N. T. Ramarao: అరవై వసంతాల 'దేవత'

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:51 PM

నటరత్న ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన 'దేవత' చిత్రం విడుదలై అరవై యేళ్ళు పూర్తయ్యింది. దీనిని ప్రముఖ హాస్యనటులు పద్మనాభం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వల్లం నరసింహారావు సంయుక్తంగా నిర్మించారు.

NTR Devatha

తెలుగు చిత్రసీమలో పేరెన్నికగన్న కొందరు హాస్యనటులు చిత్ర నిర్మాణంలోనూ సాగి అలరించారు. అందరికన్నా మిన్నగా అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) ఒక్కరే లాభాలు ఆర్జించారు. మిగిలిన వారిలో కస్తూరి శివరావ్, పేకేటి, చలం, పద్మనాభం, రాజబాబు (Rajababu) వంటివారు సొంత చిత్రాలు నిర్మించి కొన్నిసార్లు అలరించారు. తరువాతి రోజుల్లో పరాజయాలూ చూశారు. 1960లలో స్టార్ కమెడియన్ గా సాగుతున్న పద్మనాభంకు రచయిత వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తితో అనుబంధం ఉంది. వీటూరి (Veeturi) పలు నాటకాలు రాశారు. అలా ఓ నాటకంగా రాసిన ఓ కథను పద్మనాభంతో చర్చించారు. అది నాటకం కంటే సినిమాగా పనికి వస్తుందని పద్మనాభం అన్నారు. తరువాత ఆ కథను తామే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పద్మనాభంకు, ఆయన మిత్రుడయిన మరో నటుడు వల్లం నరసింహారావుకు కలిగింది. తాము నిర్మించే తొలి చిత్రం తప్పకుండా లాభాలు ఆర్జించేలా ఉండాలని ఆశించారు మిత్రులు.


యన్టీఆర్ కాల్ షీట్స్ తో...

యన్టీఆర్ (NTR) అంటే ఎంతో అభిమానమున్న పద్మనాభం ఆ కథ విషయాన్ని ఆయనతో చర్చించారు. యన్టీఆర్ కూడా బాగుందన్నారు. మీరు కాల్ షీట్స్ ఇస్తే తామే ఆ చిత్రాన్ని నిర్మిస్తామని అన్నారు పద్మనాభం, వల్లం. వారిద్దరూ అంటే యన్టీఆర్ కు ఎంతో అభిమానం. యన్టీఆర్ తొలిసారి హీరోగా కనిపించిన 'షావుకారు'లో పద్మనాభం నటించారు. అలాగే యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన 'పాతాళభైరవి'లోనూ పద్మనాభం ఉన్నారు, అలాగే వల్లం నరసింహారావు కూడా కనిపించారు. తన చిత్రాల ద్వారా గుర్తింపు సంపాదించిన వారంటే రామారావుకు అమితాభిమానం. అందువల్లే ఆ మిత్రుల అభ్యర్థనకు అంగీకారం తెలిపారు రామారావు. అలా వీటూరి కథకు యన్టీఆర్ ఓకే చెప్పారని తెలియగానే, పద్మనాభంకు సావిత్రి (Savitri), రాజనాల, నాగయ్య, నిర్మలమ్మ వంటివారు కూడా బాసటగా నిలిచారు. అలా 'దేవత' (Devatha) సినిమా మొదలయింది. పద్మనాభం తనయుడు మురళి, వల్లం కూతురు రేఖ పేరుతో 'రేఖా అండ్ మురళీ కంబైన్స్' పేరుతో బ్యానర్ పెట్టారు. పద్మనాభం సోదరుడు బి. పురుషోత్తం నిర్మాతగా వ్యవహరించారు. కె. హేమాంబరధర రావును దర్శకునిగా ఎంచుకొని 'దేవత' చిత్రం నిర్మించారు పద్మనాభం. 1965 జూలై 24వ తేదీన 'దేవత' సినిమా జనం ముందు నిలచి వారి మనసులు గెలిచింది.

'దేవత' కథ ఏమిటంటే - ఎంత అన్యోన్యంగా ఉండే ప్రసాద్, సీత జీవితంలో అనుకోని పరిస్థితి ఏర్పడుతుంది. రైలు ప్రమాదంలో సీత మరణించగా, అచ్చు ఆమెలాగే ఉండే లలితను తన భార్యగా పొరబడతాడు ప్రసాద్. ఆమె తన భార్య కాదని తెలుసుకున్న తరువాత ఆమె ప్రియునితోనే పెళ్ళి జరిపించాలనుకుంటాడు. అనుమానంతో లలిత ప్రియుడు ఆమె నిరాకరిస్తాడు. చివరకు ప్రసాద్, లలిత ఒక్కటయే పరిస్థితులు ఏర్పడతాయి. కథ సుఖాంతమవుతుంది.

పద్మనాభం కోసం...

