The Hunt: రాజీవ్ గాంధీ హత్య కేసు రివ్యూ
ABN, Publish Date - Jul 05 , 2025 | 02:11 PM
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో 'ది హంట్' అనే వెబ్ సీరీస్ ను ప్రముఖ దర్శకుడు నగేశ్ కుకునూరు రూపొందించాడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
భారత దేశ ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీ (Indira Gandhi)తో పాటు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ (Rajeev Gandhi) సైతం హత్యకు గురయ్యారు. ఖలిస్తాన్ సానుభూతి పరులు ఇందిరాగాంధీని హత్య చేస్తే... ఆమె మరణానంతరం దేశ ప్రధానిగా ఎన్నికైన రాజీవ్ గాంధీని శ్రీలంకకు చెందిన ఎల్.టి.టి.ఈ. (L.T.T.E.) ఉగ్రవాదులు మానవబాంబుతో చంపేశారు. మొదటిసారి భారతదేశంలో ఇలా మానవబాంబు ద్వారా హత్యకు గురైంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే.
మే 21, 1991లో లోక్ సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ (Sriperumbudur) వెళ్ళిన రాజీవ్ గాంధీని రాత్రి సమయంలో అతి సమీపంలో ధాను అనే శ్రీలంక (Sri Lanka) మహిళ మానవబాంబుగా మారి హతమార్చింది. అక్కడ నుండి 90 రోజుల పాటు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎలా ఈ కేసును పరిష్కరించింది? అన్నదే 'ద హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్' (The Hunt: The Rajiv Gandhi Assassination case) వెబ్ సీరిస్. 'హైదరాబాద్ బ్లూస్' (Hyderabad Blues) తో దర్శకుడిగా మారిన నగేశ్ కుకునూరు (Nagesh Kukunoor) బాలీవుడ్ బాటపట్టి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలోనే 'ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు' వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన 'నైంటీ డేస్' (Ninety Days: The True Story of the Hunt for Rajiv Gandhi's Assassins) నవల ఆధారంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను తీశారు. దీనికి నగేశ్ కుకునూర్ తో కలిసి రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ తప్పకుండా మరోసారి దేశ ప్రధాని అవుతారనే నమ్మకం అందరికీ కలిగింది. అదే ఎల్.టి.టి.ఈ. అధినేత ప్రభాకరన్ కు కంటగింపుగా మారింది. శ్రీలంక కు భారతీయ సైన్యాన్ని పంపి ఎల్.టి.టి.ఈ. కార్యకర్తల మరణానికి రాజీవ్ గాంధీ కారకుడయ్యాడనే కోపం తీవ్రంగా ఉన్న ప్రభాకరన్ ఆయన్ని మరోసారి అధికార పీఠం ఎక్కకుండా చేయాలని భావించాడు. అందుకోసం రాజీవ్ గాంధీని మానవబాంబు ద్వారా చంపాలని ప్లాన్ చేశాడే. పకడ్బందిగా దీనిని అమలు జరపడం కోసం కొన్ని ట్రయిల్స్ కూడా వేశారు. దురదృష్టం రాజీవ్ గాంధీ పక్షాన ఉండటంతో ముందు షెడ్యూల్ లో లేకపోయినా... విధి ఆయన్ని శ్రీపెరంబుదూర్ కు రప్పించింది. అక్కడ ఎల్.టి.టి.ఈ. తీవ్రవాదులకు అన్నీ అంశాలు కలిసి వచ్చాయి. వాళ్ళు తమ పథకాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేయగలిగారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అప్పటి కేంద్ర ప్రభుత్వం డి. ఆర్. కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేసింది. అందులో అమిత్ వర్, రాఘవన్, అమోద్ కాంత్, రాధా వినోద్ రాజు, కెప్టెన్ రవీంద్ర తదితరులు ఉన్నారు. ఈ బృందం రాజీవ్ గాంధీ హంతకులను ఎలా గుర్తించింది? ఎలా వెంటాడి వేటాడింది? ఆ క్రమంలో ఎవరు అరెస్ట్ అయ్యారు? ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు? అనే అంశాలను విపులంగా ఈ వెబ్ సీరిస్ లో చూపించారు.
దేశ ప్రధానిగా పనిచేసిన ఓ వ్యక్తిని హతమార్చి ఆ తర్వాత కూడా చాలా కూల్ గా తమ కార్యకలాపాలలో నిమగ్నమైన ఎల్.టి.టి.ఈ. సానుభూతి పరులను ప్రధానంగా పట్టి ఇచ్చింది సంఘటనా స్థలంలో దొరికిన కెమెరా! అందులోని ఫోటోల ఆధారంగా ఈ కేసు సరైన ట్రాక్ లో సాగింది. సిట్ అధికారులు రేయింబవళ్ళు కష్టపడి, అనేక ఆటు పోట్లను, విమర్శలను, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతిబంధకాలను ఎదుర్కొని దీనిని ఎలా పరిష్కరించారనేది ఆసక్తికరంగానే పిక్చరైజ్ చేశారు.
సోనీ లివ్ లో జులై 4 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సీరిస్ లో ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు యాభై నిమిషాల పాటు సాగింది. దీంతో ప్రతి అంశాన్ని కూలంకషంగా చూపించే ఆస్కారం దక్కింది. ఇందులో డి.ఆర్. కార్తికేయన్ గా అమిత్ సియాల్ చక్కగా నటించారు. ప్రభుత్వ పరమైన ఒత్తిడులను ఎదుర్కోవటమే కాకుండా.. తమ టీమ్ లోని సభ్యులను అసంతృప్తులను సరిచేసే వ్యక్తిగా ఆ పాత్రను బాగా డీల్ చేశారు. అలానే అమిత్ వర్మ పాత్రను సాహిత్ వైద్ సమర్థవంతంగా పోషించాడు. తమిళ నటుడు భగవతీ పెరుమాళ్ ఇప్పటికే పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన రఘోత్తమన్ అనే పోలీస్ అధికారిగా నటించారు. సిట్ టీమ్ మెంబర్స గా డానిష్ ఇక్బాల్, గిరిశ్ శర్మ, విద్యుత్ గార్గ్ చేశారు. ఒంటి కన్ను శివరాసన్ గా శఫీక్ ముస్తఫా నటించగా, నళినిగా అంజనా బాలాజీ, శుభ గా గౌరీ పద్మ కుమార్, మానవ బాంబు ధాను గా శ్రుతి జయన్, ప్రభాకరన్ గా జ్యోతిష్ ఎం.జీ యాక్ట్ చేశారు.
రేటింగ్: 2.75/ 5
ట్యాగ్ లైన్: రాజీవ్ హత్య తర్వాత....