సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Salakaar: ఇండో - పాక్ సంబంధాలపై మరో వెబ్ సీరిస్

ABN, Publish Date - Aug 20 , 2025 | 07:39 PM

అజిత్ దోవల్ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ 'సలాకార్'. ప్రస్తుతం ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Salakaar Web Series

భారతదేశానికి, పాకిస్తాన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందిప్పుడు. నిజానికి ఈ వైరం అఖండ భారత్ రెండు దేశాలుగా విడిపోయినప్పటి నుంచి ఉంది. కాకపోతే అప్పుడప్పుడు దేశాధినేతల చొరవ కారణంగా స్నేహహస్తం చాస్తూ ఉంటారు. తిరిగి పాక్ తోక ఝాడించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరం నేపథ్యంలో చాలానే సినిమాలు, వెబ్ సీరిస్ లు వచ్చాయి, వస్తున్నాయి. ఇటీవల జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో వచ్చిన 'సలాకార్' (Salakaar) కూడా ఆ కోవకు చెందిందే.


ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి నోట ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో పాటు అజిత్ దోవల్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా విదేశాలలో భారత్ కు సంబంధించిన ఏ సంఘటన చోటు చేసుకున్నా వినిపించే పేరు ఆయనదే. ఐపీఎస్ అధికారి అయిన అజిత్ దోవల్ కొంతకాలం భారతదేశ గూఢచారిగా వివిధ దేశాలలో పనిచేశారని అంటారు. ముఖ్యంగా ఆయన పాకిస్తాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా ఉన్నారని, ఆ దేశ ఆనుపానులన్నీ దోవల్ కు కొట్టిన పిండేనని చెప్పుకుంటారు. తాజాగా రూపుదిద్దుకున్న 'సలాకార్' వెబ్ సీరిస్ లో అజిత్ దోవల్ ను పోలిన పాత్ర కూడా ఉంది. ఇది ఫిక్షనల్ స్టోరీ అని మేకర్స్ చెప్పినా... కథంతా అజిత్ దోవల్ పాత్రధారి ద్వారానే సాగుతుంది. దాంతో ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ కు ముందే కొంత బజ్ ను క్రియేట్ చేసింది.

'సలాకార్‌' కథ విషయానికి వస్తే... ఇది 1978లోనూ, 2025లోనూ జరిగే కథ. ప్రస్తుత పాకిస్థాన్ లో బ్రిగేడియర్ గా ఉన్న అశ్ఫాక్ ఉల్లా (సూర్య శర్మ) చేతికి ఓ ఫైల్ లభిస్తుంది. అందులో 1978లో పాకిస్తానీ మిలటరీ డైరెక్టర్ జియా - ఉల్ - హక్ (ముఖేష్ రిషి) అణుబాంబు తయారీకి సంబంధించిన బ్లూ ప్రింట్ వివరాలు భద్రపరుస్తాడు. ఆయన మరెవరో కాదు అశ్ఫాక్ ఉల్లా తాతయ్య. ఆ సమయంలో ఆయన పూర్తి చేయలేకపోయిన పనిని తాను చేయాలని అశ్ఫాక్ భావిస్తాడు. దానిని అతను భారత్ మీదే ప్రయోగించబోతున్నాడనే సమాచారం పాకిస్తాన్ లోని సీక్రెట్ ఏజెంట్ సృష్టి చతుర్వేది ఉరఫ్ మరియం (మోనీ రాయ్) ద్వారా ఇండియాలోని 'రా' కు తెలస్తుంది. ఈ విషయాన్ని 'రా' చీఫ్‌... నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అధిర్ దయాల్ (పూర్ణేందు భట్టాచార్య)కు తెలియచేస్తాడు. అక్కడ నుండి ఈ ఆపరేషన్ ను తాను డీల్ చేస్తానని 'రా' చీఫ్ కు దయాల్ చెబుతాడు.

