సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Devika & Danny : దేవిక అండ్ డానీ వెబ్ సీరిస్ రివ్యూ

ABN, Publish Date - Jun 07 , 2025 | 08:31 AM

రీతూ వర్మ నటించిన తొలి వెబ్ సీరిస్ 'దేవిక అండ్ డానీ' ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అది ఎలా ఉందో తెలుసుకుందాం.

తెలుగమ్మాయి రీతూ వర్మ (Ritu Varma) తమిళ చిత్రాలలోనూ నటించి చక్కని గుర్తింపు తెచ్చుకుంటోంది. రొటీన్ కు కాస్తంత భిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అలాంటి రీతూ వర్మ నటించిన తొలి వెబ్ సీరిస్ 'దేవిక అండ్ డానీ' (Devika &Danny). దీన్ని 'శ్రీకారం' (Srikaaram) ఫేమ్ బి. కిశోర్ (B. Kishore) డైరెక్షన్ లో సుధాకర్ చాగంటి (Sudhakar Chaganti) ప్రొడ్యూస్ చేశారు. ఈ వెబ్ సీరిస్ ఇప్పుడు జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


కథ ఏమిటంటే...

దేవికా నందన్ (రీతూ వర్మ) ఆంధ్రప్రదేశ్ లోని ఓ పల్లెటూరిలోని స్కూల్ లో మ్యూజిక్ టీచర్ గా పని చేస్తుంటుంది. ఆమెకు జగన్నాథం ఉరఫ్ జగ్గీ (సుబ్బరాజు Subbaraju) తో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. మూడు నెలల్లో పెళ్ళి అనగా తన జీవితంలో ఎలాంటి మ్యాజిక్ జరగడం లేదని, బావిలో కప్పలా జీవితాన్ని గడిపేస్తున్నానని ఆమె లోలోపల బాధపడుతూ ఉంటుంది. పెళ్ళి సందర్భంగా దేవిక జాతకం చూసిన ఓ పెద్దాయన త్వరలోనే ఆమె ఓ కొత్త బంధంలోకి ప్రవేశిస్తుందని చెబుతాడు. అలా ఆమె జీవితంలోకి ఊహించని విధంగా డానీ (సూర్య వశిష్ఠ Surya Vasistta) వస్తాడు. దేవికతో పరిచయం పెంచుకుని, ఆమె తాతయ్య యోగి నందన్ (రామరాజు) తో సాయం పొందాలని డానీ భావిస్తాడు. కానీ అందుకు దేవిక నిరాకరిస్తుంది. విషయం ఏమిటంటే... డానీ భౌతికంగా ఉన్న మనిషి కాదు ఓ ఆత్మ. దేవిక తాతయ్య ఆత్మలతో సంభాషించి, వారి కష్టాలను తీర్చే సామర్థ్యం ఉన్న వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పని చేయడం మానేస్తాడు. కాబట్టి తన తాతయ్యతో డానీ విషయాన్ని చెప్పలేనని దేవిక స్పష్టం చేస్తుంది. బట్... డానీ హత్యకు కారణం తెలిసిన తర్వాత దేవిక మనసు మార్చుకుంటుంది. బావిలో కప్పలా పెరిగిన ఆమె చొరవ చూపించి రంగంలోకి దిగుతుంది. డానీ తాను చేయాలనుకున్న ఏ పనిని అయితే పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశాడో దానిని కంప్లీట్ చేయడానికి సిద్ధపడి, సుబ్బు (శివ కందుకూరి Siva Kandukuri) సాయంతో దాన్ని పూర్తి చేస్తుంది.


ఓ పల్లెటూరి అమ్మాయి... తాను ఇష్టపడే వ్యక్తి కోసం ప్రాణాలకు సైతం తెగించి ఎలా పోరాడింది, చివరకు అందులో ఎలా విజయం సాధించింది? అనేదే 'దేవిక అండ్ డానీ' వెబ్ సీరిస్ లోని ప్రధానాంశం. ఈ మొదటి సీజన్ లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. దాదాపు మూడున్నర గంటల నిడివితో ఇది సాగింది. అయితే... కథలో కానీ కథనంలోనే గానీ మనకు కొత్తదనం కనిపించదు. సిటీ మధ్యలోని స్థలంపై కబ్జాదారులు కన్నువేయడం, దాన్ని ఆక్రమించడం కోసం ఎంతకైనా తెగించడం, వాళ్ళ ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడం, చివరకు బాధితులకు న్యాయం చేకూర్చడం... ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లో చూశాం. ఇక నిస్సహాయతతో కూడిన ఆత్మలు తమ సమస్యలను ఏకరువు పెట్టి హీరోల ద్వారా వాటిని పరిష్కరించుకునే సినిమాలూ చాలానే వచ్చాయి. అయితే... ఇందులో ఆ పనిని హీరోయిన్ చేస్తుంది. అంతే తేడా!

