదివాను. కథను తెరకెక్కించే విషయంలో స్పష్టత దర్శకుడిలో ఉందో లేదో కూడా చూసుకుంటా’ అని అన్నారు. ఆయన నటించిన ‘సర్జమీన్‌’ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - Jul 24 , 2025 | 03:22 PM