నిజానికి 1978లో జియా - ఉల్ - హక్‌ అణుబాంబు తయారీ వ్యూహాన్ని భగ్నం చేసేది కూడా అధిర్ దయాలే. భారతదేశం స్మైలింగ్ బుద్థ పేరుతో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసినప్పుడే పాకిస్తాన్ కూడా అలాంటి ఓ ప్రయత్నం చేస్తుంది. దానికి జియా ఉల్ హక్ నేతృత్వం వహిస్తాడు . ఆ సమయంలో పాకిస్తాన్ లోని భారత్ హైకమీషన్ లో ఉద్యోగిగా ఉన్న సీక్రెట్ ఏజెంట్ దయాల్... జియా ఉల్ హక్ కుట్రను భగ్నం చేస్తాడు. మళ్ళీ ఇన్నేళ్ళకు దానికి సంబంధించిన ఫైల్ అశ్ఫాక్ ఉల్లా చేతికి చిక్కడంతో కథ మొదటికి వస్తుంది. ఇప్పుడు దయాల్ ఈ తాజా కుట్రను ఎలా భగ్నం చేశాడనే దాన్ని మొదటి సీజన్ లో చూపించే ప్రయత్నం దర్శకుడు ఫరూక్ కబీర్ చేయలేదు.

యువకుడిగా ఉండగా 1978లో దయాల్ చేసిన సాహసోపేతమైన చర్యలకు మాత్రమే ఈ ఐదు ఎపిసోడ్స్ ఉన్న 'సలాకార్' లో చోటు కల్పించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 25 నిమిషాల పాటు ఉంది. రెండు, మూడు ఎపిసోడ్స్ కాస్తంత నిదానంగా సాగినా... ఐదో ఎపిసోడ్ లో ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్ళారు. పాకిస్తాన్ లో కన్నుమూసిన తన సహోద్యోగి మనవరాలిని కాపాడటం కోసం దయాల్ ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ కు వెళ్ళి ఆమెను దుబాయ్ కు తరలించే సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. సాధ్యాసాధ్యలను పక్కన పెడితే... వ్యూవర్స్ లో ఓ రకమైన క్యూరియాసిటీని దర్శకుడు కబీర్ కలిగించాడు. పైగా అది అజిత్ దోవల్ పాత్ర అనే భావనలో కలగడం వల్ల చాలామంది దానితో కనెక్ట్ అవుతారు.


అయితే ఈ వెబ్ సీరిస్ లో గొప్పగా చెప్పుకోదగ్గ కొత్త అంశాలేవీ లేవు. మేకింగ్ వాల్యూస్ కూడా అంతంత మాత్రమే. కాకపోతే కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ సిందూర్ జరిగిన నేపథ్యంలో సరైన సమయంలో జియో హాట్ స్టార్ ఈ వెబ్ సీరిస్ వచ్చినట్టు అనిపిస్తుంది. నటీనటులలో తెలుగువారికి బాగా సుపరిచితమైన వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ముఖేష్ రిషి (Mukhesh Rushi) మాత్రమే. మిగిలిన వారిలో కాస్తంత నలిగిన పేరు మౌనీరాయ్ (Mouni Roy) ది. వీరిద్దరూ బాగా చేశారు. వీరితో పాటు అశ్ఫాక్ ఉల్లా పాత్రను పోషించిన సూర్య శర్మ (Surya Sharma) గురించి చెప్పుకోవాలి. అలానే దయాల్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రను నవీన్ కస్తూరియా (Naveen Kasturia) చేశాడు. పాకిస్తాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా అతను వేసే మారు వేషాలను చూస్తుంటే... అప్పట్లో కృష్ణ (Krishna) జేమ్స్ బాండ్ సినిమాల్లో వేసిన మారువేషాలే గుర్తొస్తాయి. టెక్నీలజీ అంతగా లేని ఆ సమయంలో సీక్రెట్ ఏజెంట్స్, అందుబాటులో ఉన్న వనరులతోనే తమ పనులు ఎలాగో కానిచ్చేవారు. ఇది నలభై ఐదేళ్ళ క్రితం జరిగిన స్పై ఆపరేషన్ కాబట్టి ఎడ్జెస్ట్ అయిపోవాలి. ప్రధాన పాత్ర మధ్య ఉన్న సంబంధాన్ని దర్శకుడు లింక్ చేసిన పద్ధతి బాగుంది.

'సలాకార్' వంటి వెబ్ సీరిస్ చూసినప్పుడు దేశ రక్షణ కోసం పరాయి ప్రాంతాలల్లో ప్రాణాలకు తెగించిన పనిచేస్తున్న సీక్రెట్ ఏజెంట్స్ పట్ల గౌరవం పెరుగుతుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే 'సలాకార్' నచ్చే ఆస్కారం ఉంది. అయితే 'ఫ్యామిలీ మెన్' వంటి వెబ్ సీరిస్ ఇచ్చే కిక్ ను ఇది ఇవ్వలేదనే చెప్పాలి.

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్: అజిత్ దోవల్ స్ఫూర్తితో...

Updated Date - Aug 20 , 2025 | 07:39 PM