Chiranjeevi Hanuman: ‘చిరంజీవి హనుమాన్ -ది ఎటర్నల్’ తొలి ఏఐ థియేట్రికల్ సినిమా
ABN , Publish Date - Dec 19 , 2025 | 01:22 PM
హనుమంతుడి కథతో ఏఐ టెక్నాలజీతో ‘చిరంజీవి హనుమాన్ -ది ఎటర్నల్’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI - ఏఐ) రోజురోజుకి అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఎంతో కీలకమైన వాటిల్లోనూ ఏఐను ఉపయోగిస్తున్నారు. వాణిజ్య రంగాల్లోనే కాక, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ దీని హవా బాగా నడుస్తోంది. ఫిల్మ్ మేకర్స్ కూడా ఏఐతో ప్రయోగాలు చేయడానికి ముందుడుగు వేస్తున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. హనుమంతుడి కథతో ఏఐ టెక్నాలజీతో ‘చిరంజీవి హనుమాన్ -ది ఎటర్నల్’ (Chiranjeevi Hanuman: The Eternal) పేరుతో సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. భారతీయ పురాణేతిహాసం-రామాయణంలో కీలక పాత్రధారి అయిన హనుమంతుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఉత్కంఠగానూ, అత్యంత భయానకంగానూ ఉంటుందని దర్శకుడు చెప్పారు.
‘హనుమంతుడి కథ చెప్పాలంటే ఐడియాలు, ఆలోచనలు ఇన్నోవేటివ్‌గా ఉండాలి. కథలో ఫ్లేవర్ పోకుండా పెరిగిన టెక్నాలజీని ఉపయోగించి కథను చెప్పడం నాకెంతో ఇష్టం. కాలాతీతమైన కథ ఇది. ఎన్నిసార్లు తెరపై ఆవిష్కరించినా కొత్తగానే ఉంటుంది. హనుమాన్ బలం, భక్తిని తెరపై ఆవిష్కరించబోతున్నాం. ఇది నాకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నా. పూర్తిగా కొత్త కోణంలో కథను తెరపై చూపించడానికి విక్రమ్ - విజయ్‌లతో చేతులు కలిపాను. ఇండియాలో ఇది తొలి ఏఐ థియేట్రికల్ సినిమా కానుంది. దీని కోసం కలెక్టివ్‌గా వర్క్ చేయబోతున్నాం. గలెరీ5 నుంచి 50 మందికి పైగా ఇంజనీర్ల బృందం దీనికి పని చేస్తోంది. కథ, కథనంలో ప్రామాణికతను డిఫైన్ చేయడానికి పండితులు, సాహిత్య నిపుణులు, రచయితలతో చర్చలు నిర్వహిస్తున్నాం’ అని అన్నారు. అబుండంటియా ఎంటర్‌టైన్‌మెంట్ - కలెక్టివ్ మీడియా పతాకంపై విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఏఐలో ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అన్నదానిపై ఆసక్తి పెరిగింది.