Suresh Productions: సురేశ్‌ బాబు బ్యాక్ టు పెవిలియన్... కారణం ఇదే!

ABN , Publish Date - Dec 19 , 2025 | 02:25 PM

'సురేశ్‌ ప్రొడక్షన్స్'కు వరుసగా ఐదు ఫ్లాప్ సినిమాలు రావడంతో తాను ఈ రంగంలోకి రావాల్సి వచ్చిందని సురేశ్‌ బాబు తెలిపాడు. మూడు తెలుగు సినిమాలతో పాటు ఒక తమిళ, మరో హిందీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యాయని సురేశ్ బాబు అన్నారు.

Suresh Babu

మూవీ మొఘల్ డి. రామానాయుడు (D Ramanaidu) పిల్లలు సురేశ్ బాబు (Suresh Babu), వెంకటేశ్‌ (Venkatesh) ఇద్దరూ కూడా ఉన్నత విద్యను విదేశాలలో అభ్యసించారు. వెంకటేశ్ ఫారిన్ నుండి రాగానే 'కలియుగ పాండవులు' మూవీతో హీరోగా అయ్యాడు. అయితే దానికంటే ముందే సురేశ్‌ బాబు... ఫారిన్ నుండి వచ్చి తండ్రి రామానాయుడు నిర్మించే సినిమాలకు చేదోడు వాదోడుగా నిలిచాడు. నిజానికి సురేశ్‌ బాబు ఫారిన్ లో ఎడ్యుకేషన్ పూర్తి కాగానే ఇండియా వచ్చి, బిజినెస్ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన్ని విధి సినిమా నిర్మాతగా మార్చేసింది. దానికి వెనుక ఓ ఆసక్తికరమైన సంఘటన ఉంది.


డి. రామానాయుడు సినిమా నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో జయాపజయాలు రెండింటినీ చవిచూశారు. సురేశ్‌ ప్రొడక్షన్స్ నుండి వచ్చిన తొలి చిత్రం 'రాముడు - భీముడు' (Ramudu Bheemudu) మంచి విజయం సాధించినా... ఆ తర్వాత కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇక సినిమా నిర్మాణం వదిలేద్దాం అనుకున్న ప్రతిసారి ఆ సంస్థకు ఏదో ఒక సినిమా ద్వారా ఘన విజయం దక్కి తిరిగి విజయపథంలోకి రావడం జరిగింది. ఈ సంస్థ 'సోగ్గాడు' (Soggadu) ముందు తీసిన సినిమాలు కొన్ని నిరాశకు గురిచేశాయి. ఆ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. దానికి ముందు 'ప్రేమనగర్' (Premnagar) కు ముందు కూడా అలాంటి పరిస్థితే రామానాయుడుకు ఎదురైంది. అక్కినేని (Akkineni) నటించిన 'ప్రేమనగర్' సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆయన తిరిగి నిలదొక్కుకున్నారు.

కృష్ణ (Krishna), శోభన్ బాబు (Sobhan Babu) తో రామానాయుడు తీసిన 'మండే గుండెలు' మంచి విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత ఆయన నిర్మిచిన 'కక్ష', 'అగ్నిపూలు', 'ప్రేమమందిరం' చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అంతేకాదు.. 'చిలిపి కృష్ణుడు' హిందీ రీమేక్ 'బందీష్‌', రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'తనికట్టు రాజా' సైతం ఫ్లాప్ అయ్యాయి. రెండేళ్ళ వ్యవధిలో ఇలా వరుసగా ఐదు చిత్రాలు పరాజయం పాలయ్యేసరికీ రామానాయుడుకు ఏం చేయాలో బోధపడలేదు.


అప్పటికి విదేశాల్లో చదువుకుంటున్న సురేశ్‌ బాబు ఇండియా వచ్చి వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ సొంత నిర్మాణ సంస్థ నష్టాల్లో పడిపోవడంతో ఆ ఆలోచన విరమించుకుని ఇండియా వచ్చి, సొంత సంస్థ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 'కక్ష' చిత్రాన్ని 'వంజమన్' పేరుతో తమిళంలోకి డబ్ చేసి, కొంత లాభాలు సంపాదించారు. అలానే తమిళ చిత్రం 'తనికట్టు రాజా'ను తెలుగులో 'గ్రామకక్షలు' పేరుతో డబ్ చేశారు. అది పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకు రావడంతో పాటు కొంత మేర లాభాలను గడించింది. ఆ తర్వాత తండ్రి రామానాయుడుకు సురేశ్‌ బాబు దన్నుగా నిలిచి ప్రొడక్షన్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవడంతో... శోభన్ బాబు, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'దేవత' (Devatha) తో మళ్ళీ ఈ సంస్థ గ్రాండ్ విక్టరీని అందుకుంది. అలా 1980 - 81 లో వచ్చిన ఐదు ఫ్లాప్ సినిమాలే తనను ఈ రంగంలోకి తీసుకొచ్చాయని సురేశ్‌ బాబు తెలిపారు.

Also Read: Aamir–Hirani: ‘3 ఇడియట్స్’ సీక్వెల్

Also Read: Chiranjeevi Hanuman: ‘చిరంజీవి హనుమాన్‌ -ది ఎటర్నల్‌’ తొలి ఏఐ థియేట్రికల్‌ సినిమా

Updated Date - Dec 19 , 2025 | 02:46 PM