ఈ కథను వీటూరి సినిమాగా మలచిన తీరు ఆకట్టుకుంది. ఇక ఇందులో హీరో బావమరిదిగా పద్మనాభం నటించారు. అతనికి సినిమా పిచ్చి ఉంటుంది. దాంతో మద్రాసు వెళ్ళి వేషాల కోసం పాకులాడతాడు. చివరకు బుద్ధి వచ్చి ఇంటికి తిరిగివస్తాడు. ఈ నేపథ్యంలో పద్మనాభంపై తెరకెక్కించిన సన్నివేశాలు, పాటలు కూడా ఆకట్టుకుంటాయి. పద్మనాభం మద్రాసులో తిరిగే సమయంలో కొందరు తారలను కలుసుకుంటాడు. అలా యస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి, అంజలీదేవి, జమున వంటివారు ఈ సినిమా తారలుగానే కనిపించడం మరో విశేషం. నగేశ్, బాలకృష్ణ (అంజి), పేకేటి, రాజబాబు వంటి కమెడియన్స్ కూడా పద్మనాభం కోసం గెస్ట్ రోల్స్ లో అలరించారు. రాజనాల ప్రతినాయకునిగా కనిపించినా, కొద్దిసేపే తెరపై తళుక్కుమన్నారు. పద్మనాభం పార్ట్ నర్ వల్లం నరసింహారావు ఇందులో రెండో సావిత్రి ప్రియునిగా కాసేపు కనిపించారు.

'దేవత' చిత్రానికి ఎస్పీ కోదండపాణి సంగీతం ప్రాణం పోసింది. శ్రీశ్రీ, దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, పాలగుమ్మి పద్మరాజు ఒక్కో పాట రాయగా మిగిలిన మూడు పాటలను వీటూరి పలికించారు. 'దేవత'లోని 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి...', 'తొలి వలపే పదే పదే...', 'కన్నుల్లో మిసమిసలు...' వంటి సూపర్ హిట్ సాంగ్స్ వీటూరి కలం నుండే జాలువారాయి. మరో విశేషమేంటంటే ఈ సినిమాలో విశేషాదరణ పొందిన 'బొమ్మను చేసి ప్రాణము పోసి...' అంటూ సాగే పాటను శ్రీశ్రీ రాసినా, ఆ పాటకు పల్లవిని రాసింది వీటూరి! ఈ విషయాన్ని శ్రీశ్రీనే స్వయంగా తెలిపారు. పద్మనాభంపై చిత్రీకరించిన 'మావూరు మదరాసు...' పాటను కొసరాజు రాయగా, 'భళారే ధీరుడ నీవేరా...' సాంగ్ ను పాలగుమ్మి పద్మరాజు పలికించారు. 'అరె ఖుషి ఖుషీ...' అని మొదలయ్యే గీతాన్ని దాశరథి, 'నాకు నీవే కావలెరా...' అంటూ సాగే పాటను సి. నారాయణ రెడ్డి రాశారు. 'నాకు నీవే కావలెరా...' సాంగ్ లో వాణిశ్రీ నర్తించారు. ఇందులోని 'మా ఊరు మదరాసు.. నా పేరు రాందాసు' పాటను పద్మనాభం, గీతాంజలి ఆలపించడం విశేషం.


తెలుగు తెరపై 'దేవత'లు...

యన్టీఆర్ నటజీవితంలోనే కాదు తెలుగు సినిమా రంగానికే 1965 సంవత్సరం ఓ మరపురానిది. ఆ యేడాది యన్టీఆర్ నటించిన 8 చిత్రాలు డైరెక్ట్ గా వంద రోజులు చూశాయి. అందులో 'దేవత' కూడా ఒకటిగా నిలచింది. 'దేవత' ఐదు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు ముందు 1941లో బి.యన్. రెడ్డి రూపొందించిన వాహినీ వారి 'దేవత' ఓ క్లాసిక్ గా నిలచింది. 1982లో ఇదే టైటిల్ తో కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో డి.రామానాయుడు నిర్మించిన 'దేవత' విశేషాదరణ చూరగొంది.

'దేవత'తోనే ముందుకు సాగిన పద్మనాభం...

తొలి చిత్రం 'దేవత' ఘనవిజయం సాధించడంతో పద్మనాభం తరువాత 'పొట్టిప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీరామకథ, కథానాయిక మొల్ల, మిడతం బొట్లు, పెళ్ళికాని తండ్రి' వంటి చిత్రాలు నిర్మించారు. వీటిలో 'శ్రీరామకథ, మిడతం బొట్లు, కథానాయిక మొల్ల, పెళ్ళికాని తండ్రి' చిత్రాలకు పద్మనాభం దర్శకునిగానూ వ్యవహరించారు. 'దేవత' చిత్ర నిర్మాణ సమయంలో పద్మనాభం తన ఆస్తిని మొత్తం తాకట్టు పెట్టి మరీ సినిమా తీశారని కొందరు ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు. నిజానికి 1960లలో పద్మనాభం బిజీగా సాగుతున్నారు. ఆర్థికంగానూ బలంగానే ఉన్నారు. ఈ విషయాలు అవాస్తమని పద్మనాభం అప్పట్లోనే ఖండించారు. అయినా ఇప్పటికీ అలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. యన్టీఆర్ కాల్ షీట్స్ ఇవ్వడం వల్లే 'దేవత' వెలిసిందని, అదే తన జీవితాన్ని నిలిపిందనీ, తరువాత పొరపాట్ల వల్ల ఇతర చిత్రాలతో నష్టపోయానని పద్మనాభం చెప్పేవారు.

Also Read: Hyper Aadi - HHVM Review: హరిహర వీరమల్లు.. హైపర్‌ ఆది రివ్యూ

Alsr Read: Bollywood: కబీర్ సింగ్ కు చెక్ పెట్టిన సయారా

Updated Date - Jul 24 , 2025 | 03:23 PM