నటీనటుల విషయానికి వస్తే...

పల్లెటూరి అమ్మాయి పాత్రలో రీతూవర్మ చక్కగా ఇమిడి పోయింది. ఆమె పాత్రను తీర్చిదిద్దే విషయమై దర్శకుడు కిశోర్ మంచి గానే ఫోకస్ పెట్టాడు. ఇందులోని మరో కీలక పాత్ర సూర్య వశిష్ఠ ది. నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న డానీ పాత్రను అతను సమర్థవంతంగా పోషించాడు. విశేషం ఏమంటే... ఈ వెబ్ సీరిస్ లో చాలామంది నటీనటులు తమ ఇమేజ్ కు భిన్నమైన పాత్రలను పోషించి, మెప్పించారు. కోవై సరళ (Kovai Sarala) అనగానే మనకు ఆమె చేసే హాస్యపాత్రలే గుర్తొస్తాయి. కానీ అనాధ ఆశ్రమ నిర్వాహకురాలు గాయత్రమ్మగా ఆమె ఉదాత్త పాత్రను చేసింది. ఐటమ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న అభినయశ్రీ (Abhinaya Sri) లో ఫెరోషియస్ విలన్ ను దర్శకుడు చూపించారు. శివ కందుకూరితో కామెడీ చేయించే ప్రయత్నం చేయించారు. తండ్రి పాత్రల్లో తనదైన మార్క్ చూపుతున్న గోపరాజు రమణ (Goparaju Ramana) లోనూ విలనీని చూపించారు. ఇక సుబ్బరాజు కామెడీ పండించడం అనేది కొంతకాలంగా జరుగుతున్నదే. ఇతర ప్రధాన పాత్రలను శివన్నారాయణ, రజిత, రామరాజు, అనంత్, మౌనిక రెడ్డి, సోనియా, చమ్మక్ చంద్ర, షణ్ముఖ్, హర్ష చెముడు, ఐశ్వర్య ఉల్లింగల తదితరులు పోషించారు. 'బిగ్ బాస్' ఫేమ్ దివి లాస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సీరిస్ కు సీజన్ 2 కూడా ఉండబోతోందని చివరి ఎపిసోడ్ లో లీడ్ ఇచ్చారు.

ఎలా ఉందంటే...

'దేవిక అండ్ డానీ' వెబ్ సీరిస్ కు కథ, మాటలు సందీప్ రాజ్ అందించాడు. సినిమాటోగ్రఫీని వెంకట్ సి దిలీప్ సమకూర్చాడు, సంగీతాన్ని అందించిన జై క్రిష్ సందర్భానుసారంగా అన్నమయ్య కీర్తనలను వాడారు. పల్లెటూరి నేపథ్యంలో కథ సాగడంతో అంతా పచ్చదనమే అలుముకుంది. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడమే ఈ వెబ్ సీరిస్ లోని ప్రధానమైన లోపం. అయితే వెబ్ సీరిస్ అనగానే అడల్ట్ కంటెంట్ ను, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను బలవంతంగా చొప్పించడం సర్వసాధారణం అయిపోయింది. అలాంటి చీప్ ట్రిక్స్ జోలికి 'దేవిక అండ్ డానీ' మేకర్స్ పోక పోవడం అభినందించదగ్గది. భారీ అంచనాలు పెట్టుకోకుండా టైమ్ పాస్ కోసం దీన్ని ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్: ఆత్మ ఘోష!

Also Read: Sri Sri Sri Raajavaru Review: నార్నె నితిన్ మొదటి సినిమా ఎలా ఉందంటే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 07 , 2025 | 09:24 AM